'నేతాజీ ఫైళ్లు బహిర్గతం'
న్యూఢిల్లీ: ఏళ్ల తరబడి రహస్యంగా, వివాదాస్పదంగా ఉన్న ప్రముఖ స్వాతంత్ర్య సమరయోధుడు నేతాజీ సుభాష్ చంద్రబోస్ విమాన ప్రమాదానికి సంబంధించిన ఫైళ్లను చెప్పిన మాట ప్రకారం పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం విడుదల చేసింది. కోల్ కతా పోలీసులు మొత్తం 64 పైళ్లను బహిర్గతం చేశారు.
కోల్ కతాలోని పోలీసు మ్యూజియంలో సోమవారం నుంచి ప్రజలకు అందుబాటులోకి తీసుకురానున్నారు. ప్రస్తుతం వాటిని పోలీసు ఉన్నత కార్యాలయంలో ఉంచారు.దీంతో ఆయన మరణానికి సంబంధించిన పలు అనుమానాలు వీడనున్నాయి. ఈ ఫైళ్లతోపాటు కొన్ని డీవీడీలు కూడా బయటపెట్టిన హోంశాఖ డీవీడీలను నేతాజీ కుటుంబ సభ్యులకు అందజేసింది. ఈ ఫైళ్లలో మొత్తం 12,744 పేజీలు ఉన్నాయి.
'12,744 పేజీలతో మొత్తం 64 ఫైల్స్ ఉన్నాయి. వాటిని బహిర్గతం చేశాం. అన్ని ఫైల్స్ డిజిటలైజ్ చేశాం' అని కోల్ కతా పోలీసు కమిషనర్ సురజిత్ కర్ పర్కాయస్థ అన్నారు. కీళక ఫైళ్లను విడుదల చేస్తున్న సందర్భంగా పలువురు ఆయన కుటుంబ సభ్యులు పోలీసు హెడ్ క్వార్టర్స్కు వచ్చారు. వీరిలో నేతాజీ మేనళ్లుడు కృష్ణ బోస్ భార్య కూడా ఉన్నారు. అయితే, ఈ ఫైళ్లు విడుదలకు ఆదేశాలు జారీ చేసిన ముఖ్యమంత్రి మమతా బెనర్జీతోపాటు ప్రభుత్వ ప్రతినిధులు ఎవ్వరూ కూడా ఈ కార్యక్రమంలో లేకపోవడం గమనార్హం. 1937 నుంచి 1947 మధ్య జరిగిన అంశాలు ఈ పైళ్లలో ఉన్నట్లు సమాచారం.
కాగా, ఈ ఫైళ్లు పెద్దగా ప్రాముఖ్యం లేనివని, వీటి ద్వారా అంత కీలకమైన సమాచారం పెద్దగా తెలియకపోవచ్చని పలువురు అంటున్నారు. కీలకమైన దస్త్రాలు అన్నీ కూడా కేంద్ర ప్రభుత్వం ఆదీనంలోనే ఉన్నట్లు తెలిసింది. విదేశాలతో జాతీయ అంతర్జాతీయ సమస్యలు వచ్చే అవకాశం ఉన్నందున నేతాజీ అదృశ్యానికి సంబంధించిన దస్త్రాలను విడుదల చేయలేమని గత ఆగస్టులో ప్రధాని కార్యాలయం కేంద్ర సమాచార కమిషన్కు చెప్పడం కూడా అసలైన ఫైల్స్ కేంద్రం వద్దే ఉన్నాయనే అంశాన్ని స్పష్టం చేస్తుంది. వచ్చే ఏడాది బెంగాల్లో ఎన్నికలు ఉన్న నేపథ్యంలో రాజకీయంగా లబ్ధి పొందాలనే ఉద్దేశంతోనే మమత ఇప్పుడు ఆ ఫైల్స్తో హడావిడికి తెరతీశారని పలువురు భావిస్తున్నారు.