సాక్షి, భువనేశ్వర్ : మొబైల్ సిమ్‌కార్డు యాక్టివేట్ చేసుకోవాలంటూ సాక్షాత్తూ ఒక వైద్యుడిని నిలువునా ముంచేసిన వైనం కలకలం రేపింది. బ్యాంకు అధికారులు, ఇతర నిపుణులు ఎన్ని హెచ్చరికలు చేస్తున్నా.. చదువుకున్న వారు సైతం సైబర్ మాయగాళ్ల వలలో పడి లక్షల రూపాయలను పోగొట్టుకోవడం గమనార్హం.
వివరాల్లోకి వెళితే ఒడిశాలోని కటక్‌కు చెందిన డాక్టర్ సనతాన్ మొహంతి సైబర్ మోసానికి దారుణంగా బలయ్యాడు. కేటుగాడి మాయలోపడి రూ .77 లక్షలకు పైగా నష్టపోయారు. తన మొబైల్ సిమ్ కార్డును త్వరగా యాక్టివేట్ చేసుకోవాలని., లేదంటే బ్లాక్ అవుతుందంటూ ఫిబ్రవరి 9 మహంతికి సైబర్ నేరగాడు ఫోన్ చేశాడు. గూగుల్ ప్లే స్టోర్ నుంచి ‘క్విక్ సపోర్ట్’ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకుని బ్యాంక్ వివరాలను ఇవ్వమని తానే స్వయంగా సిమ్ యాక్టివేట్ చేస్తానంటూ నమ్మబలికాడు. అతని మాటల్ని విశ్వసించిన మహంతి మరో ఆలోచన చేయకుండా డెబిట్ కార్డు నంబర్, ఇతర బ్యాంక్ వివరాలను యాప్‌లోని షేర్ చేశారు. అంతే...అదే రోజు సాయంత్రం ఏటీఎం లావాదేవీలను నిలిపివేస్తున్నట్టు అకస్మాత్తుగా ఎస్‌బీఐ నుంచి మెసేజ్ వచ్చింది. అంతేకాదు ఈ వ్యవహారంపై బ్యాంకులో ఫిర్యాదు చేసిన తరువాత కూడా అతని ఖాతాలోని నగదు సర్వం గోవిందా అయిపోయింది. దీంతో ఖంగుతిన్న మహంతి సైబర్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేయడంతో ఈ మోసం వెలుగులోకి వచ్చింది.
దీనిపై సంబంధిత తులసీపూర్ ఎస్‌బీఐ బ్రాంచ్‌లో మహంతి మొదట ఫిర్యాదు చేశారు. 25 వేల రూపాయల చొప్పున రెండుసార్లు తన ఖాతాలనుంచి నగదు విత్‌డ్రా అయిందని డాక్టర్ తన ఫిర్యాదులో పేర్కొన్నారు. అయితే కొత్త ఎటిఎం కార్డు జారీ చేస్తామని, ఇకపై మెసపూరిత లావాదేవీలు జరగవని బ్రాంచ్ మేనేజర్ హామీ ఇచ్చారు. కానీ ఫిబ్రవరి 9నుండి ఫిబ్రవరి 15 వరకు తనకు సంబంధం లేకుండానే ఆన్‌లైన్ ట్రాన్సాక్షన్స్ జరిగాయనీ, బ్యాంక్ ఫిక్స్‌డ్ డిపాజిట్ చేసిన రూ .67లక్షలు మాయమయ్యాయని తెలిపారు. మొత్తం జీవితమంతా కష్టపడి సంపాదించుకున్న రూ. 77,86,727 రూపాయలు నష్టపోయానని మహంతి ఆరోపించారు. దీనిపై దర్యాప్తు జరిపి తన డబ్బును తిరిగి ఇప్పించేలా తక్షణ చర్యలు తీసుకోవాలని ఐఐఈని ఆశ్రయించారు.
Comments
Please login to add a commentAdd a comment