సాక్షి, సిటీబ్యూరో: వరుస సెలవుల నేపథ్యంలో స్పెషల్ ఆఫర్...వర్కింగ్ డే రోజు డబ్బు డ్రా చేసుకునే అవకాశం... అంటూ నగరవాసికి ఎర వేసిన సైబర్ నేరగాళ్లు రూ.1.2 లక్షలు స్వాహా చేశారు. అప్పటి వరకు తన యాప్‌లో కనిపించిన మొత్తం హఠాత్తుగా కనుమరుగు కావడంతో తాను మోసపోయినట్లు బాధితుడు గుర్తించాడు. బుధవారం సిటీ సైబర్ క్రైమ్ ఠాణాలో ఫిర్యాదు చేయడంతో కేసు నమోదైంది. శ్రీనగర్ కాలనీ ఎక్స్‌టెన్షన్‌కు చెందిన ఓ యువకుడు ప్రస్తుతం ఉద్యోగ ప్రయత్నాల్లో ఉన్నాడు. ఇతడికి గతంలో ఇంటర్‌నెట్ ద్వారా క్లిక్ ప్రొ మీడియా లిమిటెడ్ సంస్థ వివరాలు తెలిశాయి. వీరి వద్ద రూ.10 వేలు పెట్టుబడి పెడితే ప్రతి నెలా 10 శాతం వడ్డీగా అందిస్తారు.
వాళ్లు ఇచ్చే యూజర్ నేమ్, పాస్‌వర్డ్ ద్వారా మై క్లిక్ బ్యాంక్ యాప్‌లోకి ఎంటర్ కావాలి. అక్కడ జమ అయ్యే మొత్తాన్ని బ్యాంకు ఖాతాకు మళ్లించుకుని డ్రా చేసుకోవాలి. కొన్ని నెల క్రితం రూ.10 వేలు కట్టి ఈ స్కీమ్‌లో చేరిన యువకుడికి ఇప్పటి వరకు రూ.5600 వచ్చాయి. దీంతో ఇతడికి ఈ సంస్థపై పూర్తి నమ్మకం వచ్చింది. యువకుడికి శుక్రవారం ఆ సంస్థ నుంచి ఫోన్ వచ్చింది. వారి ప్రతినిధిగా మాట్లాడిన యువతి వరుస హాలిడేస్ నేపథ్యంలో స్పెషల్ ఆఫర్ ఇస్తున్నామని చెప్పింది. రూ.40 వేలు చెల్లించి వీఐపీ గోల్డ్ కార్డ్ సభ్యుడిగా మారాలని, వీరికి ప్రతి నెలా 20 శాతం రిటర్న్‌తో పాటు ప్రత్యేక బోనస్ వస్తుందని నమ్మబలికింది.
ఈ మొత్తం ఏరోజుకారోజు యాప్‌లో జమ చేస్తామని నమ్మబలికింది. దీంతో ఈ యువకుడు శనివారం రూ.40 వేలు చెల్లించాడు. దీంతో ఇతడి యాప్‌లో కొంత మొత్తం జమైనట్లు కనిపించాయి. ఆపై మరోసారి కాల్ చేసిన యువతి మరో రూ.50 వేలు చెల్లిస్తే ప్రత్యేక ఆఫర్లు ఉన్నాయని, ఏప్రిల్ 19తో అవి ముగుస్తాయని చెప్పింది. దీంతో బాధితుడు మరో రూ.50 వేలు చెల్లించాడు. ఆపై కొద్దిసేపటికే తన యాప్‌లో చూడగా బోనస్‌గా మొత్తం రూ.8 వేలు వచ్చినట్లు కనిపించింది. ఆ మొత్తాన్ని సెలవులు ముగిసిన తర్వాత డ్రా చేసుకోవచ్చని అందులో కనిపించింది. ఈలోపు మరోసారి కాల్ చేసిన యువతి ఇంకో రూ.30 వేలు రిన్వెస్ట్ చేసింది. బుధవారం నుంచి ఆ యాప్ పని చేయకపోవడం, సంస్థ నిర్వాహకుల నుంచి స్పందన లేకపోవడంతో తాను మోసపోయానని బాధితుడు తెలుసుకున్నాడు. సిటీ సైబర్ క్రైమ్ ఠాణాలో ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసుకున్న అధికారులు దర్యాప్తు చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment