
టెక్కలి రూరల్: భర్త, పిల్లలను వదిలేసి మరో వ్యక్తితో సహజీవనం చేస్తున్న మహిళపై హత్యాయత్నం జరిగింది. పెళ్లి చేసుకోవాలని ఒత్తిడి చేస్తోందనే కోపంతో ఆమెతో సహజీవనం చేస్తున్న మృగాడే విచక్షణ రహితంగా కత్తితో దాడిచేసి తీవ్రంగా గాయపరిచాడు. ఈ దారుణ ఘటన శ్రీకాకుళం జిల్లా టెక్కలి మండలం బొరిగిపేట గ్రామ సమీపంలో శుక్రవారం రాత్రి చోటుచేసుకుంది. బాధితురాలు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..
టెక్కలి మండలం గంగాధరపేట గ్రామానికి చెందిన కొప్పల కమలకు 2005లో అదే గ్రామానికి చెందిన సింగుమహాంతి భుజంగరావుతో వివాహం జరిగింది. వీరు హైదరాబాద్‌లో పనులు చేసుకుని జీవించేవారు. వీరికి ఇద్దరు కుమారులు చరణ్, హరవర్ధన్ ఉన్నారు. అయితే పెళ్లికి ముందు నుంచే కమలకు టెక్కలి మండలం బొరిగిపేట గ్రామానికి చెందిన రైల్వే గేట్‌మెన్ సంపతిరావు దేవరాజుతో పరిచయం ఉంది. అతడిని నమ్ముకుని 2012లో భర్త, పిల్లలను వదిలి టెక్కలి వచ్చేసింది. దేవరాజుకు భార్య, పిల్లలు ఉండడంతో ఈమెను స్థానిక ఎన్‌టీఆర్ కాలనీ తొమ్మిదో లైన్‌లో అద్దె ఇంటిలో ఉంచాడు. అయితే తొమ్మిదేళ్లు అవుతున్నా కమలను దేవరాజు పెళ్లి చేసుకోలేదు.
ఈ విషయాన్ని ప్రస్తావించినప్పుడల్లా ఇరువురి మధ్య గొడవలు జరిగేవి. దీంతో కమల ఉంటే ఎప్పటికైనా ఇబ్బందులు తప్పవని భావించిన దేవరాజు ఆమెను అడ్డుతొలగించుకోవాలని భావించాడు. శుక్రవారం రాత్రి కమల ఇంటికి వెళ్లి.. పెద్ద మనుషుల వద్ద సమస్యను పరిష్కరించుకుందామని నమ్మించి బైక్‌పై బొరిగిపేట గ్రామానికి తీసుకెళ్లాడు. నిన్ను చంపేస్తే గాని హాయిగా ఉండలేనంటూ ఇంట్లో నుంచి కత్తి తెచ్చే సరికి కమల భయంతో అక్కడ నుంచి పరుగులు తీసింది. దేవరాజు కూడా వెంబడించి గ్రామ సమీపంలో వంశధార కాలువ వద్ద కత్తితో ఆమెపై దాడి చేసి చేతులు, ఒంటిపై నరకడంతో తీవ్ర రక్తస్రావమై స్పృహ తప్పి పడిపోయింది. కమల చనిపోయిందని భావించిన దేవరాజు అక్కడ నుంచి వెళ్లిపోయాడు.
కొంత సమయానికి కోలుకున్న ఆమె పాల వ్యాన్‌లో సీతాపురం గ్రామానికి చేరుకుంది. స్థానికుల సహకారంతో 108కి ఫోన్ చేయడంతో సిబ్బంది వచ్చి టెక్కలి జిల్లా ఆస్పత్రికి తరలించారు. వైద్యుడు మహారాజ్ వైద్యపరీక్షలు చేసి మెరుగైన వైద్యం కోసం విశాఖ కేజీహెచ్‌కు తరలించారు. ఈ ఘటనపై టెక్కలి సీఐ ఆర్.నీలయ్య వివరాలు సేకరించారు. కమలను గాయపరిచిన వారిలో దేవరాజుతో పాటుగా మరో వ్యక్తి ఉన్నాడని బాధితురాలు చెప్పినట్టు పోలీసులు తెలిపారు. నిందితుడు దేవరాజును అదుపులోకి తీసుకొని కేసు నమోదు చేసినట్లు సీఐ నీలయ్య, ఎస్‌ఐ కామేశ్వరరావు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment