
'సాక్షి,ఏలూరు టౌన్: రైలు ఎక్కబోతూ తల్లి, కూతురు జారిపడగా కుమార్తె మృతిచెందిన ఘటన ఏలూరు పెద్ద రైల్వేస్టేషన్‌లో సోమవారం జరిగింది. రైల్వే పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. ఏలూరు వంగాయగూడెం ప్రాంతానికి చెందిన నువ్వుల లక్ష్మి, ఆమె కుమార్తె సాయి దుర్గ సోమవారం ఉదయం విశాఖపట్నం వెళ్లేందుకు రత్నాచల్ ఎక్స్‌ప్రెస్ ఎక్కేందుకు ప్రయత్నించారు. రైలు బాగా రద్దీగా ఉండటంతో పుట్టు మూగ, చెవుడుతో ఉన్న కుమార్తె దుర్గను తల్లి ముందుగా రైలెక్కించింది. అనంతరం తానూ ఎక్కేందుకు ప్రయత్నించగా, అంతలోనే రైలు కదిలిపోయింది.
కంగారు పడిన కుమార్తె తల్లిని ఎలాగైనా ఎక్కించాలనే ఉద్దేశంతో చెయ్యి గట్టిగా పట్టుకుంది. తోటి ప్రయాణికులు సైతం వారికి సహకరించేందుకు ప్రయత్నించారు. ఈలోగా వారిద్దరూ జారిపడి రైలు బోగీ, ప్లాట్‌ఫాం మధ్యలో ఇరుక్కుపోయారు. పరిస్థితిని గమనించిన అధికారులు వెంటనే రైలును నిలిపారు. కానీ వారిద్దరూ రైలు కిందభాగాన ఇరుక్కుపోవటంతో బయటకు రాలేకపోయారు. ఆర్‌పీఎఫ్ ఏఎస్‌ఐ రామారావు, సీఐ శంకరరావు, సిబ్బంది వారిని బయటికి తీసుకువచ్చేందుకు శ్రమించారు. తీవ్రంగా గాయపడిన దుర్గను ఏలూరు జిల్లా ఆస్పత్రికి తరలించగా, అక్కడ చికిత్స పొందుతూ మృతిచెందింది. తల్లికి స్వల్ప గాయాలయ్యాయి. రైల్వే హెచ్‌సీ కేసు నమోదు చేశారు.
Comments
Please login to add a commentAdd a comment