బోయినపల్లి(చొప్పదండి): సిరిసిల్ల జిల్లా బోయినపల్లి మండలం స్తంభంపల్లిలో ఓ యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన ఘటన సోమవారం జరిగింది. పోలీసులు తెలిపిన వివరాలు.. జక్రాన్‌పల్లి మండలం బ్రాహ్మణపల్లి పంచాయతీ పరిధిలోని గాం«దీనగర్ గ్రామానికి చెందిన అందె రవితేజ (23) డ్రైవర్‌గా పని చేస్తున్నాడు. ఆదివారం రాత్రి ఇంట్లో భోజనం చేస్తున్న సమయంలో ఫోన్ వచ్చింది. భోజనం అనంతరం వాహనంలో పడుకుంటా అని చెప్పి ఇంట్లోంచి బయటకు వెళ్లాడు. ఈ క్రమంలో స్తంభంపల్లి గ్రామంలో తమ బంధువుల ఇంటికి రవితేజ వచ్చాడు. అక్కడ గేటు వేసి ఉండడంతో గేటు దూకి లోపలికి వెళ్లాడు.
తలుపులు తీయాలని బాదడంతో బంధువులు తీయలేదు. వారు బయటకు వచ్చి చూడగా అతడు అప్పటికే నిప్పంటించుకున్నాడు. ఈ క్రమంలో 100కు డయల్ చేసి పోలీసులకు సమాచారం అందించారు. ఎస్సై మహేందర్ ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. రవితేజ మృతి విషయం అతడి తల్లి జ్యోతికి ఫోన్ చేసి చెప్పారు. మృతదేహాన్ని సిరిసిల్ల ప్రభుత్వ ఆస్పత్రిలోని మార్చురీకి తరలించారు. కాగా స్తంభంపల్లిలో ఘటన జరిగిన ఇంటి పరిసరాల్లో ఆరిన రక్తపు మరకలు ఉన్నాయని మృతుడి తల్లి జ్యోతి ఫిర్యాదులో పేర్కొంది. తన కుమారుడు రవితేజకు బంధువుల అమ్మాయితో ప్రేమ వ్యవహారం ఉందని ఈ క్రమంలోనే తన కుమారున్ని కత్తితో పొడిచి హత్యచేసి ఆత్మహత్యగా చిత్రీకరిస్తున్నారని, బంధువుల యువతి, ఆమె తల్లి, మేనమామ, అల్లుడిపై అనుమానం ఉందని ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్నట్లు ఎస్సై తెలిపారు. ఘటనా స్థలాన్ని వేములవాడ డీఎస్పీ నాగేంద్రచారి, సీఐ బన్సీలాల్ పరిశీలించారు.
బంధువుల ఆందోళన
సిరిసిల్లటౌన్: స్తంభంపల్లిలో మృతిచెందిన రవితేజ బంధువులు సోమవారం సిరిసిల్ల అంబేడ్కర్ చౌరస్తాలో రాస్తారోకో చేశారు. మృతికి కారకులైన వారిని వెంటనే అరెస్టు చేయాలని బైఠాయించారు. ఈ కేసులో దోషులుగా ఆరోపిస్తూ సమీప బంధువులతో గొడవకు దిగారు. విషయం తెలుసుకున్న సిరిసిల్ల టౌన్ సీఐ అనిల్‌కుమార్ వచ్చి రవితేజ బంధువులతో మాట్లాడారు. బాధితులకు న్యాయం జరిగేలా చూస్తామని హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు.
Comments
Please login to add a commentAdd a comment