చర్ల/దుబ్బాకటౌన్: మావోయిస్టు పార్టీ కీలకనేత, మిలటరీ కమిషన్ మెంబర్, కేంద్ర కమిటీ సభ్యుడు దుబాసి శంకర్ అలియాస్ రమేశ్‌ను ఒడిశా పోలీసులు మంగళవారం అరెస్ట్ చేశారు. ఒడిశాలోని కోరాపూట్ జిల్లా ఎస్పీ గుంటుపల్లి వరుణ్ తెలిపిన వివరాల ప్రకారం.. ఆంధ్రా– ఒడిశా సరిహద్దులో ఉన్న బోయిపారాయిగూడ పోలీస్‌స్టేషన్ పరిధిలోని పెటగూడ, నోయిరా గ్రామాల్లో అనుమానాస్పద వ్యక్తులు సంచరిస్తున్నారనే సమాచారం మేరకు డీవీఎఫ్, ఎస్‌వోజీ, బీఎస్‌ఎఫ్ బలగాలు కూంబింగ్ చేపట్టాయి. అనుమానాస్పదంగా కనిపించిన దుబాసి శంకర్‌ను అదుపులోకి తీసుకొని తనిఖీ చేయగా అతడి వద్ద ఒక రైఫిల్, 10 రౌండ్ల తూటాలు, మొబైల్, రేడియో, రూ.35 వేల నగదు లభించాయి.
35 ఏళ్లుగా అజ్ఞాతవాసం: సిద్దిపేట జిల్లా దుబ్బాక మండలం చెట్లనర్సంపల్లికి చెందిన శంకర్ 1987 నుంచి మావోయిస్టు పార్టీలో పనిచేస్తూ అజ్ఞాతజీవితం గడుపుతున్నారు. 2004లో ఆంధ్రా– ఒడిశా స్పెషల్ జోనల్ కమిటీ మెంబర్‌గా, ఆ తర్వాత స్టేట్ మిలటరీ కమీషన్ మెంబర్‌గా పదోన్నతి పొందారు. ఆయన పలు ఎదురుకాల్పుల్లోంచి తప్పించుకున్నారు.
మొత్తం 25 మంది జవాన్లను హతమార్చిన ఘటనల్లో పాల్గొన్నారని, ఆయనపై 3 రాష్ట్రాల్లో 72 కేసులు ఉన్నాయని ఎస్పీ తెలిపారు. తిరుపతిలోని అలిపిరి వద్ద అప్పటి ఏపీ సీఎం చంద్రబాబు నాయుడిపై జరిపిన మందుపాతర దాడి ఘటనలో శంకర్ పాత్ర ఉన్నట్లు అప్పట్లో ప్రచారం జరిగింది. శంకర్ భార్య భారతక్క నాలుగేళ్ల క్రితం ఎన్‌కౌంటర్‌లో చనిపోయింది. వీరికి ఓ కుమారుడు ఉన్నాడు.
Comments
Please login to add a commentAdd a comment