డ్రగ్స్‌ కేసులో బడా‘బాబులు’ | Drug Peddler Case Tony Mainly Involved Bigshot | Sakshi
Sakshi News home page

డ్రగ్స్‌ కేసులో బడా‘బాబులు’

Published Sat, Jan 22 2022 4:19 AM | Last Updated on Sat, Jan 22 2022 4:20 AM

Drug Peddler Case Tony Mainly Involved Bigshot - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: మాదకద్రవ్యాల వినియోగం, విక్రయాల ఆరోపణలపై హైదరాబాద్‌ నార్త్‌జోన్‌ టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు గురువారం పట్టుకున్న సంపన్న కుటుంబాలకు చెందిన ఏడుగురి గురించి పలు ఆసక్తికర అంశాలు వెలుగులోకి వస్తున్నాయి. వీరిలో కొందరికి గతంలో పోలీసులు కౌన్సెలింగ్‌ కూడా నిర్వహించారు. అంతర్రాష్ట్ర డ్రగ్‌ పెడ్లర్‌ టోనీసహా నిందితుల్ని న్యాయస్థానం ఆదేశాల మేరకు పంజగుట్ట పోలీసులు జ్యుడీషియల్‌ రిమాండ్‌కు తరలించారు. తదుపరి విచారణ నిమిత్తం వీరిని కస్టడీలోకి తీసుకోవాలని పోలీసులు నిర్ణయించారు. నిందితుల రిమాండ్‌ రిపోర్టులో పేర్కొన్న కీలకాంశాలివీ...  

♦ నగరంలోని హిమాయత్‌నగర్‌కు చెందిన నిరంజన్‌ కుమార్‌ జైన్‌కు కొన్నాళ్ళ క్రితం ముంబైలోని ఓ పబ్‌లో టోనీతో పరిచయమైంది. అప్పటి నుంచి 30 సార్లు డ్రగ్స్‌ కొనడంతోపాటు మరికొందరు స్నేహితులకు అలవాటు చేశాడు. నిరంజన్‌ కుటుంబం ఏటా రూ.600 కోట్ల టర్నోవర్‌ ఉన్న పెద్ద కన్‌స్ట్రక్షన్‌ కంపెనీ నడుపుతోంది. నగరంలో నిర్మించిన, నిర్మాణంలో ఉన్న ఫుట్‌ ఓవర్‌ బ్రిడ్జ్‌ల్లో అనేకం వీరు చేపట్టినవే.  

♦ మరో నిందితుడైన బంజారాహిల్స్‌ నివాసి శాశ్వత్‌ జైన్‌ది కూడా కన్‌స్ట్రక్షన్‌ వ్యాపారమే. రూ.1,000 కోట్లకుపైగా ఆస్తి ఉన్న ఈ కుటుంబం నగర శివార్లలో ప్రముఖ డిటర్జెంట్‌ సబ్బుల కంపెనీ నిర్వహిస్తోంది. సీఎస్సార్‌ కింద ఏటా 400 మంది పేదలకు ఉచితంగా కిడ్నీ తదితర ఆపరేషన్లు చేయిస్తోంది. వీరి కుటుంబ సభ్యుడి పేరుతో ఉప్పల్‌ క్రికెట్‌ స్టేడియంలో ఓ పెవిలియన్‌ కూడా ఉంది. 2011లో టాస్క్‌ఫోర్స్‌ పోలీసులకు చిక్కిన ముంబైకి చెందిన అర్వింద్‌ అనే డ్రగ్‌ పెడ్లర్‌ కస్టమర్ల జాబితాలో శాశ్వత్‌ పేరు ఉండటంతో కౌన్సెలింగ్‌ చేసినా అతడితో మార్పు రాలేదు.  

♦ గౌలిపురకు చెందిన యజ్ఞానంద్‌ అగర్వాల్‌ కుటుంబం మసాలా దినుసుల వ్యాపారంలో ఉంది. ప్రముఖ బ్రాండ్‌ ఉత్పత్తులను తయారు చేసే వీరికి తెలుగు రాష్ట్రాల్లో అనేక బ్రాంచ్‌లున్నాయి. మరో నిందితుడు ప్రముఖ కాంట్రాక్టర్‌ దండు సూర్య సుమంత్‌రెడ్డి కీలక నిందితుడు నిరంజన్‌కు స్నేహితుడు. 

♦ ఇంకో నిందితుడు బండి భార్గవ్‌ తెలుగు రాష్ట్రాల్లో పలు కాంట్రాక్టులు నిర్వహిస్తున్నాడు. వెంకట్‌ చలసాని అనే నిందితుడు రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎగుమతులు, దిగుమతుల వ్యాపారి. భార్గవ్‌ ఇతడి వ్యాపార భాగస్వామి.  

♦ నిందితుల్లో కొందరు చిన్నస్థాయి పెడ్లర్లుగానూ వ్యవహరిస్తున్నారు. వీళ్ల అరెస్టు విషయం తెలియగానే స్నేహితులు, పరిచయస్తులైన 200 మంది నగరం నుంచి పరారైనట్లు పోలీసులు గుర్తించారు. నిందితులను కస్టడీలోకి తీసుకుని విచారించే సమయంలో ఎవరెవరికీ డ్రగ్స్‌ అమ్మారు? ఎక్కడెక్కడ రేవ్‌ పార్టీలు నిర్వహించారు? తదితర అంశాలను సేకరించాలని నిర్ణయించారు.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement