
ముంబై: నటుడు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మృతితో వెలుగులోకి వచ్చిన బాలీవుడ్ డ్రగ్స్ కేసులో దర్యాప్తు కొనసాగుతోంది. ఈ కేసులో నార్కొటిక్స్ కంట్రోల్ బ్యూరో ఇప్పటికే నటి రియా చక్రవర్తి, ఆమె సోదరుడు షోవిక్ చక్రవర్తి సహా పలువురు డ్రగ్ డీలర్లను అరెస్టు చేసిన విషయం తెలిసిందే. విచారణలో భాగంగా నిందితులు వెల్లడించిన వివరాల ఆధారంగా ఎన్‌సీబీ దర్యాప్తు కొనసాగిస్తోంది. ఈ క్రమంలో తాజాగా.. ముంబైలోని అంధేరీ వెస్ట్‌లో సోదాలు నిర్వహించింది. సుమారు రెండున్నర కోట్ల విలువ గల 5 కిలోల హషిష్, ఆఫీం, ఎండీఎమ్‌ఏ(మాలి) తదితర డ్రగ్స్‌ను స్వాధీనం చేసుకుంది. వీటిని సరఫరా చేస్తున్న రీగల్ మహాకల్ అనే వ్యక్తిని అరెస్టు చేసింది. కాగా మహాకల్‌తో పలువురు బీ-టౌన్ ప్రముఖులకు సంబంధాలు ఉన్నట్లు ఎన్‌సీబీ భావిస్తోంది. బాలీవుడ్ డ్రగ్స్ వ్యవహారం బయటపడిన నాటి నుంచి పరారీలో ఉన్న అతడిని పట్టుకోవడం ద్వారా కేసులో పురోగతి సాధించగలమని అధికారులు వెల్లడించారు.(చదవండి: షోవిక్ చక్రవర్తికి బెయిల్ మంజూరు)
ఇక ఈ విషయం గురించి ఎన్‌సీబీ జోనల్ డైరెక్టర్ సమీర్ వాంఖడే మాట్లాడుతూ.. ‘‘ఈరోజు మేం రీగల్ మహాకల్‌ను అరెస్టు చేశాం. రియా చక్రవర్తి, షోవిక్‌తో అతడికి సంబంధాలు ఉన్న విషయాన్ని కొట్టిపారేయలేం’’ అని పేర్కొన్నారు. కాగా రీగల్, అనూజ్ కేశ్వానికి డ్రగ్స్ సరఫరా చేయగా, అతడి నుంచి రియా వాటిని కొనుగోలు చేసి సుశాంత్‌కి ఇచ్చినట్లు సమాచారం. ఇక ఈ ఏడాది జూన్ 14న సుశాంత్ తన నివాసంలో విగత జీవిగా కనిపించిన విషయం విదితమే. ఈ నేపథ్యంలో తనతో సహజీవనం చేసిన రియా చక్రవర్తి కారణంగానే అతడు మరణించాడని సుశాంత్ తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ క్రమంలో సుశాంత్, రియా, వారి ఫ్లాట్‌లో నివసించే మరికొంత మందిని విచారించగా డ్రగ్స్ వ్యవహారం బయటపడింది. అనేక పరిణామాల అనంతరం అరెస్టైన రియా చక్రవర్తి తొలుత బెయిలుపై బయటకు రాగా, షోవిక్ కూడా ఇటీవలే జైలు నుంచి విముక్తి పొందాడు. (చదవండి: డ్రగ్స్ వాడొద్దని రియా చెప్పింది. అయినా)
Comments
Please login to add a commentAdd a comment