కేజ్రీవాల్‌ అరెస్ట్‌.. నేడు కోర్టులో ప్రవేశపెట్టనున్న ఈడీ అధికారులు | ED officials to be produced Arvind Kejriwal in court on 22 March | Sakshi
Sakshi News home page

కేజ్రీవాల్‌ అరెస్ట్‌.. నేడు కోర్టులో ప్రవేశపెట్టనున్న ఈడీ అధికారులు

Published Fri, Mar 22 2024 3:54 AM | Last Updated on Fri, Mar 22 2024 12:32 PM

ED officials to be produced Arvind Kejriwal in court on 22 March - Sakshi

గురువారం ఢిల్లీలో కేజ్రీవాల్‌ను అరెస్టు చేసి తీసుకెళ్తున్న ఈడీ అధికారులు

ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో ఢిల్లీ సీఎంను అదుపులోకి తీసుకున్న ఈడీ  

అరెస్టు నుంచి ఉపశమనం కల్పించలేమని ఢిల్లీ హైకోర్టు స్పష్టం చేసిన కొన్ని గంటల్లోనే ఈడీ ఆపరేషన్‌  

సెర్చ్‌ వారెంట్‌తో కేజ్రీవాల్‌ అధికారిక నివాసానికి అధికారులు  

తొలుత రెండున్నర గంటలపాటు విచారణ.. కేజ్రీవాల్‌తోపాటు కుటుంబ సభ్యుల ఫోన్లు సీజ్‌   

అనంతరం కేజ్రీవాల్‌ అరెస్టు... ఈడీ ప్రధాన కార్యాలయానికి తరలింపు  

నేడు కోర్టులో ప్రవేశపెట్టనున్న ఈడీ అధికారులు  

కేజ్రీవాల్‌ను తమ కస్టడీకి అప్పగించాలని కోరే అవకాశం   

ముఖ్యమంత్రి పదవిలో కేజ్రీవాల్‌ కొనసాగుతారని ఆమ్‌ ఆద్మీ పార్టీ స్పష్టీకరణ  

న్యూఢిల్లీ:  అంతా అనుకున్నదే జరిగింది. దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసుకు సంబంధించిన మనీ లాండరింగ్‌ వ్యవహారంలో ఢిల్లీ ముఖ్యమంత్రి, ఆమ్‌ ఆద్మీ పార్టీ జాతీయ కన్వీనర్‌ అరవింద్‌ కేజ్రీవాల్‌(55)ను ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌(ఈడీ) నాటకీయ పరిణామాల మధ్య అరెస్టు చేసింది. ఈ కేసులో అరెస్టు చేయకుండా కేజ్రీవాల్‌కు రక్షణ కల్పించలేమని ఢిల్లీ హైకోర్టు తేల్చిచెప్పిన కొన్ని గంటల వ్యవధిలోనే ఈడీ అధికారులు ఆయనను అదుపులోకి తీసుకున్నారు.

గురువారం సాయంత్రం నుంచి పరిణామాలు చకచకా జరిగిపోయాయి. తొలుత అదనపు డైరెక్టర్‌ నేతృత్వంలో 10 మంది ఈడీ అధికారులు సెర్చ్‌ వారెంట్‌తో ఢిల్లీ ఫ్లాగ్‌స్టాఫ్‌ రోడ్‌లోని కేజ్రీవాల్‌ అధికారిక నివాసానికి చేరుకున్నారు. రెండున్నర గంటలపాలు ప్రశ్నించారు. కేజ్రీవాల్‌తోపాటు ఆయన కుటుంబ సభ్యుల ఫోన్లను సీజ్‌ చేశారు. అనంతరం రాత్రి 9.11 గంటలకు ఆయనను అరెస్టు చేశారు. రాత్రి 11 గంటలకు తమ ప్రధాన కార్యాలయానికి తరలించారు.

కేజ్రీవాల్‌కు శుక్రవారం ఉదయం వైద్య పరీక్షలు నిర్వహించి, కోర్టులో ప్రవేశపెట్టనున్నారు. కోర్టు అనుమతితో తమ కస్టడీలోకి తీసుకొని, విచారణ జరపాలని ఈడీ అధికారులు నిర్ణయించినట్లు సమాచారం. కేజ్రీవాల్‌ అరెస్టు సమాచారాన్ని ఆయన భార్యకు తెలియజేశారు. ఢిల్లీ లిక్కర్‌ కేసులో సిట్టింగ్‌ ముఖ్యమంత్రి అరెస్టు కావడం సంచలనాత్మకంగా మారింది. ఇదే కేసులో తెలంగాణ ఎమ్మెల్సీ, బీఆర్‌ఎస్‌ నేత కల్వకుంట్ల కవితను గతవారం ఈడీ అధికారులు హైదరాబాద్‌లోని ఆమె నివాసంలో అరెస్టు చేసిన సంగతి తెలిసిందే.  


కేజ్రీవాల్‌ నివాసం వద్ద తీవ్ర ఉద్రిక్తత  
కేజ్రీవాల్‌ అరెస్టు సందర్భంగా ఆయన నివాసం వద్ద తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. ఆమ్‌ ఆద్మీ పార్టీ నేతలు, కార్యకర్తలు భారీగా తరలివచ్చారు. కేజ్రీవాల్‌కు అనుకూలంగా, ఈడీకి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా కేజ్రీవాల్‌ నివాసం చుట్టూ ఢిల్లీ పోలీసులతోపాటు ర్యాపిడ్‌ యాక్షన్‌ ఫోర్స్, సీఆర్‌పీఎఫ్‌ సిబ్బంది మోహరించారు. స్థానికంగా 144 సెక్షన్‌ విధించారు. నినాదాలు చేస్తున్న ఆమ్‌ ఆద్మీ పార్టీ నేతలు, కార్యకర్తలను అదుపులోకి తీసుకున్నారు.  

హైకోర్టు ఉత్తర్వుపై సుప్రీంకోర్టుకు కేజ్రీవాల్‌  
లిక్కర్‌ స్కామ్‌లో కేజ్రీవాల్‌కు ఈడీ ఇప్పటిదాకా తొమ్మిది సార్లు సమన్లు జారీ చేసింది. ఒక్కసారి కూడా ఆయన విచారణకు హాజరుకాలేదు. గురువారం కూడా విచారణకు హాజరు కావాల్సి ఉన్నప్పటికీ రాలేదు. తనకు సమన్లు జారీ చేయడం చట్టవిరుద్ధమని ఆయన చెప్పారు. ఈడీ తనను అరెస్టు చేయకుండా ఆదేశాలివ్వాలని ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించగా, ఊరట దక్కలేదు. అరెస్టు చేయకుండా రక్షణ కల్పించలేమని హైకోర్టు గురువారం స్పష్టం చేసింది.

ఈ మేరకు ఉత్తర్వు జారీ చేసింది. ఈ ఉత్తర్వును వ్యతిరేకిస్తూ ఆయన వెంటనే సుప్రీంకోర్టును ఆశ్రయించారు. పిటిషన్‌ దాఖలు చేశారు. గురువారం రాత్రే అత్యవసరంగా విచారణ చేపట్టాలని కోరారు. ఇంతలోనే అరెస్టయ్యారు. కేజ్రీవాల్‌ పిటిషన్‌పై శుక్రవారం సుప్రీంకోర్టులో విచారణ జరిగే అవకాశం ఉంది. లిక్కర్‌ స్కామ్‌లో ఈడీ గతంలో దాఖలు చేసిన చార్జిషీట్లలో కేజ్రీవాల్‌ పేరును అధికారులు పలుమార్లు ప్రస్తావించారు.  
 
జైలు నుంచే పరిపాలన!  
కేజ్రీవాల్‌ అరెస్టు అయినప్పటికీ ఢిల్లీ ముఖ్యమంత్రిగా కొనసాగుతారని, అవసరమైతే జైలు నుంచే పరిపాలన కొనసాగిస్తారని ఆమ్‌ ఆద్మీ పార్టీ సీనియన్‌ నేత అతీషి ప్రకటించారు. కేజ్రీవాల్‌ను చూసి ప్రధాని నరేంద్ర మోదీ భయపడుతున్నారని, అందుకే లోక్‌సభ ఎన్నికల ముందు అక్రమంగా జైలుకు పంపించడానికి కుట్ర పన్నారని ఆరోపించారు. సరిగ్గా ఎన్నికల సమయంలోనే కేజ్రీవాల్‌ను అరెస్టు చేయడం వెనుక పెద్ద కుతంత్రం ఉందని ఆమ్‌ ఆద్మీ పార్టీ ఎంపీ రాఘవ్‌ చద్ధా విమర్శించారు.

కేజ్రీవాల్‌ అరెస్టును తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్, కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్‌ ఖండించారు. ప్రతిపక్ష నేతలను మోదీ ప్రభుత్వం వేధిస్తోందని మండిపడ్డారు. కేజ్రీవాల్‌ను అరెస్టు చేయడం అప్రజాస్వామికం, దిగజారుడుతనానికి నిదర్శనమని కాంగ్రెస్‌ ప్రధాన కార్యదర్శి ప్రియాంకా గాంధీ వాద్రా ఆక్షేపించారు. మరోవైపు, లిక్కర్‌ కుంభకోణానికి నైతిక బాధ్యత వహిస్తూ ముఖ్యమంత్రి పదవికి కేజ్రీవాల్‌ వెంటనే రాజీనామా చేయాలని, దర్యాప్తునకు సహరించాలని ఢిల్లీ బీజేపీ నేతలు డిమాండ్‌ చేశారు.  
 
ఎన్నికల్లో ఆమ్‌ ఆద్మీ పార్టీకి భారీ నష్టమే! 
అరవింద్‌ కేజ్రీవాల్‌ అరెస్టు కావడం ఆమ్‌ ఆద్మీ పార్టీ(ఆప్‌)కి ఎదురు దెబ్బేనని రాజకీయ పరిశీలకులు అంచనా వేస్తున్నారు. రాబోయే లోక్‌సభ ఎన్నికల్లో ఆ పార్టీకి భారీ నష్టం తప్పదని అంటు న్నారు. ఢిల్లీ, హరియాణా, గుజరాత్‌లో కాంగ్రెస్‌ తో ఆ పార్టీ పొత్తు కుదుర్చుకుంది. పంజాబ్‌లో ఒంటరిగానే అన్ని స్థానాల్లో పోటీ చేస్తామని ప్రకటించింది. లోక్‌సభ ఎన్నికల్లో గణనీయంగా సీట్లు సాధించి, దేశమంతటా పార్టీని విస్తరింపజేయాలని ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్న తరు ణంలో కేజ్రీవాల్‌ అరెస్టు కావడం ఆప్‌ శ్రేణులను నిరాశకు గురిచేసింది.

నిజానికి ఆప్‌లో కేజ్రీవాల్‌ మాత్రమే స్టార్‌ క్యాంపెయినర్‌. ఒకవేళ ఆయన ఈడీ కస్టడీకి గానీ, జైలుకు గానీ పరిమితమైతే పార్టీని ముందుకు నడిపించే బలమైన నాయకులెవరూ లేరు. మనీష్‌ సిసోడియా, సత్యేందర్‌ జైన్, సంజయ్‌ సింగ్‌ లాంటి సీనియర్లు ఇప్పటికే అరెస్టయ్యారు. కేజ్రీవాల్‌ లేకపోతే ఇంకెవరు? అనే ప్రశ్న ఆమ్‌ ఆద్మీ పార్టీలో ఏనాడూ తలెత్తలేదు. మరోవైపు కేజ్రీవాల్‌ అరెస్టు వ్యవహారం బీజేపీకి మేలు చేయకపోగా బ్యాక్‌ ఫైర్‌ అయ్యే అవకాశాలు లేకపోలేదన్న వాదన వినిపిస్తోంది. 12 ఏళ్ల క్రితం పుట్టిన ఆమ్‌ ఆద్మీ పార్టీ భవితవ్యం ఏమిటన్నది మరికొన్ని రోజుల్లో తేలిపోనుంది.    

అరెస్టయిన మొట్టమొదటి సిట్టింగ్‌ సీఎం  
దేశంలో ముఖ్యమంత్రి పదవిలో కొనసాగుతూ అరెస్టయిన మొట్టమొదటి సిట్టింగ్‌ సీఎం అరవింద్‌ కేజ్రీవాల్‌ కావడం గమనార్హం. గతంలో బిహార్‌ ముఖ్యమంత్రి లాలూ ప్రసాద్‌ యాదవ్, తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత, జార్ఖండ్‌ ముఖ్యమంత్రి హేమంత్‌ సోరెన్‌ సైతం పదవిలో ఉండగానే అరెస్టయ్యారు. కానీ, దర్యాప్తు సంస్థలు కస్టడీలోకి తీసుకోవడం కంటే ముందే తమ పదవికి రాజీనామా చేశారు. కేజ్రీవాల్‌ మాత్రం ఇంకా రాజీనామా చేయలేదు.   

ఏమిటీ కుంభకోణం?
► ఢిల్లీలోని ఆమ్‌ ఆద్మీ పార్టీ ప్రభుత్వం 2021 నవంబర్‌లో నూతన మద్యం విధానాన్ని(పాలసీ) ప్రవేశపెట్టింది. ఈ విధానం ప్రకారం.. లిక్కర్‌ రిటైల్‌విక్రయాల నుంచి ప్రభుత్వం తప్పుకుంది. మద్యం దుకాణాలను నడపడానికి ప్రైవేట్‌ లైసెన్స్‌దారులకు అనుమతులు ఇచ్చింది. దీనివల్ల లిక్కర్‌ బ్లాక్‌ మార్కెటింగ్‌కు అడ్డుకట్ట పడుతుందని, ప్రభుత్వ ఆదాయం భారీగా పెరుగుతుందని అరవింద్‌ కేజ్రీవాల్‌ సర్కారు ప్రకటించింది.  

► కొత్త పాలసీ కింద మద్యం దుకాణాలను అర్ధరాత్రి దాటిన తర్వాత కూడా.. తెల్లవారుజామున 3 గంటల వరకు తెరిచి ఉంచవచ్చు. మద్యంపై ప్రైవేట్‌ లైసెన్స్‌దారులు అపరిమితమైన డిస్కౌంట్‌ ప్రకటించవచ్చు. వినియోదారులకు అకర్శణీయమైన అఫర్లు ఇవ్వొచ్చు. లిక్కర్‌ హోం డెలివరీ కూడా చేయ్యొచ్చు. ఇవన్నీ మద్యం అమ్మకాలు పెంచుకోవడానికి ఉద్దేశించినవే. కొత్త పాలసీ వల్ల లిక్కర్‌పై ఆదాయం 27 శాతం పెరిగిందని, రూ.8,900 కోట్ల రాబడి వచ్చిందని ఢిల్లీ ప్రభుత్వం ప్రకటించింది.  

► కేజ్రీవాల్‌ ప్రభుత్వం తీసుకొచ్చిన నూతన మద్యం విధానాన్ని బీజేపీ తీవ్రంగా వ్యతిరేకించింది. నివాస గృహాల మధ్య విచ్చలవిడిగా మద్యం దుకాణాలు ఏర్పాటు చేశారని, ఢిల్లీకి లిక్కర్‌ సంస్కృతిని తీసుకొచ్చారని బీజేపీ నాయకులు ఆరోపించారు.  

► కొత్త మద్యం విధానంలో చాలా ఉల్లంఘనలు చోటుచేసుకున్నాయని, ప్రైవేట్‌ లైసెన్స్‌దారులకు అనుచిత ప్రయోజనాలు కల్పించారని స్పష్టం చేస్తూ 2022 జూలైలో ఢిల్లీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నరేశ్‌ కుమార్‌ ఒక నివేదిక విడుదల చేశారు. కోవిడ్‌–19 వ్యాప్తి సమయంలో ప్రైవేట్‌ వ్యాపారులకు ప్రభుత్వం రూ.144 కోట్ల మేర లైసెన్స్‌ ఫీజు మినహాయింపు ఇచ్చిందని వెల్లడించారు.  

► చీఫ్‌ సెక్రెటరీ నివేదికపై ఢిల్లీ లెఫ్టినెంట్‌ గవర్నర్‌ వీకే సక్సేనా స్పందించారు. ఢిల్లీ లిక్కర్‌ పాలసీపై సీబీఐ విచారణ జరపాలంటూ సిఫార్సు చేశారు. తమపై వస్తున్న ఆరోపణలను ఆమ్‌ ఆద్మీ పార్టీ నేతలు కొట్టిపారేశారు. తర్వాత కొన్ని రోజులకే నూతన లిక్కర్‌ పాలసీని కేజ్రీవాల్‌ ప్రభుత్వం ఉపసంహరించుకుంది. 400 మద్యం దుకాణాలు మూతపడ్డాయి. ఢిల్లీలో మద్యం విక్రయాలు మళ్లీ ప్రభుత్వ నియంత్రణలోకి వచ్చాయి.  

► లెఫ్టినెంట్‌ గవర్నర్‌ సిఫార్సు మేరకు లిక్కర్‌ స్కామ్‌పై సీబీఐ దర్యాప్తు ప్రారంభించింది. 2022 ఆగస్టులో ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి, ఆమ్‌ ఆద్మీ పార్టీ సీనియర్‌ నేత మనీష్‌ సిసోడియా నివాసంతోపాటు 31 ప్రాంతాల్లో సోదాలు నిర్వహించింది. అయితే, ఈ సోదాల్లో సీబీఐకి ఎలాంటి ఆధారాలు దొరకలేదని మనీష్‌ సిసోడియా చెప్పారు. తమ పార్టీని అప్రతిష్ట పాలు చేయడానికి బీజేపీ పెద్దలు కుట్రలు చేస్తున్నారని ఆరోపించారు.  

► ఢిల్లీ మద్యం కుంభకోణంలో మనీ లాండరింగ్‌ కూడా జరిగినట్లు ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌(ఈడీ) గుర్తించింది. మనీష్‌ సిసోడియాతోపాటు మరో 14 మందిపై సీబీఐ నమోదు చేసిన ఎఫ్‌ఐఆర్‌ ఆధారంగా ఈడీ సైతం కేసు నమోదు చేసింది. దర్యాప్తునకు శ్రీకారం చుట్టింది.  

► అప్పటి తెలంగాణ ముఖ్యమంత్రి, భారత రాష్ట్ర సమితి(బీఆర్‌ఎస్‌) అధినేత కె.చంద్రశేఖరరావు కుమార్తె, తెలంగాణ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత నేతృత్వంలోని “సౌత్‌ గ్రూప్‌’కు లబ్ధి చేకూర్చడానికి వీలుగా కొత్త లిక్కర్‌ పాలసీని కేజ్రీవాల్‌ ప్రభుత్వం రూపొందించినట్లు ఈడీ తన దర్యాప్తులో గుర్తించింది. సౌత్‌ గ్రూప్‌కు పెద్ద ఎత్తున లైసెన్స్‌లు దక్కినట్లు తేల్చింది.  

► తమకు అనుకూలంగా మద్యం విధానాన్ని రూపొందించినందుకు ప్రతిఫలంగా ఆమ్‌ ఆద్మీ పార్టీకి సౌత్‌ గ్రూప్‌ రూ.100 కోట్ల ముడుపులు చెల్లించినట్లు ఈడీ ఆరోపించింది. ఈ సొమ్మును గోవా అసెంబ్లీ ఎన్నికల్లో ఆమ్‌ ఆద్మీ పార్టీ ఖర్చు చేసినట్లు తెలియజేసింది. ఢిల్లీలో లిక్కర్‌ వ్యాపారం ద్వారా సౌత్‌ గ్రూప్‌ ఈ రూ.100 కోట్లు తిరిగి రాబట్టుకున్నట్లు పేర్కొంది. నూతన లిక్కర్‌ పాలసీ వల్ల ఢిల్లీ ప్రభుత్వానికి రూ.2,800 కోట్ల మేర నష్టం వాటిల్లినట్లు ఈడీ తేల్చిచెప్పింది.  

► ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో అరుణ్‌ పిళ్‌లై, సమీర్‌ మహేంద్రు, పి.శరత్‌చంద్రారెడ్డి, బినోయ్‌బాబు, అభిషేక్‌ బోయినపల్లి, విజయ్‌ నాయర్, అమిత్‌ అరోరా, గోరంట్ల బుచ్చిబాబు, గౌతమ్‌ మల్హోత్రా, రాజేష్‌ జోషి, మాగుంట రాఘవ, మనీష్‌ సిసోడియా, సంజయ్‌ సింగ్, కల్వకుంట్ల కవిత అరెస్టయ్యారు. వీరిలో అరుణ్‌ పిళ్‌లై, మనీష్‌ సిసోడియా, సంజయ్‌ సింగ్‌ జ్యుడీషియల్‌ కస్టడీలో ఉండగా, కల్వకుంట్ల కవిత ఈడీ కస్టడీలో ఉన్నారు. మనీష్‌ సిసోడియా అనుచరుడు దినేష్‌ అరోరా, మాగుంట రాఘవ, గోరంట్ల బుచ్చిబాబు పి.శరత్‌చంద్రారెడ్డి అప్రూవర్లుగా మారారు. ఎంపీ మాగుంట శ్రీనివాసులురెడ్డిని ఈ కేసులో సీబీఐ విచారించింది. తాజాగా ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌ను ఈడీ అదుపులోకి తీసుకుంది.  
– సాక్షి, నేషనల్‌ డెస్క్‌    

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement