సాక్షి,ప్రకాశం: ఒక వైపు తీర్చలేని అప్పులు, మరో వైపు అనారోగ్యంతోపాటు, మలి వయసులో తాము ఎవరికీ భారం కాకూడని భావించిన ఓ వృద్ధ జంట తనువు చాలించాలని నిర్ణయించుకుంది. తాము బతికుండటం భారమని తలచి పురుగు మందు తాగి బలన్మరణం చెందారు. ఈ ఘటన సోమవారం అర్ధరాత్రి బల్లికురవ మండలంలోని చిన్న అంబడిపూడి గ్రామంలో జరగ్గా, మంగళవారం వెలుగు చూసింది. బంధువులు పోలీసులు స్థానికులు అందించిన వివరాలు మేరకు.. చిన్న అంబడిపూడి గ్రామానికి చెందిన గంగవరపు శేషయ్య (65), నాగేశ్వరమ్మ (61) దంపతులు. వీరికి కుమారుడు ఆనందరావు, కుమార్తె సుజాత ఉన్నారు.
ఇద్దరికీ వివాహాలయ్యాయి. వీరికి 12 ఎకరాల సాగు భూమి ఉంది. అందులో రెండెకరాల భూమిని కుమార్తెకు ఇచ్చారు. ఒకే ఇంట్లో ముందు వైపు కుమారుడు, వెనుక వైపు వృద్ధ దంపతులు నివాసముంటున్నారు. ఎవరికి వారే తమ భూమిని సాగు చేసుకుంటూ జీవిస్తున్నారు. శేషయ్య సొంతంగా తన భూమిని సాగు చేస్తూ మెట్ట పంటలైన కంది, పత్తి, కూరగాయలు, వరి పండించుకుంటున్నాడు. ఈ క్రమంలో శేషయ్యకు నాలుగేళ్ల క్రితం పక్షవాతం వచ్చింది, భార్య ఇటీవల కిడ్నీ వ్యాధి బారిన పడింది. సాగు కోసం తెచ్చిన అప్పులు వడ్డీలతో కలిపి రూ.15 లక్షలయ్యాయి. తాను పక్షవాతంతో పొలం పనులు చేయించలేక, మరో వైపు భార్య కిడ్నీ వ్యాధితో బాధపడుతుండటం భరించలేక శేషయ్య, భార్యా తాను భర్తకు భారంగా మారానని భావించి..ఇక ఇద్దరం బతికుండి చేసేదేముందనే భావనకు వచ్చారు. అప్పుడప్పుడూ ఈ మాటలను ఇరుగు పొరుగువారితో అంటుండేవారని తెలిసింది.
ఎప్పటిలాగే సోమవారం భోజనం చేసి పడుకున్నారు. అందరూ నిద్రించారని నిర్థారించుకున్న తరువాత ఇంట్లో ఉన్న పురుగు మందును తాగి బలవన్మరణానికి పాల్పడ్డారు. చీకటితో నిద్ర లేచే తమ తల్లిదండ్రులు ఎంత పొద్దెక్కినా లేవకపోవటంతో కుమారుడు వచ్చి చూశాడు. ఇద్దరూ మంచంపై విగతజీవులై పడి ఉండటాన్ని గమనించి భోరున విలపించాడు. ఈ ఘటనలో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. సంఘటనా స్థలాన్ని సీఐ ఎం.రాజేశ్, ఎస్‌హెచ్‌వో సైదయ్య పరిశీలించారు. శేషయ్య కుమారుడు ఆనందరావు ఫిర్యాదు మేరకు కేసు నమోదుతో దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహాలను పోస్టుమార్టం కోసం అద్దంకి ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు.
Comments
Please login to add a commentAdd a comment