బనశంకరి: కాలేజీ భవనం పై నుంచి దూకి ఇంజనీరింగ్ విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ సంఘటన బెంగళూరు విశ్వేశ్వరపురం పోలీస్‌స్టేషన్ పరిధిలో సోమవారం చోటు చేసుకుంది. కె. జయంత్‌రెడ్డి (22) ఆత్మహత్యకు పాల్పడిన విద్యార్థి. ఇతను బెంగళూరు ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (బీఐటీ) అనే ప్రైవేటు కాలేజీలో కంప్యూటర్ సైన్స్ రెండో ఏడాది విద్యార్థి. సోమవారం గత ఏడాది పెండింగ్ ఉన్న పరీక్ష రాయడానికి కాలేజీకి వచ్చాడు. ఫీజు బకాయిల్ని చెల్లించాలని కాలేజీ సిబ్బంది జయంత్‌రెడ్డిని నిలదీసినట్లు సమాచారం. పరీక్ష ప్రారంభం కావడానికి ముందు అతను డెత్‌నోట్ రాసి కాలేజీ భవనం 7వ అంతస్తుపైకి వెళ్లి అక్కడ నుంచి కిందికి దూకాడు. తీవ్ర గాయాలతో ఘటనాస్థలంలోనే ప్రాణాలు కోల్పోయాడు.
విద్యార్థుల ఆందోళన
ఈ ఆత్మహత్యతో విద్యార్థులు ఆందోళనకు దిగారు. ఆన్‌లైన్ పాఠాలు అర్థం కావడం లేదని, ఇలాంటి సమయంలో పరీక్షలు ఎలా రాయాలని ప్రశ్నించారు. చదువుల్లో ఎంతో ప్రతిభావంతుడైన జయంత్‌రెడ్డి ఆత్మహత్యకు పాలకమండలి నిర్వాకమే కారణమని ఆరోపించారు. పరీక్షలను బహిష్కరించి ధర్నాకు దిగారు. విశ్వేశ్వరపురం పోలీసులు చేరుకుని విద్యార్థులకు నచ్చజెప్పే యత్నం చేశారు. కేసు నమోదు చేసుకుని జయంత్‌రెడ్డి మృతదేహాన్ని కిమ్స్ ఆసుపత్రికి తరలించారు. డెత్‌నోట్‌ను స్వా«దీనం చేసుకున్నామని పోలీసులు తెలిపారు. అటు ఫీజుల సమస్య, ఇటు చదువులో వెనుకబాటుతో ఒత్తిడి గురై భవనంపై నుంచి దూకి ఉంటాడని అనుమానిస్తున్నారు. విద్యార్థి ఆత్మహత్యపై కాలేజీ యాజమాన్యం ఏమీ స్పందించలేదు. జయంత్ స్వస్థలం బెంగళూరు రూరల్‌లోని దొడ్డబళ్లాపుర పట్టణమని, తండ్రి రైతు అని తెలిసింది.
Comments
Please login to add a commentAdd a comment