ఆర్‌ఎస్‌పేట వద్ద నకిలీ టీ పొడి కేంద్రాన్ని పరిశీలిస్తున్న అధికారులు (ఇన్‌సెట్‌లో) సేకరించిన నకిలీ టీ పొడి శాంపిల్స్
బిక్కవోలు: గుట్టు చప్పుడు కాకుండా నాలుగేళ్లుగా నకిలీ టీపొడి తయారీ చేస్తూ ప్రజల ఆరోగ్యంతో ఆటలాడుతున్న ఓ కేంద్రం నిర్వాహకుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వివరాల్లోకి వెళితే.. తూర్పు గోదావరి జిల్లా బిక్కవోలు మండలంలోని ఆర్‌ఎస్‌పేటలో మూతబడిన రైస్ మిల్లులో ఈ పొడి తయారు చేస్తున్నారని ఫిర్యాదు రావడంతో జిల్లా ఫుడ్‌సేఫ్టీ అసిస్టెంట్ అధికారి శ్రీనివాస్, ఎస్‌ఐ పి.వాసు శుక్రవారం ఆకస్మిక దాడి చేశారు. అనిల్ శేఖర్‌రెడ్డి అనే వ్యక్తి అరుణ్ ఎంటర్‌ప్రైజస్ పేరుతో వివిధ ప్రాంతాలకు నకిలీ టీపొడిని ఎగుమతి చేస్తున్నారు.
మన రాష్ట్రంలోనే కాకుండా ఇతర రాష్ట్రాలకు ఎగుమతి చేసి విక్రయిస్తున్నట్లు తేలింది. ఈ కేంద్రంలో పనిచేస్తున్న తమిళనాడుకు చెందిన ముత్తు వద్ద వివరాలు రాబట్టారు. టీపొడి తయారీకీ శుద్ధమట్టి, ఎర్రమట్టి, నిర్మాపొడరు, జీడీపిక్కలపైతొక్క పొడి వినియోగిస్తున్నట్లు గుర్తించారు. 135 బస్తాల జీడి పిక్క పౌడరు, 33బస్తాల నకిలీటీ పొడి, 22 బస్తాల నిర్మా వాషింగ్ పౌడర్‌తో పాటు ఎర్రమట్టి, శుద్ధమట్టిని సీజ్ చేశారు. కాగా, ఉన్నతాధికారులకు నివేదికను అందించి తయారీ కేంద్రాన్ని సీజ్ చేస్తామని అధికారులు తెలిపారు. దాడిలో తహసీల్దార్ కె.వెంకటమాధవరావు, డీటీ కృష్ణ, ఫుడ్‌సేప్టీ అధికారులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment