ఆ చిన్నారులను చూస్తే.. ఎవరికైనా ముద్దు చేయాలనిపిస్తుంది. కాసేపు ఎత్తుకొని లాలించాలనిపిస్తుంది. కానీ అప్పలరాజు మాత్రం అత్యంత కిరాతకంగా మారిపోయాడు. పాతకక్షలు అతనిలో మానవత్వాన్ని చంపేశాయి. క్షణికావేశం అతడిని రాక్షసుడిగా మార్చేసింది. ఏం చేస్తున్నాడో విచక్షణ కోల్పోయి.. తల్లిచెంతనే నిద్రపోతున్న చిన్నారులను కిరాతకంగా హతమార్చాడు. ఆ పసికందులు ఎందుకు చనిపోతున్నామో తెలీకుండానే శాశ్వత నిద్రలోకి జారుకున్నారు. అభం శుభం తెలియని ఆరు నెలల చిన్నారి రిషిత పైనా తన కర్కశత్వాన్ని ప్రదర్శించి.. శరీరాన్ని ముక్కలు చేసేసిన హృదయవిదారక దృశ్యం చూసిన ప్రతి ఒక్కరూ కన్నీరు మున్నీరయ్యారు. పోస్టుమార్టం నిమిత్తం తరలించే సమయంలో అల్లారుముద్దుగా పెంచిన ఇద్దరు చిన్నారుల మృతదేహాల్ని తండ్రి విజయ్ స్వయంగా మోసుకుంటూ విలపిస్తూ... అంబులెన్స్‌లో ఎక్కించడంతో జుత్తాడ కన్నీటిసంద్రంలో మునిగిపోయింది.
సాక్షి, విశాఖపట్నం/పెందుర్తి : పాత కక్షలతో రగిలిపోతున్న ఓ మనిషి మృగమయ్యాడు.. అదునుకోసం ఎదురుచూసి పగతో కత్తి దూశాడు.. పదిహేను నిమిషాల వ్యవధిలో ఒకే కుటుంబంలోని ఆరు నిండుప్రాణాలు బలి తీసుకుని మారణహోమం సృష్టించాడు. అభం శుభం తెలియని ఇద్దరు చిన్నారులనూ కిరాతకంగా చిదిమేశాడు. గురువారం వేకువజామున నగర శివారు పెందుర్తి మండలం వి.జుత్తాడలో ఈ ఘోరం చోటుచేసుకుంది. అదే గ్రామానికి చెందిన బత్తిన అప్పలరాజు అనే నరహంతకుడు ఈ ఘాతుకానికి పాల్పడ్డాడు. ఘటన జరిగిన ఇంటిలో ఎటు చూసినా రక్తపు మడుగులే కనిపిస్తున్నాయి. ప్రతీ గోడ రక్తపు మరకలతో నిండిపోయింది.
ఈ ఊచకోతలో ముగ్గురు మహిళలు, ఒక పురుషుడితో సహా ఇద్దరు ముక్కుపచ్చలారని చిన్నారులను అత్యంత ఘోరంగా నరికి చంపడం చూసి ప్రతీ హృదయం కన్నీటి పర్యంతమైంది. రక్తపు మడుగుల్లో పడి ఉన్న మృతదేహాలను చూసి ప్రతీ గుండె విలపించింది. వివాహేతర సంబంధంతో ఐదేళ్ల కిందట ప్రారంభమైన గొడవలే ఈ హత్యలకు దారి తీశాయని పోలీసులు ప్రాథమికంగా నిర్థారణకు వచ్చారు. మరో రెండు రోజుల్లో పెళ్లి సందడి మొదలవ్వాల్సిన ఇంట మరణ మృదంగం మోగడంతో వి.జుత్తాడలో విషాదం నెలకొంది. విషాద వార్త తెలుసుకొని విజయవాడలో నివసిస్తున్న చిన్నారుల తండ్రి విజయ్ రాకతో గ్రామంలో ఒక్కసారిగా ఉద్రిక్త వాతావరణం నెలకొంది. హంతకుడిని అత్యంత కఠినంగా శిక్షించాలని స్థానికులు ముక్తకంఠంతో నినదించారు.
ఎటు చూసినా రక్తపు జాడలే
జుత్తాడ గ్రామంలో నిందితుడు బత్తిన అప్పలరాజు చేసిన నరమేధంతో ఎటు చూసినా రక్తపు జాడలే కనిపిస్తున్నాయి. గ్రామంలో ఉంటున్న అప్పలరాజు కుమార్తెకు అదే గ్రామంలో నివాసం ఉంటున్న బమ్మిడి విజయ్‌కిరణ్‌కు వివాహేతర సంబంధం ఉందన్న అనుమానంతో కొద్ది సంవత్సరాలుగా ఇరు కుటుంబాల మధ్య గొడవలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో విజయ్ కుటుంబంపై పగ పెంచుకున్న అప్పలరాజు గురువారం ఉదయం కత్తితో దాడి చేసి కుటుంబ సభ్యులను ఊచకోత కోశాడు. అప్పలరాజు చేతిలో హత్యకు గురైన బమ్మిడి రమణ (63), బమ్మిడి ఉషారాణి(35), అల్లు రమాదేవి(53), నకెళ్ళ అరుణ(40), బమ్మిడి ఉదయ్‌నందన్(2), బమ్మిడి ఉర్విష (6 నెలలు) మృతదేహాలు రక్తపు మడుగులో పడి ఉన్నాయి.
పక్కా ప్రణాళిక ప్రకారం మాటువేసి గురువారం వేకువజామున బమ్మిడి విజయ్‌కిరణ్ కుటుంబాన్ని కత్తితో వేటాడి చంపిన అప్పలరాజు వెంటనే పోలీసులకు లొంగిపోయాడు. అయితే ఈ ఘటనలో అప్పలరాజుకు అతడి కుటుంబ సభ్యుల సహకారం ఉందని బాధితుల తరఫున బంధువులు పెద్ద ఎత్తున ఆందోళన చేశారు. బాధితుల ఆరోపణల నేపథ్యంలో మరో ముగ్గురిపై కూడా పోలీసులు కేసులు నమోదు చేసి విచారిస్తున్నారు. ఘటనాస్థలిని సీపీ మనీష్‌కుమార్ సిన్హా సందర్శించి ప్రాథమిక విచారణ చేపట్టారు. నిందితులను చట్ట ప్రకారం కఠినంగా శిక్షిస్తామని మీడియాతో మా ట్లాడుతూ వెల్లడించారు. ఏసీపీ శ్రీపాదరావు ఆధ్వర్యంలో సీఐలు కె.అశోక్‌కుమార్, రమణయ్య, రామారావు, ఎస్‌ఐలు శాంతిభద్రతలను పర్యవేక్షించారు.
ఆస్తి తగాదాల కోణంలోనూ..
ఆరు హత్యలకు వివాహేతర సంబంధం ఒక కారణం కాగా.. స్థానికుల సమాచారం ప్రకారం ఆస్తి తగాదాలూ ఇంకో కారణమని తెలుస్తోంది. పోలీసులు సైతం ఆ కోణంలోనూ దర్యాప్తు చేస్తున్నారు. విజయ్ ఇంటి పక్కన ఉన్న స్థలం హంతకుడు అప్పలరాజుకు చెందినది కాగా.. ఎదురుగా ఉన్న ఇల్లు అప్పలరాజు సోదరుడికి చెందినది. మధ్యలో విజయ్ ఇల్లు ఉండటంతో దాన్ని అమ్మేయాలని పలుమార్లు అడిగినట్లు స్థానికులు చెబుతున్నారు. అయినా దాన్ని అమ్మేందుకు విజయ్ తండ్రి రమణ నిరాకరించడం, దానికి తోడు వివాహేతర సంబంధం బయటపడటం.. అప్పలరాజులో పగని పెంచింది. దాని వల్లే ఈ మారణహోమానికి ఒడిగట్టినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు.
మార్చురీకి మృతదేహాలు
డాబాగార్డెన్స్ (విశాఖ దక్షిణ): జుత్తాడలో హత్యకు గురైన బమ్మిడి రమణ, అల్లు రమాదేవి, బమ్మిడి ఉషారాణి, ఉదయనందన్, రిషిత, నక్కెళ్ల అరుణ మృతదేహాలు సాయంత్రం 7.30 గంటల ప్రాంతంలో పోస్టుమార్టం కోసం కేజీహెచ్ మార్చురీకి తరలించారు. మరోవైపు మధురవాడలో అనుమానాస్పదంగా అగ్నికి ఆహుతైన సుంకర బంగారునాయడు, నిర్మల, దీపక్, కశ్యప్ మృతదేహాలు కూడా గురువారం రాత్రికి కేజీహెచ్ మార్చురీకి తరలించారు.
అమ్మ పుట్టిందన్న ఆనందం ఆరు నెలలకే...
కాంట్రాక్టర్ విజయ్‌కిరణ్‌కు తల్లి ఆదిలక్ష్మి అంటే చాలా ఇష్టం. అమ్మ చనిపోయిన తర్వాత కుంగిపోయిన విజయ్.. తన బిడ్డగా అమ్మ పుడుతుందని భావించాడు. మొదటి, రెండో సంతానంగా కుమారులు పుట్టారు. కుటుంబ సభ్యులు భార్యకు కుటుంబ నియంత్రణ శస్త్ర చికిత్స చేయించాలని చెప్పినా.. అమ్మ కచ్చితంగా పుడుతుందని విజయ్ నిరాకరించాడు. పూజలు, మాలధారణ చేసి మొక్కుకున్నాడు. చివరికి పూజలు ఫలించి ఆరు నెలల క్రితం చిన్నారి పుట్టింది. ఇంతలో ఘోరం జరిగిపోయింది. అమ్మ పుట్టిందన్న ఆనందం ఆరు నెలలకే ఆవిరి చేసేశాడంటూ విజయ్ విలపించిన తీరు గ్రామస్తుల్ని కంటతడి పెట్టించింది.
పావుగంటలోనే పొట్టనపెట్టుకున్నాడు
కేవలం పావు గంటలోనే నాలుగేళ్ల పగని తీర్చుకున్నాడు నర హంతకుడు అప్పలరాజు. ఉదయం 5 గంటల నుంచి ఆయుధంతో వేచి ఉన్న హంతకుడు అప్పలరాజు... 5.30 గంటలకు రమాదేవి తలుపు తీసిన వెంటనే.. హత్యాకాండ మొదలు పెట్టాడు. పిల్లా.. పెద్దా అనే తేడా లేకుండా విచక్షణ కోల్పోయి సైకోలా మారిపోయాడు. గేటు దగ్గర మొదలుపెట్టి.. వంటగది వరకూ సాగిన మారణహోమం పావుగంటలో ముగిసిపోయి.. ఆరుగుర్ని విగతజీవులుగా మార్చేసింది. 5.45 గంటలకు బయటికి వచ్చిన కిరాతకుడు.. అరగంట పాటు రమాదేవి మృతదేహం పక్కనే కూర్చొని 6.15 కి 100 నంబర్‌కు డయల్ చేశాడు. 100 నుంచి 108కి ఫోన్ వెళ్లగా.. హుటాహుటిన అక్కడికి వెళ్లిన 108 సిబ్బంది వెళ్లే సరికి.. అటు ఇటూ తిరుగుతూ ఎవరొస్తారో రండి అంటూ హంతకుడు కత్తితో అటు ఇటు పచార్లు చేస్తున్నట్లు సిబ్బంది చెబుతున్నారు.
బాధిత కుటుంబానికి న్యాయం చేస్తాం
ఈ ఘటనపై ప్రభుత్వం తీవ్రంగా స్పందించింది. ఎమ్మెల్యే అన్నంరెడ్డి అదీప్‌రాజ్ ద్వారా సమాచారం అందుకున్న రాజ్యసభ సభ్యుడు వి.విజయ్‌సాయిరెడ్డి బాధితుడు విజయ్‌కిరణ్‌తో ఫోన్‌లో మాట్లాడారు. ఓదార్చి ధైర్యం చెప్పారు. జరిగిన ఘటనను సీఎం వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి దృష్టికి తీసుకెళ్తానని, పూర్తిగా న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు. మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు ఘటనాస్థలికి చేరుకుని మృతదేహాలకు ఘనంగా నివాళి అర్పించి జరిగిన ఘటనను తీవ్రంగా ఖండించారు. విజయ్‌ను ఓదార్చారు. ప్రభుత్వం తరపున సహకరిస్తామని చెప్పారు. నిందితులకు కఠిన శిక్షలు పడేలా చూస్తామని భరోసా ఇచ్చారు. వైఎస్సార్ సీపీ నగర అధ్యక్షడు వంశీకృష్ణ శ్రీనివాస్ యాదవ్, మేయర్ గొలగాని హరివెంకటకుమారి భర్త గొలగాని శ్రీనివాస్, రాష్ట్ర, జిల్లా యాదవ సంఘాల ప్రతినిధులు ఘటనాస్థలికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు.
ఇరుగు పొరుగు వారికి వినిపించలేదా..?
పల్లెల్లో వేకుకజామున 5 గంటలకే సందడి మొదలవుతుంది. కానీ గ్రామం నడిబొడ్డున జరిగిన మృత్యుఘోష ఎవరికీ వినపడలేదా అనే అనుమానాలు అందరిలోనే వ్యక్తమవుతున్నాయి. విజయ్ ఇంటి పక్కనే హంతకుడి సోదరుడి కుటుంబం నివశిస్తోంది. చుట్టుపక్కల ఇళ్లల్లో జనం ఉన్నా ఎవరికీ హాహాకారాలు వినిపించలేదా అనేది ప్రశ్నగా మారింది. హంతకుడు 5 గంటల నుంచి ఆయుధంతో మాటు వేసినా ఎవరూ గుర్తించలేదా.? హత్యలు చేసి అరగంట ఆరుబయట కూర్చున్నా ఎవరూ పట్టించుకోలేదా.? అనే కోణాల్లోనూ పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. పక్కనే ఉన్న సోదరుడి కుటుంబం ఆ సమయంలో ఏం చేస్తున్నారనే కోణంలో విచారణ చేపడుతున్నారు.
చదవండి: విశాఖలో నరమేధం
Comments
Please login to add a commentAdd a comment