రైతు శ్రీను మృతదేహంపై పడి రోదిస్తున్న కుటుంబ సభ్యులు, బంధువులు
మహబూబాబాద్ రూరల్: మిరప పంట చేతికి వచ్చాక అమ్మేసి అప్పులు తీర్చాలనుకున్న ఓ రైతు.. తెగుళ్ల కారణంగా నష్టపోవడంతో మనోవేదనకుగురై ఆత్మహత్య చేసుకున్నాడు. మహబూబాబాద్ జిల్లా మానుకోట మండలం లక్ష్మాతండాలో గురువారం రాత్రి ఈ విషాదకర ఘటన చోటుచేసుకుంది. లక్ష్మాతండాకు చెందిన అజ్మీర శ్రీను (39)కు భార్య పద్మ, ఇద్దరు కుమారులు, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. సొంతంగా మూడు ఎకరాల పొలం ఉండగా, ఓ రైతు వద్ద మరో ఎకరంనర కౌలుకు తీసుకున్నాడు.
మూడు ఎకరాల్లో మిర్చి, ఎకరంనరలో వరిసాగు చేశాడు. మిర్చిసాగుకు రూ.5 లక్షల వరకు అప్పు కాగా, గతంలో కుమార్తెల పెళ్లికి రూ.5 లక్షల వరకు అప్పు చేశాడు. మిర్చికి ఉన్న డిమాండ్‌ను దృష్టిలో ఉంచుకుని ఈ ఏడాది మంచి ధర వస్తుందని సాగు చేయగా తామరపురుగు, నల్లి తెగుళ్లతో చేనుకు పూర్తిగా నష్టం వాటిల్లింది. దీంతో అప్పులు ఎలా తీర్చాలని కొన్నిరోజులుగా మదనపడుతున్నాడు.
ఈ క్రమంలో రోజు మాదిరిగానే గురువారం కూడా మిరప మొక్కలకు పురుగు మందు చల్లి భార్యను ఇంటికి వెళ్లమన్నాడు. ఆమె వెళ్లిన తరువాత అదే చేనులో పురుగు మందుతాగాడు. రాత్రి ఇంటికి వచ్చి పురుగు మందు తాగానని కుటుంబ సభ్యులతో చెప్పడం తో వారు వెంటనే చికిత్సనిమిత్తం ఏరియా ఆస్పత్రి కి తరలిస్తుండగా మార్గమధ్యలోనే చనిపోయాడు. ఈ ఘటనపై మృతుడి భార్య పద్మ మహబూబాబాద్ రూరల్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.
Comments
Please login to add a commentAdd a comment