Chili crop
-
అత్యంత ఘాటైన మిరపగా గిన్నిస్ రికార్డు..ఒక్కటి తిన్నా ఇక అంతే!
ప్రపంచంలోనే అత్యంత ఘాటైన మిరపగా పెప్పర్ ఎక్స్ గిన్నిస్ వరల్డ్ రికార్డు సాధించింది. ఇంతవరకు అత్యంత ఘాటైన మిరపగా ఉన్న కరోలినా రీపర్ చిల్లి పెప్పర్‌ని వెనక్కి నెట్టి మరీ ఈ పెప్పర్ ఎక్స్ ఆ రికార్డును సొంతం చేసుకుంది. ఈ ఘాటైన మిరపకాయను మిచిగాన్‌కి చెందిన స్మోకిన్ ఎడ్ క్యూరీ రూపొందించారు. ఈ మిరపకాయను ఒక్కటి తిన్నా ఇక అంతే సంగతులు. తిన్న తర్వాత ఏకంగా మూడు గంటల పాటు గొంతు నాలుక మంటగా ఉంటాయట. మిరపకాయలలో క్రియాశీలకమైన భాగం అయిన క్యాప్సైసిన్ అనే విత్తనాలతో కూడిన భాగం తిన్న వెంటనే ఘాటుగా ఫీలయ్యే అనుభూతి కలుగుతుంది. మిరపకాయ ఘాటును స్కోవిల్లే హీట్ యూనిట్లో కొలుస్తారు. ఆ యూనిట్లో ఈ పెప్పర్ ఎక్స్ మిరకాయ ఘాటు ఏకంగా 2.69 మిలియన్లుగా నమోదైంది. జనాన్ని చెదరగొట్టడానికి వినియోగించే పెప్పర్ స్ప్రెని సైతం ఓడించింది. దీని ఘాటు 1.6 మిలియన్లు స్కోవిల్లే హీట్. ఈ స్ప్రే వల్ల ఒక్కోసారి కళ్లు పోతాయి. అంతకు మించి పవర్ఫుల్ అయిన ఈ పెప్పర్ ఎక్స్ మిరపని సరదాకి కూడా తినేందుకు ఎవ్వరూ యత్నించే సాహసానికి దిగలేరని ధీమాగా చెబుతున్నారు నిపుణులు. ఈ మేరకు ఈ మిరపకాయను సృష్టించిన క్యూరీ మాట్లాడుతూ..తాను జన్యు శాస్త్రాన్ని, రసాయన శాస్త్రాన్ని, వృక్ష శాస్త్రాన్ని కవర్ చేసి మరీ ఈ ఘాటైన మిరపకాయని సృష్టించినట్లు తెలిపారు. తాము కరోలినా రీపర్ చిల్లీని క్రాస్ బ్రీడింగ్ చేసి మరీ ఈ పెప్పర్ ఎక్స్ మిరపను సృష్టించినట్లు క్యూరీ తెలిపారు. క్యూరీ పదేళ్ల పాటు సాగు చేసి మరీ ఈ ఘాటైన మిరపను రూపొందించాడు. ఈమేరకు క్యూరీ యూట్యూబ్ సిరీస్, "హాట్ వన్స్" ఎపిసోడ్లో తాను సాగు చేసిన ఈ పెప్పర్ఎక్స్(x) గురించి ప్రపంచానికి తెలియజేశాడు. ప్రస్తుతానికి మాత్రం పెప్పర్ ఎక్స్‌తో తయారు చేసిన హాట్ సాస్‌లు మాత్రమే మార్కెట్లో అందుబాటులో ఉన్నాయి. ఇక పెప్పర్ ఎక్స్ రుచి గురించి ఇన్స్టాగ్రాం వేదికగా ఐదుగురు సెలబ్రెటి వ్యక్తులను పిలిపించి మరీ వివరించాడు. వారంతా ఈ మిరపను తిన్నా ఆయా సెలబ్రిటీలు అబ్బా...అంటూ దీని ఘాటు గురించి వేర్వేరు విధాలుగా వివరించారు. అందుకు సంబంధించిన వీడియో నెట్టింట తెగ సందడి చేస్తోంది. మీరు కూడా ఓ లుక్కేయండి. View this post on Instagram A post shared by Hot Ones (@hotones) (చదవండి: ఇదు శ్రీలంక: సీతా ఎలియా) -
అప్పులు పండె.. నూరేళ్లు నిండె!
మహబూబాబాద్ రూరల్: మిరప పంట చేతికి వచ్చాక అమ్మేసి అప్పులు తీర్చాలనుకున్న ఓ రైతు.. తెగుళ్ల కారణంగా నష్టపోవడంతో మనోవేదనకుగురై ఆత్మహత్య చేసుకున్నాడు. మహబూబాబాద్ జిల్లా మానుకోట మండలం లక్ష్మాతండాలో గురువారం రాత్రి ఈ విషాదకర ఘటన చోటుచేసుకుంది. లక్ష్మాతండాకు చెందిన అజ్మీర శ్రీను (39)కు భార్య పద్మ, ఇద్దరు కుమారులు, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. సొంతంగా మూడు ఎకరాల పొలం ఉండగా, ఓ రైతు వద్ద మరో ఎకరంనర కౌలుకు తీసుకున్నాడు. మూడు ఎకరాల్లో మిర్చి, ఎకరంనరలో వరిసాగు చేశాడు. మిర్చిసాగుకు రూ.5 లక్షల వరకు అప్పు కాగా, గతంలో కుమార్తెల పెళ్లికి రూ.5 లక్షల వరకు అప్పు చేశాడు. మిర్చికి ఉన్న డిమాండ్‌ను దృష్టిలో ఉంచుకుని ఈ ఏడాది మంచి ధర వస్తుందని సాగు చేయగా తామరపురుగు, నల్లి తెగుళ్లతో చేనుకు పూర్తిగా నష్టం వాటిల్లింది. దీంతో అప్పులు ఎలా తీర్చాలని కొన్నిరోజులుగా మదనపడుతున్నాడు. ఈ క్రమంలో రోజు మాదిరిగానే గురువారం కూడా మిరప మొక్కలకు పురుగు మందు చల్లి భార్యను ఇంటికి వెళ్లమన్నాడు. ఆమె వెళ్లిన తరువాత అదే చేనులో పురుగు మందుతాగాడు. రాత్రి ఇంటికి వచ్చి పురుగు మందు తాగానని కుటుంబ సభ్యులతో చెప్పడం తో వారు వెంటనే చికిత్సనిమిత్తం ఏరియా ఆస్పత్రి కి తరలిస్తుండగా మార్గమధ్యలోనే చనిపోయాడు. ఈ ఘటనపై మృతుడి భార్య పద్మ మహబూబాబాద్ రూరల్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. -
మిర్చి రైతులకు పరిహారం ఇవ్వండి: తమ్మినేని
కొణిజర్ల: రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో అంతుబట్టని వైరస్‌తో మిరప తోటలు నష్టపోయిన రైతులకు వెంటనే పరిహారం ప్రకటించాలని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం కోరారు. ఖమ్మం జిల్లా కొణిజర్ల మండలం లక్ష్మీపురంలో ఆదివారం ఆయన భద్రాచలం మాజీ ఎంపీ మిడియం బాబూరావు, స్థానిక సీపీఎం, రైతు సంఘం నాయకులతో కలిసి వైరస్‌తో దెబ్బతిన్న మిరప తోటలను పరిశీలించారు. ఈ సందర్భంగా తమ్మినేని మాట్లాడుతూ మిర్చి పంట గులాబీ, తామర పురుగులతో దెబ్బతిన్నదని, 80 వేల ఎకరాల్లో పంట నష్టపోయి రైతులు అప్పుల్లో కూరుకుపోయారని తెలిపారు. మిర్చి రైతులకు సలహాలు, సూచనలు అందించడంలో వ్యవసాయ, ఉద్యానవన శాఖ అధికారులు పూర్తిగా విఫలమయ్యారని విమర్శించారు. వ్యవసాయ, కీటక శాస్త్రవేత్తలు కూడా పరిశీలించి ఏమీ తేల్చకపోవడం విడ్డూరంగా ఉందన్నారు. పంటలు పూర్తిగా నష్టపోవడంతో కౌలురైతుల పరిస్థితి దయనీయంగా మారిందని వాపోయారు. రైతులు ఆత్మస్థైర్యాన్ని కోల్పోవద్దని, పరిహారం ఇప్పించే వరకు పోరాటం చేస్తామని తమ్మినేని భరోసా ఇచ్చారు. కార్యక్రమంలో సీపీఎం రాష్ట్ర కార్యదర్శి వర్గసభ్యుడు సుదర్శన్, జిల్లా కార్యదర్శి నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. స్థానికతకు ప్రాధాన్యమిచ్చేలా సవరణలుండాలి సాక్షి, హైదరాబాద్: అసంబద్ధ, లోపభూయిష్టమైన 317 జీవోను సమీక్షించి ఉద్యోగుల స్థానికతకు ప్రాధాన్యమిచ్చేలా సవరణలు చేయాలని సీఎం కేసీఆర్‌కు సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం ఆదివారం లేఖ రాశారు. ఆ లేఖను ఆయన మీడియాకు విడుదల చేశారు. రాష్ట్రంలో నూతన జోనల్ వ్యవస్థ అమల్లో భాగంగా ఉద్యోగుల సర్దుబాటు కోసం ప్రభుత్వం విడుదల చేసిన జీవో 317 లోపభూయిష్టంగా ఉందన్నారు. ఒక పెద్ద మార్పు జరిగే సందర్భంలో ఆ మార్పు వల్ల ప్రభావితమయ్యే వర్గాల ప్రతినిధులతో మాట్లాడి వారి అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకోవాలని సూచించారు. ఉద్యోగులు, ఉపాధ్యాయుల సమస్యలను వెంటనే సానుకూలంగా పరిశీలించి, జోక్యం చేసుకుని పరిష్కరించాలని తమ్మినేని కోరారు. ప్రభుత్వం ఇచ్చిన అసంబద్ధ ఉత్తర్వుల కారణంగా ఉద్యోగులు ప్రధానంగా ఉపాధ్యాయులు పెద్ద సంఖ్యలో ఉన్న ఊరును, సొంత జిల్లాను వదిలి పెట్టి మరొక జిల్లాకు శాశ్వతంగా వెళ్లాల్సిన దుస్థితి కల్పించారని విమర్శించారు. స్థానికత ఆధారంగా తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమానికి నాయకత్వం వహించిన మీరే స్థానికత పునాదులను ధ్వంసం చేయబూనుకోవటం అత్యంత బాధాకరమని ఆవేదన వ్యక్తంచేశారు. ఇతర జిల్లాలకు బలవంతంగా బదిలీ అయిన ఉపాధ్యాయులు 10 వేల మంది ఉంటారని, అవసరమైతే సూపర్ న్యూమరరీ పోస్టులను కేటాయించి వారి సొంత జిల్లాలకు తీసుకురావాలని కోరారు. -
రైతులకు కొత్తచట్టాలు అనుకూలం: జీవీఎల్
సాక్షి, గుంటూరు: దేశంలో తెలుగు రాష్ట్రాల్లో అత్యధికంగా మిర్చిని పండిస్తున్నారని ఎంపీ జీవీఎల్ నరసింహారావు తెలిపారు. టాస్క్‌ఫోర్స్ కమిటీ సమావేశంలో మిరప సాగుపై చర్చించామని పేర్కొన్నారు. ఏడాదికి 6200 కోట్ల రూపాయల మిర్చి ఎగుమతి జరుగుతోందన్నారు.ఏఏ దేశాలకు ఎగుమతి చేయాలి, సాగులో ఎదురవుతున్న ఇబ్బందులు, మిర్చి రైతులకు మంచి ధర వచ్చేలా ఏ చర్యలు తీసుకోవాలి వంటి పలు అంశాలపై చర్చించామని జీవీఎల్ వెల్లడించారు. (చదవండి: పురిటి గడ్డ రుణం.. సీఎం జగన్ సంకల్పం) కేంద్రం చేసిన కొత్త చట్టాలు రైతులకు అనుకూలంగా ఉన్నాయి. ఎగుమతి దారులతో రైతులను అనుసంధానం చేస్తాం. దీంతో మంచి ధర వచ్చే అవకాశం ఉందని ఆయన పేర్కొన్నారు. విపరీతంగా పురుగు మందులు వాడటాన్ని గమనించామని, అందరితో చర్చించి పురుగు మందుల వాడకాన్ని తగ్గించే విధంగా సిఫార్స్ చేస్తామని చెప్పారు. వాటిని రైతుల వద్దకు తీసుకెళ్లేందుకు ప్రణాళికలు రూపొందిస్తామని పేర్కొన్నారు. స్పైసెస్ పార్కును అందుబాటులో తెచ్చేందుకు అధ్యయనం చేసి చర్యలు తీసుకొంటామని ఎంపీ జీవీఎల్ నరసింహారావు వెల్లడించారు.(చదవండి: ‘ఆయన.. నీటి విలువ తెలిసిన వ్యక్తి’) -
మిర్చికి ధర కోసం కేంద్రాన్ని కోరాం: వినోద్
సాక్షి, హైదరాబాద్: మిర్చి పంటకు కనీస మద్దతు ధర ప్రకటించే సంప్రదాయం లేదని, అయినా, మిర్చి రైతుకు గిట్టుబాటు ధర కల్పించాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరామని టీఆర్ఎస్ ఎంపీ బి.వినోద్‌కుమార్ తెలిపారు. రాష్ట్రంలో ఈసారి మిర్చి పంట బాగా పండిందని, దిగుబడి ఎకరాకు 24క్వింటాళ్లకు పెరిగిందని ఆయన చెప్పారు. తెలంగాణభవన్‌లో గురువారం ఆయన విలేకరులతో మాట్లాడారు. పంట దిగుబడి పెరిగి రైతు ఆనందంతో ఉన్నా గిట్టుబాటు ధర లేక అసంతృప్తిగా ఉన్నాడని, గతం కంటే ఈసారి మిర్చి పంట విస్తీర్ణం కూడా బాగా పెరగడంతో సరైన ధర లేకుండా పోయిందన్నారు. మిర్చి రైతుల సమస్యలపై గత నెలాఖరులోనే కేంద్ర వ్యవసాయ మంత్రి రాధామోహన్‌సింగ్‌తో భేటీ అయ్యానని, రైతుకు గిట్టుబాటు ధర కోసం ‘మార్కెట్ ఇన్టర్వెన్షన్’ నిధిని ఏర్పాటు చేయాలని కేంద్రాన్ని కోరామని వివరించారు. టీఆర్ఎస్ ఎంపీల విజ్ఞప్తి మేరకు ఈ నెల 18న రాష్ట్ర వ్యవసాయ అధికారులను కేంద్రం పిలిచిందని చెప్పారు. కాగా, రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి ఎన్నికలకు ఇంకా సమయం ఉందని, ఎవరికి మద్దతు ఇవ్వాలన్నది పార్టీలో చర్చించి నిర్ణయం తీసుకుంటామన్నారు. -
పూత లేదు.. కాత రాదు
సాక్షి ప్రతినిధి, ఖమ్మం: మొక్కలన్నీ ఏపుగా పెరిగాయి.. కానీ పూత.. కాత లేదు.. రైతుల కోట్ల పెట్టుబడులు మట్టిపాలయ్యాయి. ఒకటి కాదు రెండు కాదు ఖమ్మం, వరంగల్ జిల్లాలో వేలాది ఎకరాల్లో మిర్చి పంట పరిస్థితి ఇది! నకిలీ విత్తనాలతో 5 వేల మంది రైతులు నిండా మునిగారు. రూ.400 కోట్లకుపైగా నష్టపోయారు. పూత, కాత లేని మిర్చి పంటను పీకేసి పరిహారం కోసం రోడ్డెక్కుతున్నారు. ఇక ఖమ్మం జిల్లాలో పంటలను పరిశీలించిన రాష్ట్ర స్థాయి బృందం కూడా మూడు కంపెనీల విత్తనాలు నకిలీవని నిర్ధారించింది. గతం కంటే ఎక్కువగా.. రాష్ట్రంలో ఖమ్మం, వరంగల్ జిల్లాల్లో మిర్చి పంట అధికంగా సాగవుతుంది. గతేడాది క్వింటాలు మిర్చికి రూ.13వేల వరకు ధర పల కడంతో ఈసారి రైతులు సాధారణ విస్తీర్ణం కంటే ఎక్కువగా సాగు చేశారు. ఖమ్మం జిల్లాలో మిర్చి సాధారణ విస్తీర్ణం 65 వేల ఎకరాలు కాగా.. ఈసారి మరో 10 వేల ఎకరాల్లో అదనంగా (మొత్తం 75 వేల ఎకరాల్లో) సాగు చేశారు. ఆగస్టు మొదటి, రెండో వారాల్లో విత్తనాలు, నారుతో పంట వేశారు. సాధారణంగా మిర్చి పంట నెల రోజులకే పూతకు వస్తుంది, తర్వాత కాయలు ఏర్పడతాయి. కానీ ఇక్కడ నెలన్నర, రెండు నెలలవుతున్నా, చాలా చోట్ల మొక్కలు ఏపుగా పెరిగినా.. పూత రాలేదు, కాత కనబడలేదు. దీంతో రైతులు ఏదో తెగులు సోకిందని తొలుత భావిం చారు. కానీ చాలా చోట్ల ఇదే పరిస్థితి నెలకొనడంతో తాము వేసినవి నకిలీ విత్తనాలు గా గ్రహిం చారు. దీంతో మిర్చి పంటను పీకేసి.. ఆందోళనలకు దిగారు. ఖమ్మం జిల్లాలోని తిరుమలాయపాలెం, కొణిజర్ల, కూసుమంచి, చర్ల, జూలూరుపాడు, సత్తుపల్లి, వైరా, ఏన్కూరు, కారేపల్లి, టేకులపల్లి, ఇల్లెందు మండలాల్లో, వరంగల్ జిల్లాలోని తొర్రూరు, నర్సంపేట, మహబూబాబాద్, పరకాల డివిజన్లలో ఇలా పెద్ద సంఖ్యలో రైతులు నష్టపోయారు. తమకు కంపెనీల నుంచి పరిహారం ఇప్పించాలని లేదా ప్రభుత్వమైనా ఆదుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. 13 వేల ఎకరాల్లో... ఖమ్మం జిల్లాలో 8వేలు, వరంగల్ జిల్లాలో 5వేల ఎకరాల్లో నకిలీ విత్తనాల కారణంగా నష్టం వాటిల్లింది. దీంతో పెద్ద సంఖ్యలో రైతులు ఆందోళన వ్యక్తం చేస్తూ.. వ్యవసాయ కార్యాలయాలు,డీలర్ల దుకాణాలు, రోడ్లపై నిరసనలు వ్యక్తం చేస్తున్నారు. అయితే... నష్టం మూడు వేల ఎకరాల వరకే ఉంటుందని వ్యవసాయ అధికారులు చెబుతున్నారు. కానీ చాలా మంది రైతులు సాగు చేసింది నాసిరకం విత్తనాలేనని, నష్టం చాలా ఎక్కువగా ఉంటుందని రైతులు చెబుతున్నారు. విత్తనాల కొనుగోలు, సాగు ఖర్చు, పంట నష్టం కలిపి సుమారు రూ.400 కోట్లకుపైగా నష్టపోయినట్లు అంచనా వేస్తున్నారు. విత్తన, సాగు ఖర్చును మాత్రమే నష్టంగా పరిగణించవద్దని.. దిగుబడిని కూడా నష్టంగా లెక్కించాలని రైతు సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. ప్రస్తుతం సీజన్ కూడా అరుుపోవడంతో మళ్లీ సాగు చేసే పరిస్థితి లేదని పేర్కొంటున్నారుు. నకిలీ విత్తనాలు వాస్తవమే... ఖమ్మం జిల్లాలో నకిలీ విత్తనాలతో మిర్చి సాగు జరిగిందని రాష్ట్ర స్థాయి బృం దం ప్రాథమికంగా తేల్చింది. నష్టపోయిన రైతుల ఆందోళన నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం అధికారులు, శాస్త్రవేత్తలతో కూడిన బృందాన్ని శుక్రవారం ఖమ్మం జిల్లాకు పంపింది. తెలంగాణ ఉద్యాన వర్సిటీ శాస్త్రవేత్త సైదయ్య, వ్యవసాయ శాఖ కమిషనరేట్ డీడీ ఎం.వి.మధుసూదనరావు, ఏడీఏలు రాజారత్నం, శివానంద్, ఉద్యాన శాఖ డీడీ ఆర్.శ్రీనివాసరావు, ఏడీ కె.సూర్యనారాయణలతో కూడిన బృందం కూసుమంచి, తిరుమలాయపాలెం, కొణిజర్ల మండలాల్లో మిర్చి తోటలను పరిశీలించింది. రైతులు సాగు చేసిన విత్తన ప్యాకెట్లను తెప్పించుకుని చూసింది. రైతులు విత్తనాల కొనుగోలుకు, సాగుకు చేసిన ఖర్చు, పంటలు వేసిన సమయం, పూత, కాత రాకపోవడం వంటి వివరాలను తెలుసుకుంది. అనంతరం అధికారులు, శాస్త్రవేత్తలు మీడియాతో మాట్లాడారు. ఖమ్మం జిల్లాలో జీవా, గ్రీన్ ఎరా కంపెనీ సీఎస్ 333, సుమతీ సీడ్సకు చెందిన శృతి రకం విత్తనాలలో నకిలీ శాతం ఎక్కువగా ఉన్నట్లు గుర్తించామని చెప్పారు. అన్ని తోటలలో ఆకులను సేకరించి డీఎన్ ఏ పరీక్షలకు పంపుతున్నట్లు తెలిపారు. విత్తన లోపమున్నట్లు తేలితే కంపెనీలపై, విత్తనాలు అమ్మిన డీలర్లపై క్రిమినల్ కేసులు నమోదు చేసి, చర్యలు తీసుకుంటామని చెప్పారు. వరంగల్ జిల్లాలో కూడా పంట లను పరిశీలించిన అనంతరం ప్రభుత్వానికి పూర్తిస్థారుు నివేదిక ఇస్తామన్నారు. -
మిర్చి విత్తనాలు కిలో రూ.లక్షా పదివేలు!
యూఎస్ కంపెనీ మిరప విత్తనాలకు భలే గిరాకీ - ఎంఆర్పీ కిలో రూ.40 వేలు ఉన్నా.. రూ.లక్షా పదివేలకు అమ్మకం - రైతుల డిమాండ్‌తో దోపిడీ చేస్తున్న వ్యాపారులు - అసలే పట్టించుకోని వ్యవసాయశాఖ అధికారులు సాక్షి ప్రతినిధి, వరంగల్ : మిరపకాయ విత్తనాల ధరల ఘాటుకు రైతులు అల్లాడిపోతున్నారు. గత సీజన్లో లాభాలు తెచ్చిన మిరపపంటను మళ్లీ వేయాలనుకునే రైతులు ఈసారి విత్తనాల ధరలను చూసి ఆందోళన చెందుతున్నారు. గత ఏడాది మిర్చి రైతులకు మంచి ధరలు వచ్చాయి. ఈసారీ ఇదే పరిస్థితి ఉంటుందనే ఆశతో ఎక్కువ మంది రైతులు మిరప పంట సాగు చేసేందుకు ఆసక్తి చూపుతున్నారు. విత్తనాలకు డిమాండ్ ఉంటుందనే పరిస్థితిని విత్తన కంపెనీలు ముందే పసిగట్టి ధరలను భారీగా పెంచాయి. గత ఏడాది కంటే రెండుమూడు రెట్లు అధికం చేశాయి. డిమాండ్ కారణంగా వ్యాపారులు ఎంఆర్పీ కంటే అధిక ధరలకు విక్రయిస్తున్నారు. మిరప విత్తనాలు కిలో పరిమాణంలో బాక్సు(ప్యాకెట్)లో ఉంటాయి. కిలో ప్యాకెట్లలో మళ్లీ 10 గ్రాముల చొప్పున పరిమాణంతో చిన్న ప్యాకెట్లలో ఉంటాయి. గత ఏడాది ఎక్కువగా సాగు చేసిన యూఎస్ కంపెనీ విత్తనాల ధరలకు ఈసారి మార్కెట్లో డిమాండ్ ఉంది. ఈ కంపెనీల 10 గ్రాముల ప్యాకెట్ల ఎంఆర్పీ సగటున రూ.400 ఉంది. కానీ, మిరప పంటను ఎక్కువగా సాగు చేసే వరంగల్ జిల్లా నర్సంపేట ప్రాంతంలో వ్యాపారులు ఈ ప్యాకెట్‌ను రూ.1100 చొప్పున అమ్ముతున్నారు. అంటే ఎంఆర్పీ కిలో రూ.40 వేలు ఉండగా, దాన్ని ప్రస్తుతం కిలో రూ.1.10 లక్షల చొప్పున విక్రరుుస్తున్నారు. దీన్ని వ్యవసాయశాఖ అధికారులు పట్టించుకోవడంలేదు. రాష్ట్రంలో మిరప పంట సాధారణ సాగు విస్తీర్ణం 1.50 లక్షల ఎకరాలు ఉంది. వరంగల్, ఖమ్మం జిల్లాల్లో ఎక్కువగా సాగు చేస్తారు. మిరప పంటకు నీరు ఎక్కువగా అవసరం. గత ఏడాది కరువు కారణంగా దేశవ్యాప్తంగా మిరప సాగు తగ్గింది. మన రాష్ట్రంలో 95 వేల ఎకరాల్లోనే ఈ పంటను సాగు చేశారు. సాగు తగ్గిపోవడంతో మిర్చికి డిమాండ్ పెరిగింది. మిరప ఏడాదికి ఒకే క్రాప్ వస్తుంది. జూలైలో నారు పోసి ఆగస్టులో వేస్తారు. జనవరి నెలాఖరు నుంచి ఏప్రిల్ వరకు పంట వస్తుంది. ఎకరా విస్తీర్ణంలో మిరప సాగుకు 100 గ్రాముల విత్తనాలు అవసరమవుతాయి. విత్తన వ్యాపారులు డిమాం డ్ సాకుతో ధరలు మరింత పెంచుతున్నారు. వ్యవసాయ శాఖ అధికారుల పర్యవేక్షణ లేకపోవడంతో వ్యాపారులు చెప్పిన ధరలకే రైతులు కొనుగోలు చేస్తున్నారు. రేట్లు పెంచారు... మిర్చి పంట వేసే రైతులకు కష్ట కాలం ఉంది. విత్తనాల ధరలు బాగా పెంచారు. గతేడాది ధరల కంటే ఇప్పుడు బాగా పెరిగినయి. తూకంలోనూ తేడాలొస్తున్నాయి. అప్పుడు మంచి ధరలు వచ్చినయని ఇప్పుడు ఎక్కువ మంది సాగు చేస్తున్నారు. కంపెనీలు విత్తనాల ధరలు బాగా పెంచినయి. ఇంతింత ధరలు ఉంటే సాగు చేయడం కష్టమైతది. - రాధారపు రాజయ్య, కొండైలుపల్లి, నల్లబెల్లి మండలం, వరంగల్ జిల్లా మోసం చేస్తున్నారు రైతుల అవసరాన్ని చూసి దళారులు మోసం చేస్తాండ్లు. కొన్ని కంపెనీల నకిలీ విత్తనాలు అమ్ముతాండ్లు. మార్కెట్లళ్ల రాలిన గింజలను తీసి ప్యాకింగ్ చేసి దుకాండ్లలో పెడుతున్నారు. ఇవే మంచివని వ్యాపారులు రైతులతో చెప్పి.. కొనిపిస్తాండ్లు. 12 ఎకరాల్లో మిర్చి వేస్తున్నా. 40 ఏళ్లుగా నేను పండించిన మిర్చిలనే మంచి కాయలను ఏరి ఆ విత్తనాలతో సాగు చేసుకుంటున్న. - రేమిడి రాజిరెడ్డి, దాసరిపల్లి, నర్సంపేట