మిర్చి విత్తనాలు కిలో రూ.లక్షా పదివేలు!
యూఎస్ కంపెనీ మిరప విత్తనాలకు భలే గిరాకీ
- ఎంఆర్‌పీ కిలో రూ.40 వేలు ఉన్నా.. రూ.లక్షా పదివేలకు అమ్మకం
- రైతుల డిమాండ్‌తో దోపిడీ చేస్తున్న వ్యాపారులు
- అసలే పట్టించుకోని వ్యవసాయశాఖ అధికారులు
సాక్షి ప్రతినిధి, వరంగల్ : మిరపకాయ విత్తనాల ధరల ఘాటుకు రైతులు అల్లాడిపోతున్నారు. గత సీజన్‌లో లాభాలు తెచ్చిన మిరపపంటను మళ్లీ వేయాలనుకునే రైతులు ఈసారి విత్తనాల ధరలను చూసి ఆందోళన చెందుతున్నారు. గత ఏడాది మిర్చి రైతులకు మంచి ధరలు వచ్చాయి. ఈసారీ ఇదే పరిస్థితి ఉంటుందనే ఆశతో ఎక్కువ మంది రైతులు మిరప పంట సాగు చేసేందుకు ఆసక్తి చూపుతున్నారు. విత్తనాలకు డిమాండ్ ఉంటుందనే పరిస్థితిని విత్తన కంపెనీలు ముందే పసిగట్టి ధరలను భారీగా పెంచాయి. గత ఏడాది కంటే రెండుమూడు రెట్లు అధికం చేశాయి. డిమాండ్ కారణంగా వ్యాపారులు ఎంఆర్‌పీ కంటే అధిక ధరలకు విక్రయిస్తున్నారు. మిరప విత్తనాలు కిలో పరిమాణంలో బాక్సు(ప్యాకెట్)లో ఉంటాయి. కిలో ప్యాకెట్లలో మళ్లీ 10 గ్రాముల చొప్పున పరిమాణంతో చిన్న ప్యాకెట్లలో ఉంటాయి.
గత ఏడాది ఎక్కువగా సాగు చేసిన యూఎస్ కంపెనీ విత్తనాల ధరలకు ఈసారి మార్కెట్‌లో డిమాండ్ ఉంది. ఈ కంపెనీల 10 గ్రాముల ప్యాకెట్ల ఎంఆర్‌పీ సగటున రూ.400 ఉంది. కానీ, మిరప పంటను ఎక్కువగా సాగు చేసే వరంగల్ జిల్లా నర్సంపేట ప్రాంతంలో వ్యాపారులు ఈ ప్యాకెట్‌ను రూ.1100 చొప్పున అమ్ముతున్నారు. అంటే ఎంఆర్‌పీ కిలో రూ.40 వేలు ఉండగా, దాన్ని ప్రస్తుతం కిలో రూ.1.10 లక్షల చొప్పున విక్రరుుస్తున్నారు. దీన్ని వ్యవసాయశాఖ అధికారులు పట్టించుకోవడంలేదు. రాష్ట్రంలో మిరప పంట సాధారణ సాగు విస్తీర్ణం 1.50 లక్షల ఎకరాలు ఉంది. వరంగల్, ఖమ్మం జిల్లాల్లో ఎక్కువగా సాగు చేస్తారు. మిరప పంటకు నీరు ఎక్కువగా అవసరం. గత ఏడాది కరువు కారణంగా దేశవ్యాప్తంగా మిరప సాగు తగ్గింది.
మన రాష్ట్రంలో 95 వేల ఎకరాల్లోనే ఈ పంటను సాగు చేశారు. సాగు తగ్గిపోవడంతో మిర్చికి డిమాండ్ పెరిగింది. మిరప ఏడాదికి ఒకే క్రాప్ వస్తుంది. జూలైలో నారు పోసి ఆగస్టులో వేస్తారు. జనవరి నెలాఖరు నుంచి ఏప్రిల్ వరకు పంట వస్తుంది. ఎకరా విస్తీర్ణంలో మిరప సాగుకు 100 గ్రాముల విత్తనాలు అవసరమవుతాయి. విత్తన వ్యాపారులు డిమాం డ్ సాకుతో ధరలు మరింత పెంచుతున్నారు. వ్యవసాయ శాఖ అధికారుల పర్యవేక్షణ లేకపోవడంతో వ్యాపారులు చెప్పిన ధరలకే రైతులు కొనుగోలు చేస్తున్నారు.
రేట్లు పెంచారు...
మిర్చి పంట వేసే రైతులకు కష్ట కాలం ఉంది. విత్తనాల ధరలు బాగా పెంచారు. గతేడాది ధరల కంటే ఇప్పుడు బాగా పెరిగినయి. తూకంలోనూ తేడాలొస్తున్నాయి. అప్పుడు మంచి ధరలు వచ్చినయని ఇప్పుడు ఎక్కువ మంది సాగు చేస్తున్నారు. కంపెనీలు విత్తనాల ధరలు బాగా పెంచినయి. ఇంతింత ధరలు ఉంటే సాగు చేయడం కష్టమైతది.
- రాధారపు రాజయ్య, కొండైలుపల్లి, నల్లబెల్లి మండలం, వరంగల్ జిల్లా
మోసం చేస్తున్నారు
రైతుల అవసరాన్ని చూసి దళారులు మోసం చేస్తాండ్లు. కొన్ని కంపెనీల నకిలీ విత్తనాలు అమ్ముతాండ్లు. మార్కెట్లళ్ల రాలిన గింజలను తీసి ప్యాకింగ్ చేసి దుకాండ్లలో పెడుతున్నారు. ఇవే మంచివని వ్యాపారులు రైతులతో చెప్పి.. కొనిపిస్తాండ్లు. 12 ఎకరాల్లో మిర్చి వేస్తున్నా. 40 ఏళ్లుగా నేను పండించిన మిర్చిలనే మంచి కాయలను ఏరి ఆ విత్తనాలతో సాగు చేసుకుంటున్న.
- రేమిడి రాజిరెడ్డి, దాసరిపల్లి, నర్సంపేట