మిర్చికి ధర కోసం కేంద్రాన్ని కోరాం: వినోద్
సాక్షి, హైదరాబాద్: మిర్చి పంటకు కనీస మద్దతు ధర ప్రకటించే సంప్రదాయం లేదని, అయినా, మిర్చి రైతుకు గిట్టుబాటు ధర కల్పించాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరామని టీఆర్‌ఎస్ ఎంపీ బి.వినోద్‌కుమార్ తెలిపారు. రాష్ట్రంలో ఈసారి మిర్చి పంట బాగా పండిందని, దిగుబడి ఎకరాకు 24క్వింటాళ్లకు పెరిగిందని ఆయన చెప్పారు. తెలంగాణభవన్‌లో గురువారం ఆయన విలేకరులతో మాట్లాడారు. పంట దిగుబడి పెరిగి రైతు ఆనందంతో ఉన్నా గిట్టుబాటు ధర లేక అసంతృప్తిగా ఉన్నాడని, గతం కంటే ఈసారి మిర్చి పంట విస్తీర్ణం కూడా బాగా పెరగడంతో సరైన ధర లేకుండా పోయిందన్నారు.
మిర్చి రైతుల సమస్యలపై గత నెలాఖరులోనే కేంద్ర వ్యవసాయ మంత్రి రాధామోహన్‌సింగ్‌తో భేటీ అయ్యానని, రైతుకు గిట్టుబాటు ధర కోసం ‘మార్కెట్ ఇన్టర్వెన్షన్’ నిధిని ఏర్పాటు చేయాలని కేంద్రాన్ని కోరామని వివరించారు. టీఆర్‌ఎస్ ఎంపీల విజ్ఞప్తి మేరకు ఈ నెల 18న రాష్ట్ర వ్యవసాయ అధికారులను కేంద్రం పిలిచిందని చెప్పారు. కాగా, రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి ఎన్నికలకు ఇంకా సమయం ఉందని, ఎవరికి మద్దతు ఇవ్వాలన్నది పార్టీలో చర్చించి నిర్ణయం తీసుకుంటామన్నారు.