కళ్లల్లో పెట్టుకుని చూసుకోవలసిన బంగారు తల్లిని.. గుండెల్లో పదిలంగా దాచుకోవలసిన చిట్టి తల్లిని.. ముద్దులు మూటగడుతున్న పసికందుని ఎక్కడికి తీసుకెళ్తున్నాడో తెలియక అమాయకంగా చిరునవ్వులు పూయిస్తున్న సిరిమల్లిని..చిదిమేశాడు.. కరెంటు పెట్టి కర్కశంగా కన్నతండ్రే చంపేశాడు. భార్యపై అనుమానంతో బిడ్డ పాలిట కాలయముడయ్యాడు. అనంతరం పురుగు మందు తాగి ఆస్పత్రిలో చావుబతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్నాడు. సిద్దిపేట జిల్లా తొగుట మండలం వెంకట్రావుపేటలో శుక్రవారం జరిగిన ఈ ఘటనపై గ్రామస్తులు, పోలీసులు తెలిపిన వివరాలివి.
కరెంటు షాక్‌తో చిన్నారి రెండు కాళ్లు కాలిపోయిన దృశ్యం
దుబ్బాక టౌన్/తొగుట: వెంకట్రావుపేటకు చెందిన మిరుదొడ్డి రాజశేఖర్ (32)కు రెండేళ్ల క్రితం దౌల్తాబాద్‌కు చెందిన సునీతతో వివాహమైంది. తొమ్మిది నెలల క్రితం పాప ప్రిన్సీ జన్మించింది. అప్పటి నుంచి ఇద్దరి మధ్య గొడవలు జరుగుతున్నాయి.
ఆరు నెలల క్రితం పెద్దల సమక్షంలో పంచాయతీ నిర్వహించి సర్ది చెప్పినా రాజశేఖర్ ప్రవర్తనలో మార్పు రాలేదు. భర్త ప్రవర్తనతో విసిగిన సునీత పుట్టింటికి వెళ్లి పోయింది. దీంతో నెల రోజుల క్రితం భార్యకు సర్దిచెప్పి మళ్లీ వెంకట్రావుపేటకు తీసుకొచ్చాడు.
కిరాతక తండ్రి చేతిలో బలైన చిన్నారి ప్రిన్సీ
రెండు కాళ్లకు విద్యుత్ తీగ చుట్టి..
ఈ నేపథ్యంలో శుక్రవారం మధ్యాహ్నం పాపను బయటికి తీసుకెళ్తున్నానంటూ ఇంట్లో చెప్పి వ్యవసాయ బావి వద్దకు తీసుకెళ్లాడు. అక్కడ పాప రెండు కాళ్లకు విద్యుత్ తీగ చుట్టి షాక్ ఇచ్చి చంపేశాడు. అనంతరం మిరపతోటకు వినియోగించే పురుగు మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఇది గమనించిన సమీపంలోని రైతులు తొగుట పోలీసులకు సమాచారం అందించారు. ఏఎస్‌ఐ రాంరెడ్డి సంఘటన స్థలానికి చేరుకుని పాప మృతదేహాన్ని సిద్దిపేట ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.
అపస్మారక స్థితిలో ఉన్న రాజశేఖర్‌ను గజ్వేల్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించగా అక్కడ ప్రాథమిక చికిత్స చేసి.. పరిస్థితి విషమించడంతో ములుగు ఆర్వీఎం ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం అతడి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. సంఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.
చిన్నితల్లీ.. నువ్వు లేకుండా నేనెట్టా బతికేది
‘అయ్యో నా చిన్ని తల్లి.. నువ్వు లేకుండా నేనెట్లా బతికేది’.. అంటూ కూతురి మృతదేహాన్ని పట్టుకొని కన్నతల్లి గుండెలవిసేలా రోదించడం స్థానికులను కలచివేసింది. ‘ఆడించడానికి బయటికి తీసుకపోతున్నాడనుకున్నా.. గింత దారుణానికి పాల్పడతాడని కలలో కూడా ఊహించలేదు.. నా బిడ్డ లేకుండా నేను ఎట్లా బతకాలి?’అంటూ ఆ తల్లి గుండెలు బాదుకుంటూ కన్నీరుమున్నీరయ్యింది.
Comments
Please login to add a commentAdd a comment