పర్చూరు: అకస్మాత్తుగా ఇంజిన్‌లో మంటలొచ్చి ఓ ట్రావెల్స్ బస్సు దగ్ధమైంది. అయితే డ్రైవర్ అప్రమత్తతతో అందులోని ప్రయాణికులు సురక్షితంగా బయటపడ్డారు. ప్రకాశం జిల్లాలోని పర్చూరు–చిలకలూరిపేట ఆర్ అండ్ బీ రోడ్డుపై.. పర్చూరు మండలంలోని తిమ్మరాజుపాలెంలో గురువారం వేకువ జామున ఈ ఘటన జరిగింది. ఆరెంజ్ ట్రావెల్స్‌కు చెందిన బస్సు హైదరాబాద్‌లోని పఠాన్‌చెరువు నుంచి బుధవారం రాత్రి 10.30 గంటల సమయంలో 20 మంది ప్రయాణికులతో బయలుదేరింది. గుంటూరు జిల్లా నరసరావుపేటలో 11 మందిని, చిలకలూరిపేటలో ఒకరిని దించింది.
పర్చూరు, చీరాల మీదుగా గుంటూరు జిల్లా బాపట్లకు బస్సు వెళ్లాల్సి ఉంది. పర్చూరు మండలం తిమ్మరాజుపాలెం వచ్చేసరికి గేర్ రాడ్డు పక్క నుంచి పొగలు రావడాన్ని డ్రైవర్ గమనించాడు. వెంటనే బస్సును రోడ్డు పక్కన ఆపి అందులో ఉన్న మిగిలిన 8 మంది ప్రయాణికులను కిందికి దించాడు. అంతలోనే ఇంజిన్ నుంచి పెద్ద ఎత్తున మంటలు చెలరేగి బస్సు మొత్తం వ్యాపించాయి. బస్సు పూర్తిగా దగ్ధమైంది. చిలకలూరిపేట అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించగా.. వారు అక్కడికి చేరుకుని మంటలను ఆర్పివేశారు. ప్రయాణికులతో పాటు ఎవరికీ ఎటువంటి ప్రమాదం జరగకుండా సురక్షితంగా బయటపడటంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. ఘటనాస్థలాన్ని ఆర్డీవో ప్రభాకరరెడ్డి తదితరులు పరిశీలించారు. కేసు దర్యాప్తు చేస్తున్నట్టు యద్ధనపూడి ఎస్‌ఐ రత్నకుమారి చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment