మరణంలోనూ వీడని స్నేహ బంధం | Five people died in road accident at hyderabad | Sakshi
Sakshi News home page

మరణంలోనూ వీడని స్నేహ బంధం

Published Sun, Dec 8 2024 8:37 AM | Last Updated on Sun, Dec 8 2024 8:37 AM

Five people  died in road accident at hyderabad

అయిదుగురు నగర యువకుల జల సమాధి

వీరందరూ చిన్ననాటి మిత్రులే.. ∙   

ఎల్‌బీనగర్‌లో విషాద ఛాయలు  

నాగోలు: వారంతా చిన్ననాటి మిత్రులు. మరణంలోనూ వారి స్నేహబంధం విడిపోలేదు. యాదాద్రి– భువనగిరి జిల్లా భూదాన్‌ పోచంపల్లి మండలం జలాల్‌పూర్‌ చెరువులోకి కారు దూసుకెళ్లిన దుర్ఘటనలో నగరానికి చెందిన అయిదుగురు యువకులు జల సమాధి కావడంతో స్థానికంగా తీవ్ర విషాదం నెలకొంది. మృతుల కుటుంబాల్లో తీరని దుఃఖమే మిగిలింది. వివరాలు ఇలా ఉన్నాయి.  

ఎక్కడికెళ్లినా అందరూ కలిసే.. 
నగర శివారు బోడుప్పల్‌ జ్యోతినగర్‌లో ఉంటున్న మణికంఠ అనే యువకుడు ఉద్యోగాన్వేషణలో ఉన్నాడు. ఇతని స్నేహితుడు ఎల్‌బీనగర్‌ సిరినగర్‌ కాలనీ చెందిన తీగళ్ల వంశీ గౌడ్‌ (23) ఫొటోగ్రాఫర్‌. ఎల్‌బీనగర్‌ మజీద్‌ గల్లీకి చెందిన వీరమల్ల విఘ్నేష్‌ గౌడ్‌ (21) ఇంటర్‌ పూర్తి చేశాడు. ఎల్‌బీనగర్‌కు చెందిన హర్షవర్ధన్‌ (21) డిగ్రీ చదువుతూ రాపిడో డైవర్‌గా పని చేస్తుండగా.. ఇదే ప్రాంతానికి చెందిన కలకోటి అక్షయ్‌ కుమార్‌ (19) ఇంటర్‌ చదువుకున్నాడు. ఎల్‌బీ నగర్‌ సిరినగర్‌ కాలనీలో ఉంటున్న జెల్లా వినయ్‌ (20) బీటెక్‌ మూడో సంవత్సరం చదువుతున్నాడు. వీరంతా చిన్ననాటి స్నేహితులు. ఎల్‌బీనగర్‌ పరిసర ప్రాంతాల్లో వీరు తరచూ కలుసుకుంటూ ఉంటారు. ఎక్కడికైనా అందరూ కలిసే వెళ్తుంటారు.  

మణికంఠ ఒక్కడే బతికాడు..  
ఈ నేపథ్యంలో శుక్రవారం సాయంత్రం ఎల్‌బీనగర్‌లో స్నేహితులందరూ కలుసుకున్నారు. అప్పటికే వంశీ గౌడ్‌ దగ్గర తన స్నేహితుడి కారు మారుతి స్విఫ్ట్‌ కారు ఉంది. ఆరుగురు స్నేహితులు కలిసి సరదాగా వెళ్లొద్దామని కారులో నగరంలో తిరుగుతూ యాదాద్రి– భువనగిరి జిల్లా కొత్తగూడెం నుంచి భూదాన్‌ పోచంపల్లికి తెల్లవారుజామున చేరుకున్నారు. అక్కడ టిఫిన్‌ దొరక్కపోవడంతో కొత్తగూడేనికి వచ్చారు. అక్కడ కూడా టిఫిన్‌ దొరక్కపోవడంతో కొద్ది సమయం అక్కడే ఉన్నారు. అక్కడి నుంచి వలిగొండలో తాటికల్లు కోసం కారులో బయలుదేరారు. అప్పుడు కారును వంశీ గౌడ్‌ నడుపుతున్నాడు. కారు మితిమీరిన వేగంతో వెళుతూ అదుపు తప్పి జలాల్‌పూర్‌ చెరువులోకి దూసుకెళ్లింది. కారులో ఉన్న ఆరుగురిలో మణికంఠ ఒక్కడు మాత్రమే డోర్‌ ఓపెన్‌ చేసుకొని బయటపడ్డాడు. మిగతా అయిదుగురూ చెరువులోనే జల సమాధి అయ్యారు.  

అంతులేని ఆవేదన..  
ఎల్‌బీనగర్‌ పరిసర కాలనీల్లో నివాసం ఉండే అయిదుగురు స్నేహితులు ఒకేసారి చనిపోవడంతో ఆయా కుటుంబాల్లో అంతులేని ఆవేదన నెలకొంది. యువకుల కుటుంబ సభ్యులు, స్నేహితుల రోదనలతో ఆయా కాలనీల్లో విషాధ ఛాయలు అలుముకున్నాయి. ఎదిగి వచి్చన యువకులు తమ కుటుంబాలకు అండగా ఉంటారని అనుకుంటే.. వారంతా జల సమాధి కావడం అంతులేని విషాదాన్ని నింపింది.    

పక్కనే ఉన్నా.. ఇంటికి వస్తున్నా అమ్మా..  
ఎల్‌బీనగర్‌లో నివాసం ఉండే హర్షవర్ధన్‌ ర్యాపిడో డ్రైవర్‌గా పని చేస్తూ తల్లికి అండగా ఉంటున్నాడు. శుక్రవారం రాత్రి ర్యాపిడోకు వెళ్తున్నానంటూ బయటకు వెళ్లిన హర్షవర్ధన్‌ తెల్లవారుజామున 2 
గంటలకు తల్లికి ర్యాపిడోలో వచ్చిన 500 ఫోన్‌ పే చేశాడు. తల్లి మధురవాణికి ఫోన్‌ చేసి పక్కనే ఉన్నానమ్మా.. ఇంటికి వస్తున్నా అని చెప్పి స్నేహితులతో కలిసి కారులో భూదాన్‌పోచంపల్లికి వెళ్లి తిరిగిరాని లోకాలకు వెళ్లడంతో ఆ తల్లి శోకసంద్రంలో 
మునిగిపోయింది.  

సినిమాకు వెళ్లొస్తానని..  
పుష్ప సినిమాకు వెళ్తున్నా అంటూ వినయ్‌ తండ్రి వెంకటే‹Ùకు ఫోన్‌ చేసి చెప్పడంతో ఆయన కుమారుడికి శుక్రవారం రూ.350 ఫోన్‌ పే చేశారు. రాత్రి కుటుంబ సభ్యులు వినయ్‌కి ఫోన్‌ చేయగా.. స్విచ్‌ ఆఫ్‌ రావడంతో స్నేహితుల వద్ద ఉన్నాడనుకున్నారు. ఉదయం కాలేజీ నుంచి కుటుంబ సభ్యులకు ఫోన్‌ రావడంతో విషయం తెలుసుకుని కన్నీరుమున్నీరుగా విలపించారు.  

 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement