డేగల మురళీ, పద్మ (ఫైల్)
వైఎస్‌ఆర్ జిల్లా ,ఓబులవారిపల్లె: గాదెల కొత్తపల్లె గ్రామానికి చెందిన రైతు డేగల మురళీ(38) తన భార్య డేగల పద్మ (28)లు గురువారం తెల్లవారుజాము నుంచి కనిపించకుండా పోవడంతో బంధువులు శుక్రవారం స్థానిక పోలీస్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. అప్పులు చేసి వ్యవసాయం చేస్తూ ప్రతిసారి నష్టాలు రావడంతో డేగల మురళీ మనస్తాపానికి గురై తన భార్యతోకలిసి కనిపించకుండా పోయాడు. బుధవారం రాత్రి చాలా పొద్దుపోయాక పొలం వద్దకు వెళ్లి వస్తామని చెప్పి వెళ్లినవారు అక్కడే మోటర్ బైక్ సెల్‌ఫోన్‌లు వదిలి వెళ్లిపోయారు. వ్యవసాయంలో స్థోమతకు మించి అప్పులు చేసి పెట్టుబడులు పెట్టి నష్టాలు రావడంతో అప్పులు ఎలా తీర్చాలన్న బెంగతో ఇంటి నుండి వెళ్లి పోయినట్లు బంధువులు చెబుతున్నారు.
అలాగే పెళ్లి అయి పది సంవత్సరాలు అవుతున్నా పిల్లలు కలగలేదని వారు మనస్తాపం చెందినట్లు కూడా బంధువులు తెలిపారు. మురళీ చివరగా తన మామ శ్రీనివాసులుకు కొత్త నెంబర్ నుంచి ఫోన్ చేశాడు. తన భార్య పద్మ చనిపోయిందని నేను కూడా చనిపోతున్నానని, తాను ఎడ్కడ ఉండేది తెలియదని చెప్పాడు. పోలీసులు ఫోన్ లోకేషన్ ట్రెస్ చేయగా మండంలోని వైకోట చూపించింది. బంధువులు చుట్టు పక్కల ఇల్లు, భూములు, సమీపంలోని గాదెల అడవి ప్రాంతంలో ఎక్కడ వెతికినా ప్రయోజనం లేకుండా పోయింది. ఎస్‌ఐ డాక్టర్ నాయక్ కడప నుంచి డాక్ స్క్వాడ్‌ను తెప్పించి చుట్టు పక్కల ప్రదేశాలను వెతికించారు. కేసు నమోదు చేసి దంపతుల జాడ కోసం ముమ్మరంగా గాలింపు చర్యలు చేపడుతున్నామని ఎస్‌ఐ తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment