వీడిన హత్యకేసు మిస్టరీ | Four Accused Were Arrested In Adilabad Farmer Murder Case | Sakshi
Sakshi News home page

వీడిన హత్యకేసు మిస్టరీ

Published Thu, Nov 12 2020 8:06 AM | Last Updated on Thu, Nov 12 2020 8:06 AM

Four Accused  Were Arrested In  Adilabad  Farmer Murder Case  - Sakshi

వివరాలు వెల్లడిస్తున్న ఎస్పీ విష్ణు ఎస్‌.వారియర్‌ 

ఆదిలాబాద్‌టౌన్‌ : సిరికొండ మండలం పొన్న గ్రామానికి చెందిన రైతు బగ్నురే జ్ఞానేశ్వర్‌ హత్య కేసును పోలీసులు నాలుగు రోజుల్లోనే ఛేదించారు. బుధవారం జిల్లా కేంద్రంలోని హెడ్‌క్వార్టర్స్‌లో విలేకరుల సమావేశంలో వివరాలను ఎస్పీ విష్ణు ఎస్‌.వారియర్‌ వెల్లడించారు. ఈ నెల 6న ఇచ్చోడ మండల కేంద్రంలోని ప్రైవేట్‌ స్కూల్‌ ప్రాంగణంలో జ్ఞానేశ్వర్‌ హత్యకు గురైనట్లు తెలిపారు. పాత కక్షల నేపథ్యంలో అదే గ్రామానికి చెందిన జ్ఞానేశ్వర్‌ స్నేహితులు సిందే అచ్యుత్, సిందే గోవింద్‌రావు, సిందే రామకిషన్‌లు ఇచ్చోడకు చెందిన మీసేవ నిర్వహకుడు జాదవ్‌ శ్రీనివాస్‌తో హత్య చేసేందుకు రూ.10లక్షల ఒప్పందం చేసుకున్నారు. ముందుగా అడ్వాన్స్‌ కింద రూ.90వేలు శ్రీనివాస్‌కు ఫోన్‌ పే ద్వారా అందజేశారు. పథకం ప్రకారం ప్రధాన నిందితుడు జాదవ్‌ శ్రీనివాస్‌ ఫోన్‌ చేసి జ్ఞానేశ్వర్‌ను ఇచ్చోడకు రప్పించాడు. ఇరువురు కలిసి మందు తాగి  సాయంత్రం 5గంటల వరకు అక్కడే ఉండి అనంతరం ఆదిలాబాద్‌కు బయల్దేరారు.

మార్గంమధ్యలో హత్య చేయడానికి ఎలాంటి అవకాశం లేక తిరిగి రాత్రి ఇచ్చోడకు వచ్చారు. మళ్లీ ఎనిమిది బీర్‌ బాటిళ్లు తీసుకొని కొత్తగా నిర్మాణం చేస్తున్న గోల్డెన్‌ లీఫ్‌ స్కూల్‌ ప్రాంగణంలో కూర్చొని మందు తాగారు. ఈ క్రమంలో మగతనం లేకపోవడంతోనే సంతానం కాలేదని జ్ఞానేశ్వర్‌ను శ్రీనివాస్‌ రెచ్చగొట్టే విధంగా అనడంతో కోపంతో జ్ఞానేశ్వర్‌ శ్రీనివాస్‌ భార్యను కించపర్చే విధంగా మాట్లాడాడు. ఇద్దరి మధ్య వాగ్వివాదం చోటుచేసుకుంది. దీంతో జ్ఞానేశ్వర్‌ తలపై శ్రీనివాస్‌ కొట్టగా తీవ్ర రక్తస్రావంతో అక్కడికక్కడే మృతిచెందాడు. పథకం ప్రకారం శ్రీనివాస్‌ అద్దెకు తీసుకున్న కారులో మృతదేహాన్ని తీసుకెళ్లి మహారాష్ట్ర మాండవి తాలుకా పిప్పల్‌గావ్‌ ఘాట్‌ సెక్షన్‌లో 50ఫీట్ల లోతులో పడేశాడు. అనంతరం అక్కడి నుంచి నిజామాబాద్‌ చేరుకుని కారును సర్వీసింగ్‌ చేయించాడు. మరుసటి రోజు ఇచ్చోడకు చేరుకున్నాడు. హత్యకు పథకం వేసిన ప్రధాన నిందితుడు జాదవ్‌ శ్రీనివాస్‌ను అరెస్టు చేసి విచారణ చేయగా జ్ఞానేశ్వర్‌ మృతదేహాన్ని పడేసిన చోటును తెలిపాడు. మరో ముగ్గురిని అదుపులోకి తీసుకున్నామని తెలిపారు. హత్య మిస్టరీని నాలుగు రోజుల్లో ఛేదించిన దర్యాప్తు బృందంను అభినందించారు. ఇందులో ఉట్నూర్‌ డీఎస్పీ ఎన్‌.ఉదయ్‌రెడ్డి, ఏఆర్‌ డీఎస్పీ సయ్యద్‌ సుజాఉద్దీన్, రిజర్వు ఇన్స్‌పెక్టర్‌ జి.వేణు పాల్గొన్నారు. 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement