షాక్‌కు గురైన రిషిత
నందిపేట్ (ఆర్మూర్): తల్లిదండ్రులతో కలిసి షాపింగ్ మాల్‌కు వెళ్లిన చిన్నారి.. చాక్లెట్ కోసమని ఫ్రిడ్జ్‌ని తెరిచే క్రమంలో విద్యుత్ షాక్ తగిలి మృతి చెందిన ఘటన నిజామాబాద్ జిల్లా నందిపేట మండల కేంద్రంలో జరిగింది. నవీపేట మండల కేంద్రానికి చెందిన గూడూర్ రాజశేఖర్ భార్య, కూతురు రిషిత (4)తో కలిసి నందిపేటలో ఉండే అత్తగారింటికి ఆదివారం వచ్చాడు. సోమవారం ఉదయం వారు తిరిగి స్వగ్రామానికి వెళ్తూ.. నందిపేటలోని ఎన్ మార్ట్ షాపింగ్ మాల్‌లోకి సరుకులు కొనేందుకు వెళ్లారు.
రాజశేఖర్ వస్తువులు తీసుకుంటుండగా పక్కనే ఐస్‌క్రీంలు ఉన్న ఫ్రిడ్జ్‌ని తెరిచేందుకు రిషిత ప్రయత్నించింది. ఫ్రిడ్జ్‌కి కరెంట్ సరఫరా కావడంతో చిన్నారి విద్యుదాఘాతానికి గురైంది. ఫ్రిడ్జికి అలాగే అంటుకుని కొన్ని సెకన్లపాటు వేలాడింది. గమనించిన తండ్రి పాపను తీసుకుని స్థానిక ఆస్పత్రికి, జిల్లా కేంద్రంలోని ప్రభుత్వాస్పత్రికి తరలించాడు. అయితే అప్పటికే పాప మృతి చెందింది.
చిన్నారి మృతదేహంతో రాస్తారోకో..: షాపింగ్‌మాల్ యజమానుల నిర్లక్ష్యం వల్లే రిషిత మృతి చెందిందని బాధిత కుటుంబ సభ్యులు, బంధువులు మృతదేహంతో మాల్ ఎదురుగా రోడ్డుపై నాలుగు గంటలపాటు రాస్తారోకో చేశారు. వీరికి స్థానికులు మద్దతు తెలుపడంతో రాకపోకలు నిలిచిపోయాయి. ఘటనా స్థలానికి చేరుకున్న ఎస్‌ఐ రాహుల్, తహసీల్దార్ ఆనంద్‌కుమార్ బాధిత కుటుంబానికి న్యాయం చేస్తామని, మాల్ యజమానులపై కేసులు నమోదు చేస్తామని హామీ ఇవ్వడంతో ఆందోళనను విరమించారు.
Comments
Please login to add a commentAdd a comment