నల్ల డబ్బు మార్చే యత్నం! | Sakshi
Sakshi News home page

నల్ల డబ్బు మార్చే యత్నం!

Published Fri, Nov 25 2022 5:11 AM

Gang Escaped from Police with black money - Sakshi

చిత్తూరు అర్బన్‌:  ‘మావద్ద లెక్కలో చూపించని బ్లాక్‌మనీ (నల్లడబ్బు) రూ.40 కోట్ల వరకు ఉంది. దీన్ని కొంచెం కొంచెం మీ బ్యాంకు ఖాతాలో వేస్తాం. మీ బ్యాంకు ఖాతా నుంచి ఆ మొత్తాన్ని వైట్‌ మనీ (లెక్కల్లో చూపించేది)గా ఇస్తే చాలు..’ అంటూ రైస్‌ పుల్లింగ్‌ నేరం తరహాలో బురిడీకొట్టించే ప్రయత్నం చేసి.. తీరా పోలీసులకు తెలిసిపోవడంతో ఓ ముఠా పారిపోయింది.

ఈ ఘటనకు సంబంధించి వివరాల్లోకి వెళితే.. హైదరాబాద్‌కు చెందిన గిరీష్‌ అనే పారిశ్రామికవేత్తకు చెన్నైకి చెందిన సత్య ఇటీవల పరిచయమయ్యాడు. తనకు తెలిసిన ఓ బడా పారిశ్రామికవేత్త వద్ద రూ.వందల కోట్ల నల్ల డబ్బు ఉందని, దీన్ని బ్యాంకులో వేసుకుని లెక్కల్లో చూపించి తమకు బదిలీ చేస్తే కమీషన్‌ రూపంలోనే రూ.కోట్లు సంపాదించవచ్చని గిరీష్‌ను నమ్మించాడు.

ఢిల్లీకు చెందిన వినోద్‌గుప్త అనే వ్యక్తిని గిరీష్‌కు ఫోన్‌లో సత్య పరిచయం చేశాడు. గిరీష్, సత్య, వినోద్‌గుప్త ముగ్గురూ ఫోన్‌లో పలు దఫాలుగా మాట్లాడుతుకున్నారు. తొలుత రూ.50 లక్షలను సత్య వద్దకు చేరిస్తే.. రూ.5 కోట్లను గిరీష్‌ బ్యాంకు ఖాతాలో వేసేలా ఒప్పందం కుదుర్చుకున్నారు. దీన్ని అమలు చేయడానికి చిత్తూరు నగరాన్ని ఎంచుకున్నారు.

ఢిల్లీ నుంచి వినోద్‌గుప్తను చెన్నైకు పిలిపించి, అక్కడి నుంచి కారులో బయలుదేరిన సత్య.. గిరీష్‌ను చిత్తూరు నగరంలోని ఓ లాడ్జిలో ఉండాలని చెప్పాడు. బుధవారం రాత్రి  తనిఖీలకు వెళ్లిన పోలీసులు అనుమానాస్పదంగా ఉన్న గిరీష్‌ బృందాన్ని ప్రశ్నించారు.

తనను మోసం చేయడానికి సత్య, వినోద్‌గుప్త ప్రయత్నించారని గ్రహించిన గిరీష్‌.. పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కాగా అప్పటికే సమాచారం పోలీసులకు తెలిసిపోయిందని గ్రహించిన సత్య, వినోద్‌కుమార్‌ చిత్తూరు జిల్లాలోకి ప్రవేశించకుండానే పారిపోయారు. చిత్తూరు సీసీఎస్‌ ఎస్‌ఐ కేసు నమోదు చేశారు. 

Advertisement
 
Advertisement
 
Advertisement