గ్యాంగ్‌స్టర్ షేర్ హైదర్ (ఫైల్ ఫొటో)
సాక్షి, సిటీబ్యూరో: ఒడిశాలోని కటక్ జైలు నుంచి తప్పించుకుని హైదరాబాద్‌కు వచ్చిన మోస్ట్ వాంటెడ్ గ్యాంగ్‌స్టర్ షేర్ హైదర్ కోసం ముమ్మర గాలింపు కొనసాగుతోంది. సిటీలో ప్రవేశించి 48 గంటలు గడిచినా ఇప్పటి వరకు ఎలాంటి ఆధారాలు లభించలేదు. దీంతో టాస్క్‌ఫోర్స్ పోలీసుల సహకారంతో ఒడిశా నుంచి వచ్చిన ప్రత్యేక బృందం ముమ్మరంగా గాలిస్తోంది. మరోపక్క హైదర్ మహారాష్ట్రకు పారిపోయి ఉంటాడని పోలీసులు అనుమానిస్తున్నారు.
భువనేశ్వర్‌కు చెందిన మైన్స్ యాజమాని రష్మీరాజన్ మొఘాప్తారా కిడ్నాప్, హత్యకేసులో హైదర్‌కు భువనేశ్వర్ కోర్టు 2015లో జీవిత ఖైదు విధించింది. అంతకు ముందు 2011లో మరో గ్యాంగ్‌స్టర్ షేక్ సులేమాన్ సోదరుడు షేక్ చాను హత్య కేసులోనూ ఇతడికి జీవితఖైదు పడింది. 2017 వరకు భువనేశ్వర్‌లోని ఝార్పాడ జైలులో ఉన్న హైదర్ భద్రత కారణాల నేపథ్యంలో సబల్‌పూర్ జైలుకు మార్చారు.
ఆరోగ్యం బాగా లేదని..
నాలుగు రోజుల క్రితం కిడ్నీ సమస్యతో బాధపడుతున్నట్టు హైదర్ అక్కడి జైలు అధికారులకు చెప్పడంతో, కటక్‌లోని ఎస్‌సీబీ మెడికల్ కాలేజీ ఆసుప్రతికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ శనివారం సాయంత్రం 4.30 గంటలకు తప్పించుకున్నాడు. ఈ విషయాన్ని కటక్ పోలీసులు మూడు గంటల ఆలస్యంగా గుర్తించి అప్రమత్తమయ్యారు. అప్పటికే హైదర్ మరో ఇద్దరితో కలిసి కారులో వెళ్లినట్లు తేలింది.
ఒడిశా నుంచి ఈ గ్యాంగ్‌స్టర్ విశాఖపట్నం, విజయవాడ మీదుగా ప్రయాణించాడు. హైదరాబాద్ టాస్క్‌ఫోర్స్ పోలీసులు సేకరించిన ఆధారాలను బట్టి సదరు గ్యాంగ్‌స్టర్ హైదర్ ప్రయాణిస్తున్న స్విఫ్ట్ వాహనం (ఓడీ 02 ఏఎస్ 6770) ఆదివారం రాత్రి 8.42 గంటలకు పంతంగి టోల్ ప్లాజా దాటింది. ఆ తర్వాత నగరంలోని కొన్నిచోట్ల సంచరించినట్లు ఆనవాళ్లు ఉన్నా.. ఆపై ఆచూకీ లభించలేదు. హైదర్‌కు మహారాష్ట్రలోనూ కొన్ని షెల్టర్లు ఉన్నాయని ఒడిశా పోలీసులు చెబుతున్నారు.
గతంలో కటక్ పోలీసులు హైదర్‌ను నాగ్‌పూర్‌లో పట్టుకున్నారు. ఈ నేపథ్యంలోనే ఇప్పుడు కూడా మహారాష్ట్రకు ఉడాయించి ఉంటాడని అనుమానిస్తున్నారు. మరోపక్క నగరంతో పాటు శివార్లలోనూ గాలింపును కొనసాగిస్తున్నారు. హైదర్ లేదా అతడి వాహనం ఆచూకీ తెలిస్తే 94906 16640 నెంబర్‌కు సమాచారం ఇవ్వాలని సీటీ కొత్వాల్ అంజనీకుమార్ కోరారు. సమాచారం ఇచ్చిన వారి వివరాలు గోప్యంగా ఉంచుతామన్నారు. గ్యాంగ్‌స్టర్ కోసం ఒడిశా పోలీసులు సైతం సిటీకి చేరుకుని గాలిస్తున్నారు.
( చదవండి: జూబ్లీహిల్స్‌లో దారుణం: కలిసి మద్యం తాగారు, మళ్లీ వచ్చి చూస్తే )
Comments
Please login to add a commentAdd a comment