గుంటూరు జిల్లా ఎస్పీ తుషార్ డూడి
అసభ్య పదజాలంతో దూషిస్తుండటంతో తట్టుకోలేకపోయింది.. ఈ ట్రోల్స్‌ను ఎలా తొలగించాలో స్నేహితులతో చర్చించింది
అది సాధ్యం కాదని వారు చెప్పారు
రైల్వే ట్రాక్ పైకి వెళ్లి ఆత్మహత్యాయత్నం చేసింది
గీతాంజలి ఆత్మహత్యకు కారణమైన వారిలో ఇద్దరి అరెస్టు
ప్రతినిధి, గుంటూరు/నగరంపాలెం : ఇంటి పట్టా రిజిస్టరై చేతికి వచ్చిన సందర్భంలో ఆనందంగా మీడియాకి ఇచ్చిన ఇంటర్వ్యూ గీతాంజలి పాలిట శాపంగా మారిందని గుంటూరు జిల్లా ఎస్పీ తుషార్ డూడీ తెలిపారు. ఈ వీడియోను ట్రోల్ చేయడంతో తట్టుకోలేక మనస్తాపానికి గురై ఆత్మహత్యకు పాల్పడినట్లు తమ విచారణలో తేలిందన్నారు. ఆయన గురువారం విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ గీతాంజలి మృతికి బాధ్యులైన ఇద్దరిని అరెస్టు చేసినట్లు చెప్పారు. ఈ కేసు విచారణ కోసం ఐపీఎస్ అధికారి నచికేత్ షెల్కే నేతృత్వంలో జిల్లా ఏఎస్పీలు జీవీ రమణమూర్తి (పరిపాలన), శ్రీనివాసరావు (ఎల్/ఓ), తెనాలి సబ్ డివిజన్ డీఎస్పీ రమేష్‌తో ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేసి దర్యాప్తు వేగవంతం చేశామన్నారు.
ఈ క్రమంలో ఫేస్‌బుక్, ట్విటర్ ద్వారా వచ్చిన ట్రోలింగ్‌లను పరిశీలించామన్నారు. గీతాంజలి నాలుగో తేదీన లోకల్ ఛానెల్‌కు ఇంటర్వ్యూ ఇచ్చిందని, ఆమె మాట్లాడిన మాటలు అదే రోజు సోషల్ మీడియాలో వైరలయ్యాయని తెలిపారు. దీనికి అనేక వ్యూస్ వచ్చాయని, దీంతో ఆమెను కొందరు ట్రోల్ చేయడం మొదలుపెట్టినట్లు గుర్తించామన్నారు. వీటిని చూసి అమె మనస్తాపానికి గురైందని, రెండు రోజులు డీలాగా గడిపినట్లు తెలిసిందన్నారు. ఏడో తేదీ ఉదయం ఈ ట్రోలింగ్‌పై తన సన్నిహితులు, బంధువులతో చర్చించిందని, వాటిని ఎలా తొలగించాలని వారిని అడగ్గా, అది సాధ్యం కాదని వారు ఆమెకు చెప్పారని తెలిపారు.
ఈనెల ఏడో తేదిన ఆమెకు విజయవాడలోని ఓ ప్రైవేటు పాఠశాలలో టీచర్ పోస్ట్‌కు ఇంటర్వ్యూ ఉందని చెప్పి ఇంట్లో నుంచి వెళ్లిందని, ఆ తర్వాత కూడా బంధువులతో మాట్లాడిందని చెప్పారు. తనను, తన పిల్లలను, భర్తను కూడా అసభ్య పదజాలంతో తిడుతున్నారని వారి వద్ద ఆవేదన వ్యక్తం చేసిందన్నారు. ఆ తర్వాత కొద్దిసేపటికే గీతాంజలి తెనాలి రైల్వే ట్రాక్‌పై ఎదురుగా వస్తున్న రైలు కింద పడి ఆత్మహత్యాయత్నం చేసిందని చెప్పారు. ఆమెను గమనించి లోకో పైలెట్ అప్రమత్తమై, బ్రేక్ వేసి రైలును నిలిపారని, అప్పటికే రైలు తగలడంతో ఆమె తలకు బలమైన గాయాలయ్యాయని చెప్పారు.
ఆమెను మెరుగైన వైద్యం కోసం గుంటూరు జీజీహెచ్‌కు తరలించగా అక్కడ చికిత్స పొందుతూ మృతి చెందిందన్నారు. తెనాలి జీఆర్పీ పోలీసులు మృతురాలి కుటుంబ సభ్యులను విచారించగా, సోషల్ మీడియాలో అసభ్యకరమైన కామెంట్ల వల్ల ఆమె తీవ్ర మనస్తాపానికి గురై ఆత్మహత్య చేసుకున్నట్లు ఫిర్యాదు చేశారని అన్నారు. ఈ కేసు తీవ్రతను గుర్తించి క్రైమ్ నంబర్ 28/24/యు/ఎస్ 174 సీఆర్‌పీసీగా కేసు నమోదు చేసినట్లు తెలిపారు. ఆ తరువాత కేసును తెనాలి వన్‌టౌన్ పోలీస్ స్టేషన్‌కు బదిలీ కాగా, దానిని కేసు నంబర్ 65/24సెక్షన్ 509, 306 ఐపీసీ , సెక్షన్ 67 ఐటీ యాక్ట్‌గా తిరిగి నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నట్లు చెప్పారు.
వెయ్యికిపైగా కామెంట్లు ఉన్నట్లు విచారణ బృందాలు గుర్తించాయన్నారు. సోషల్ మీడియాలో అటువంటి భాష ఉపయోగించడం బాధాకరమన్నారు. ట్రోలింగ్‌కు పాల్పడిన విజయవాడకు చెందిన పసుమర్తి రాంబాబు, పశ్చిమ గోదావరి జిల్లా ఉండికి చెందిన వెంకట దుర్గారావుని అరెస్టు చేసి మేజిస్ట్రేట్ ముందు హాజరుపరిచామని అన్నారు. మిగతా వారిని గుర్తించే పనిలో ఉన్నామని చెప్పారు.
ట్రోల్స్‌పై ఫిర్యాదు చేయండి
పిల్లలు, మహిళలు, ఎవరైనా ఇటువంటి దారుణమైన ట్రోల్స్‌కి గురైతే సచివాలయాల్లోని మహిళా పోలీసులకు, స్థానిక పోలీస్ స్టేషన్‌లో, దిశ పీఎస్‌లో, దిశ యాప్, డయల్ 100, స్టేట్ మహిళా హెల్ప్‌లైన్ నంబర్, సైబర్ మిత్ర వాట్సాప్ నంబర్ 9121211100కు ఫిర్యాదు చేయాలని ఎస్పీ చెప్పారు. నేరుగా తనను కూడా సంప్రదించవచ్చన్నారు.
Comments
Please login to add a commentAdd a comment