భవానీశంకర్ ఇంటి ముందు బైఠాయించిన యువతి
సాక్షి,పొందూరు(శ్రీకాకుళం): పెళ్లి చేసుకుంటానని మోసం చేసి పరారైన యువకుడి ఇంటి ముందు ఓ యువతి నిరసనకు దిగింది. బాధితురాలు తెలిపిన వివరాల ప్రకారం.. జి.సిగడాం మండల కేంద్రానికి చెందిన దిబ్బ దీపికారాణి, పొందూరు మండలం మలకాం గ్రామానికి చెందిన కొవగాన భవానీశంకర్‌లు రాజాం ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో డిగ్రీ సెకెండియర్ చదువుతున్నారు. ఇద్దరూ ప్రేమించుకోవడంతో గత ఏడాది ఆగస్టు 13న రాజాం పోలిపల్లి అమ్మవారి గుడిలో రహస్యంగా వివాహం చేసుకున్నారు. కొద్ది నెలల తర్వాత యువకుడు దూరంగా ఉండటంతో దీపికారాణి ఈ ఏడాది మార్చిలో గుళికల మందు తాగింది. దీంతో పోలీసులకు ఫిర్యాదు అందింది.
ఇరువైపులా కుటుంబ సభ్యులు, పెద్దలు కూర్చొని ఏప్రిల్ 23న ప్రదానం చేసి మే 11న వివాహం జరిపించాలని నిశ్చయించారు. కట్నకానుకలుగా రూ. 80 వేలు నిర్ణయించి ముందుగా రూ.40 వేలు ఇచ్చారు. వివాహం దగ్గర పడటంతో ఈ నెల 9న యువకుని కుటుంబ సభ్యులు యువతి తల్లిదండ్రులకు ఫోన్ చేసి భవానీశంకర్‌కు ఆరోగ్యం బాగోలేదని కేజీహెచ్‌లో చేర్చామని తెలియజేశారు. అనుమానం వచ్చిన యువతి కుటుంబ సభ్యులు జి.సిగడాం పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేజీహెచ్‌లో పోలీసులు విచారించగా యువకుడు చేరలేదని తేలిందని, తర్వాత ఫోన్ స్విచ్ఛాఫ్ వస్తోందని తెలిపారు. వివాహం తప్పించాలనే పరారీలో ఉన్నారని గ్రహించిన యువతి తన తల్లిదండ్రులు లక్ష్మణరావు, కమలమ్మలతో కలిసి బుధవారం యువకుడి ఇంటి ముందు నిరసనకు దిగింది. తనకు న్యాయం జరిగే వరకు పోరాటం చేస్తానని చెప్పింది. విషయం తెలుసుకున్న సచివాలయ పోలీసు ఎం.జయలక్ష్మి బాధిత యువతి నుంచి వివరాలు సేకరించారు.
చదవండి: పెళ్లైన వారానికి పుట్టింటికొచ్చి అదృశ్యం.. ఇక్కడే అసలు ట్విస్ట్!
Comments
Please login to add a commentAdd a comment