సంజయ్‌కి ఉరి: కాళరాత్రి కథ! | Gorrekunta Case Death Penalty For Sanjay | Sakshi
Sakshi News home page

సంజయ్‌కి ఉరి: కాళరాత్రి కథ!

Published Wed, Oct 28 2020 2:53 PM | Last Updated on Wed, Oct 28 2020 8:47 PM

Gorrekunta Case Death Penalty For Sanjay - Sakshi

సాక్షి, వరంగల్‌ : తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన గొర్రెకుంట సామూహిక హత్యల కేసులో నిందితుడు సంజయ్‌కి ఉరి శిక్ష పడింది. బుధవారం వరంగల్  న్యాయస్థానం తుది తీర్పును వెలువరించింది. కేసు నమోదైన నాటినుంచి కేవలం ఐదు నెలల వారం రోజుల్లో నిందితుడికి శిక్ష పడింది. ఈ నేపథ్యంలో మరోసారి గొర్రెకుంట కేసు తెలుగు రాష్ట్రాల్లో చర్చనీయాంశంగా మారింది. 

వలస కార్మికులు కనబడుట లేదు
కరోనా కష్టకాలంలో వలస కార్మికుల ఆకలితో అలమటిస్తున్న వేళ. గోనె సంచులు కుట్టే కర్మాగారంలో కొంతమంది బిహార్‌, పశ్చిమ బెంగాల్ రాష్ట్రానికి చెందిన వలస కార్మికులు కనిపించకుండా పోయారు. దాని ఓనర్ సంతోష్ పిర్యాదుతో గీసుగొండ పోలీసులు రంగంలోకి దిగారు. ప్రత్యేక బృందాలను రంగంలోకి దింపి చుట్టుపక్కల ప్రాంతాలలో వెతకటం ప్రారంభించారు. వేరే రాష్ట్ర వలస కార్మికులు కదా! కరోనా వల్ల భయపడి వాళ్ల రాష్ట్రాలకు ఎవరికీ చెప్పకుండా వెళ్లిపోయి ఉంటారని అనుకుంటున్న సందర్భంలో, అదే రోజు మధ్యాహ్నం గోనె సంచుల గోడౌన్‌కు ప్రక్కన గల పాడుబడ్డ బావిలో నాలుగు శవాలు నీటిపై తేలి యాడుతున్నట్టుగా గుర్తించారు.

అనుమానాస్పద మరణాల కింద కేసు నమోదు చేశారు. వారివి ఆత్మహత్యలుగా భావించారు. అయితే మిగతా వారు ఎక్కడ ఉన్నారు? వీరి ఆత్మహత్యలు చూసి భయపడి పారిపోయారా? లేక వీరినే హత్య చేసి పారిపోయారా? అనే కోణంలో దర్యాప్తు ప్రారంభించారు. కొద్దిరోజుల తర్వాత అదే పాడుబడ్డ బావి పాతాళం నుండి మిగతా 5 మృతదేహాలు తేలాయి. దీంతో భారతదేశం అంతా ఉలిక్కిపడింది. వరంగల్ నగర ప్రజలు ఒక్కసారిగా భయాందోళనలకు గురయ్యారు. ( బిగ్‌ బ్రేకింగ్‌ : సంజయ్‌కు ఉరిశిక్ష)

ఆత్మహత్యలా?.. హత్యలా?.. 
ఆ తొమ్మిది మందివి హత్యలా? లేక ఆత్మహత్యలా?.. హత్యలే  అయితే ఎవరు చేశారు, ఎందుకు చేశారు.. ఒకవేళ ఆత్మహత్యలు అయితే ఎందుకు ఆత్మహత్యలు చేసుకోవాల్సి వచ్చింది. దీని వెనుక ఉన్న బలమైన కారణాలు ఏమై ఉంటాయో? అని ప్రతి సగటు మనిషి మదిలో అనేక ప్రశ్నలు మెదిలాయి.  ఈ కేసు పోలీసులకు ఒక గొప్ప సవాలుగా మారింది. వెంటనే ప్రజల భయాందోళనలను  తెరదించటానికి స్వయంగా వరంగల్ పోలీస్ కమిషనర్ రవీందర్ ఐపీఎస్‌, ఈస్ట్ జోన్ డీసీపీ కె. వెంకటలక్ష్మి రంగంలోకి దిగారు. నేర స్థలం, వారు నివసిస్తున్న ఇల్లు, పని చేస్తున్న గోడౌన్‌ల నుండి పలు పత్రాలు, ఐడెంటిటీ కార్డులు, వస్తువులు ద్వారా వీరి ఫోన్ నెంబర్లు సేకరించారు.

చనిపోయే ముందు రాత్రి వీరు తినగా మిగిలిన ఆహార పదార్థాలను రసాయనిక పరీక్షల నిమిత్తం పంపారు. పోస్టుమార్టం చేసినప్పుడు కడుపులో నుండి తీసిన అవయవాలనూ కూడా రసాయనిక పరీక్షల నిమిత్తం హైదరాబాద్‌లోని ల్యాబ్‌కు పంపారు. చనిపోయే రాత్రి ఏం జరిగింది.. ఆరోజు మృతులు గోడౌన్‌లో పని చేశారా లేదా, ఆరోజు కార్మికులు ఎవరెవరు వచ్చారు, ఎక్కడెక్కడ తిరిగారు ఎవరెవరితో ఎవరు తిరిగారు, మృతులకు మిత్రులు ఎవరు, శత్రువులు ఎవరు, ఈ విధంగా మరణించడానికి గల కారణాలు ఏమిటి, అని అన్వేషించడం మొదలుపెట్టారు.

అదుపులోకి సంజయ్‌
నేర స్థలానికి చుట్టుప్రక్కల బిగించిన సీసీ కెమెరాల ఆధారంగా,  మృతుల సెల్ ఫోన్  కాల్ డేటా ఆధారంగా, అందివచ్చిన ప్రతి అవకాశాన్ని పోలీసులు సద్వినియోగం చేసుకుంటూ ముందుకు వెళ్లారు. నేర స్థలాన్ని బట్టి, మృతుల యొక్క స్థితులను బట్టి, సేకరించిన ఆధారాలను బట్టి, 9 హత్యలు చేసింది సంజయ్ కుమార్ అని నిర్ధారణకు వచ్చారు. అతడు కిరాయికి ఉంటున్న ఇంటి వద్ద అరెస్టు చేశారు. పోలీసు వారు తనదైన శైలిలో విచారించగా విస్తుపోయే వాస్తవాలు బయట పడ్డాయి. 

వివాహితతో సహజీవనం.. మొదటి హత్య 
ఆరు సంవత్సరాల క్రితం జీవనోపాధి కోసం వరంగల్ చేరుకున్న నిందితుడు సంజయ్ కుమార్ మీల్స్ కాలనీ పోలీస్ స్టేషన్ ప్రాంతంలోని శాంతినగర్‌లోని గోనేసంచుల తయారీ కేంద్రంలో పనిచేసేవాడు. ఇదే కేంద్రంలో పని చేస్తున్న మక్సూద్ ఆలం కుటుంబ సభ్యులతో నిందితుడు సంజయ్‌కి పరిచయం అయింది. ఇదే సమయంలో మక్సూద్ భార్య నిషా అక్క కూతురు పశ్చిమ బెంగాల రాష్ట్రానికి చెందిన రఫికాతో కూడా నిందితుడికి పరిచమైంది. క్రమ క్రమంగా రఫికాతో అతడి పరిచయం మరింత పెరగడంతో డబ్బు ఇచ్చి ఆమె ఇంటిలోనే భోజనం చేసేవాడు. ఇదే సమయంలో భర్తతో విడిపోయి ముగ్గురు పిల్లలతో ఒంటరిగా ఉంటున్న రఫీకాకు నిందితుడు సంజయ్ మరింత దగ్గరయ్యాడు.  

ఆమెను పెళ్లి చేసుకుంటానని నమ్మించి గీసుగొండ మండలం జాన్ పాక్ ప్రాంతంలో నూతనంగా రెండుగదుల ఇంటిని కిరాయి తీసుకోని 4 సంవత్సరాల పాటు సహజీవనం చేశాడు. ఇదే క్రమంలో యుక్త వయస్సుకు వచ్చిన రఫికా కుమార్తెతో నిందితుడు చనువుగా ఉండడానికి ప్రయత్నించాడు. ఇది గమనించిన రఫీకా సంజయ్‌తో పలుమార్లు గొడవపడింది. అయిన కూడా సంజయ్ తన పద్ధతి మార్చుకోకుండా రఫీకా కుమార్తెతో మరింత సన్నిహితంగా వ్యవహరించాడు. తనను పెళ్లి చేసుకుంటానని చెప్పి తన కుమార్తెతో సన్నిహితంగా వ్యవహరిస్తున్నావంటూ పోలీసులకు ఫిర్యాదు చేస్తానని రఫీకా బెదిరించింది. నిందితుడు రఫీకాను అడ్డు తొలిగించుకోవాలని నిర్ణయించుకున్నాడు. 

తమ పెళ్లి విషయాన్ని బంధువులతో ముచ్చటించేందుకు పశ్చిమ బెంగాల్‌కు వెళ్తామని రఫీకాను నమ్మించాడు. విశాఖపట్నం వైపు వెళ్లే గరీభ్ రథ్ ట్రైన్ ద్వారా వరంగల్ నుండి రాత్రి 10 గంటలకు బయలుదేరి వెళ్ళారు. నిందితుడు ట్రైన్‌లో ప్రయాణించే మార్గంలో మజ్జిగ ప్యాకేట్లను కొనుగోలు చేసి తనతో తెచ్చుకొన్న నిద్రమాత్రలను అందులో కలిపి రఫికాకు ఇచ్చాడు. నిద్ర మాత్రలు కలిపిన మజ్జిగ తాగిన రఫికాతో సంజయ్.. ట్రైన్స్ ఫుట్ బోర్డ్ వద్ద కూర్చోని ముచ్చుటించాడు. సుమారు తెలవారుజామున 3 గంటల ప్రాంతంలో నిడదవోలు వద్ద ప్రయాణికులు అందరు నిదిస్తున్న సయమంలో.. ప్రణాళిక ప్రకారం మత్తులో వున్న రఫీకాను ఆమె చున్నీతోనే గొంతు బిగించి చంపి.. నడుస్తున్న ట్రైన్ నుండి తోసేశాడు. దీనికి సంబంధించి తాడేపల్లిగూడెం రైల్వే పోలీసులు అనుమానాస్పద కేసు నమోదు చేశాడు. సంజయ్‌ రఫికా చనిపోయిందని నిర్ధారించుకున్న అనంతరం రాజమండ్రి రైల్వే స్టేషన్లో దిగి తిరిగి మరో రైలులో వరంగల్‌కు చేరుకున్నాడు. ఆ తర్వాత రఫీకా పశ్చిమ బెంగాల్‌లోని తమ బంధువులు ఇంటికి వెళ్లినట్లుగా ఆమె పిల్లలను నమ్మించాడు. 

బెడిసికొట్టిన ఫ్లాన్‌: కనికరం లేకుండా మరో 9 హత్యలు
కొద్ది రోజుల అనంతరం తన అక్క కుతూరు రఫీకా తమ బంధువుల ఇండ్లలో లేదని, రఫికా ప్రస్తుతం ఎక్కడ ఉందని మక్సూద్ ఆలం భార్య నిషా ఆలం సంజయ్‌ని గట్టిగా అడిగింది. పోలీసులకు సమాచారం ఇస్తానని బెదిరించ సాగింది. దీనితో కంగుతున్న నిందితుడు ఏదో విధంగా పోలీసులకు చిక్కుతానని భయపడి మాక్సూద్ ఆలం, భార్య నిషా ఆలంలను హత్య చేయాలని నిర్ణయించుకున్నాడు. ఇందుకోసం రఫీకాను చంపినట్లుగానే నిద్రమాత్రలతో కలిపి చంపాలని ప్రణాళికను రూపొందించుకున్నాడు. వారు పనిచేస్తూన్న గోనేసంచులు తయారీ గోదాంకు రోజు క్రమం తప్పకుండా వస్తుపోతూ గోదాం చుట్టు ప్రక్కల పరిసరాలను కూడా పరిశీలించేవాడు. చివరకు మక్సూద్ ఆలం, భార్య నిషా ఆలంను చంపి గోదాం ప్రక్కనే వున్న పాడుపడ్డ బావి పడవేయాలని నిర్ణయించుకున్నాడు. ఇందులో భాగంగా మే నెల 20వ తారీఖు మక్సూద్‌ మొదటి కుమారుడైన షాబాజ్ ఆలం పుట్టిన రోజు అని తెలియడంతో ఆదే రోజు చంపాలని నిర్ణయించుకున్నాడు. ఇందుకోసం మే నెల 18వ తేది వరంగల్ చౌరస్తాలోని ఓ మెడికల్ షాపులో నిద్రమాత్రలు కొనుగోలు చేశాడు.

 అనుకున్న పథకం ప్రకారం మే నెల 20వ తేదీన రాత్రి 7.30గంటల ప్రాంతంలో గోదాంకు చేరుకోని మృతులతో చాలా సేపు ముచ్చటించాడు. తనకు అనుకూలంగా ఉన్న సమయంలో వారికి తెలియకుండా తినే భోజనంతో పాటు, పైన గదిలో అద్దె కుంటున్న మరో ఇద్దరు శ్యాం, శ్రీరాం తయారు చేసుకున్న భోజనంలో కూడా నిద్రిమాత్రలు కలిపాడు. మరణించిన మక్సూద్, భార్య నిషా ఆలం, కూతురు బుధ్రా కాటూన్, కుమారులు షాబాజ్ ఆలం, సుహేల్ ఆలం, మనుమడు, ఇదే గోదాంలో నివాసం ఉంటున్న శ్యాం, శ్రీరాం, మహమ్మద్ షకీల్‌లు నిద్రమాత్రలు కలిపిన భోజనం చేయడంతో మత్తులోకి జారుకున్నాడు. సంజయ్‌ సాక్ష్యం లేకుండా ఉండాలనే ఆలోచనతో మత్తులో ఉన్న అందరిని చంపాలని నిర్ణయించుకోని ఆర్థరాత్రి 12.30 నుండి ఉదయం 5గంటల మధ్య సమయంలో మత్తులో ఉన్న తొమ్మిది మందిని గోదాం ప్రక్కనే ఉన్న పాడుపడ్డ బావి వద్దకు తరలించి బావిలో పడేశాడు. అందరు చనిపోయారని నిర్ధారించుకున్న అనంతరం మృతుల గదుల నుండి వాల్‌మార్ట్‌లో కొనుగోలు చేసిన కిరాణ సామానుతో పాటు వారి సెల్ ఫోన్ల తీసుకుని తన ఇంటికి తిరిగి చేరుకున్నాడు. 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement