సాక్షి, హైదరాబాద్: ఆ ఇద్దరూ రియల్ ఎస్టేట్ వ్యాపారులు.. ఇద్దరికీ నేర చరిత్ర ఉంది.. కొన్ని భూముల లావాదేవీల విషయంగా వారి మధ్య విభేదాలు తలెత్తాయి. దీంతో ఒకరు మాట్లాడుకుందాం రమ్మని మరో వ్యాపారిని పిలిచాడు. కలిసి టిఫిన్ చేద్దామన్నాడు. రోడ్డు పక్క నిలబడి ఇడ్లీ తింటుంటే.. అనుచరుడితో కాల్పించి చంపించాడు. వెంటనే అక్కడి నుంచి పరారయ్యాడు. సోమవారం తెల్లవారుజామున హైదరాబాద్ లోని మాదాపూర్ నీరూస్ చౌరస్తా వద్ద ఈ ఘటన జరిగింది. ఇందులో ఒకరు అక్కడిక్కడే చనిపోగా, మరొకరికి గాయాలయ్యాయి. విషయం తెలుసుకున్న పోలీసులు.. వేగంగా విచారణ చేపట్టి.. సోమవారం రాత్రి ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు.
జైల్లో పరిచయం.. భూముల దందాలు..
హైదరాబాద్‌లోని కాలాపత్తర్ పోలీసుస్టేషన్‌లో రౌడీ షీటర్‌గా నమోదై ఉన్న ఇస్మాయిల్ (39)పై వివిధ నేరాలకు సంబంధించి పదికిపైగా కేసులు ఉన్నాయి. దుండిగల్‌కు చెందిన ముజాహిద్ సైతం హత్య కేసులో జైలుకు వెళ్లాడు. జైలులోనే ఒకరికొకరు పరిచయం అయ్యారు. బయటికి వచ్చినప్పటి నుంచి దాదాపు ఏడేళ్లుగా జహీరాబాద్ సమీపంలోని రేంజల్ మండలం కేంద్రంగా కలిసి రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నారు. ఈ క్రమంలో భూదందాలకు సంబంధించి ఇద్దరి మధ్య వివాదాలు తలెత్తాయి.
పరిష్కరించుకుందాం రమ్మని..
వివాదాలపై మాట్లాడుకుని పరిష్కరించుకుందామని ఆదివారం సాయంత్రం ముజాహిద్ నుంచి ఇస్మాయిల్‌కు ఫోన్ వచ్చింది. ఇస్మాయిల్ రాత్రి 11.30 గంటల సమయంలో బహదూర్‌పురాకు చెందిన అక్రం, గౌస్, జహంగీర్‌లతో కలిసి తన కారులో మాసబ్ ట్యాంక్ ప్రాంతానికి వచ్చాడు. మరోవైపు ముజాహిద్ తన వద్ద పనిచేసే జిలానీ, ఫెరోజ్ లతో కలిసి అక్కడికి వచ్చాడు. మాసబ్ ట్యాంక్ వద్ద కాసేపు మాట్లాడుకున్నవారు.. అక్కడి నుంచి పెన్షన్ ఆఫీస్ జంక్షన్, పంజాగుట్ట ప్రాంతాల్లో కాసేపు ఆగి రాత్రి 2 గంటల ప్రాంతంలో మాదాపూర్ వద్దకు చేరుకున్నారు.
ఇడ్లీ తింటుండగా కాల్చేసి..
మాదాపూర్‌లో ఇస్మాయిల్, ముజాహిద్ రెండు గంటల పాటు మాట్లాడుకున్నారు. సోమవారం తెల్లవారుజామున 4 గంటల సమయంలో అక్కడ రోడ్డు పక్కన బండి వద్ద ఇడ్లీ తింటున్నారు. అదే సమయంలో ముజాహిద్ అనుచరుడు జిలానీ వెనుక నుంచి వచ్చి ఇస్మాయిల్ తలపై పిస్టల్‌తో కాల్చాడు. అతి సమీపం నుంచి కాల్చడంతో ఇస్మాయిల్ తల ఛిద్రమై మెదడు బయటికి వచ్చింది. ఇది చూసిన జహంగీర్ ప్రతిఘటించడంతో అతడి తలపై పిస్టల్‌తో గట్టిగా కొట్టారు. వెంటనే ముజాహిద్, జిలానీ, ఫెరోజ్ తమ ఎర్తిగా కారులో పరారయ్యారు. మరోవైపు అక్రం, గౌస్ తాము వచ్చిన స్విఫ్ట్ కారులో ఇస్మాయిల్, జహంగీర్‌లను ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. ఇస్మాయిల్ అప్పటికే మృతి చెందినట్టు వైద్యులు ధ్రువీకరించారు. జహంగీర్‌కు గాయాలు కావడంతో చికిత్స చేస్తున్నారు. ఇస్మాయిల్ హత్య విషయం తెలిసిన వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు వేగంగా దర్యాప్తు చేపట్టారు. ఆయా ప్రాంతాల్లో సీసీ కెమెరాల ఫుటేజీలను సేకరించి పరిశీలన చేపట్టారు.
ప్లాన్ చేశారా.. ఆవేశంలో కాల్చారా?
ఈ ఘటనలో ఇస్మాయిల్‌ను కాల్చిన జిలానీతోపాటు అతడికి సహకరించిన ఆరోపణలపై ఫెరోజ్‌ను మాదాపూర్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. సూత్రధారి ముజాహిద్ కోసం ప్రత్యేక బృందాలు గాలిస్తున్నాయి. ఈ హత్య పథకం ప్రకారం జరిగిందా? అప్పటికప్పుడు ఆవేశంలో జరిగిందా అన్న కోణంలో పోలీసులు ఆరా తీస్తున్నారు. ఆదివారం రాత్రి 11.30 నుంచి సోమవారం తెల్లవారుజామున 4 గంటల వరకు అంతా కలిసే ఉన్నారని.. ముందే ప్లాన్ చేసి ఉంటే అంతసేపు కాల్పులు జరపకుండా ఉండేవారు కాదన్న భావన వస్తోందని పోలీసులు అంటున్నారు. పంజాగుట్ట, మాదాపూర్ ప్రాంతాల్లో ఆగినప్పుడు ముజాహిద్ ఆదేశించడంతో.. ఇస్మాయిల్‌పై జిలానీ కాల్పులు జరిపి ఉంటాడని అనుమానిస్తున్నారు.
కాగా.. ఇస్మాయిల్‌ను నాటు పిస్టల్‌తో కాల్చినట్టు భావిస్తున్నామని మాదాపూర్ ఇన్‌చార్జి డీసీపీ గోనె సందీప్‌రావు తెలిపారు. అయితే క్షతగాత్రుడు జహంగీర్ మాత్రం రెండు తుపాకులతో ఇద్దరు వ్యక్తులు ఐదారు రౌండ్లు కాల్పులు జరిపారని చెబుతున్నట్టు తెలిసింది. దీంతో అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు తెలిపారు. జిలానీ ఇంతకుముందు కూడా జావేద్ అనే రియల్ ఎస్టేట్ వ్యాపారిపై హత్యాయత్నం చేశాడని.. బెయిల్‌పై బయటికి వచ్చాడని పోలీసులు వెల్లడించారు.
చదవండి: ఒంటరిగా బతకలేను.. అందుకే వెళ్లిపోతున్నా.. నన్ను క్షమించండి
Comments
Please login to add a commentAdd a comment