సాక్షి, మిర్యాలగూడ అర్బన్: వైద్యురాలి నిర్లక్ష్యం కారణంగానే అబార్షన్ అయ్యిందని ఆరోపిస్తూ గర్భిణి బంధువులు ఆందోళన చేపట్టారు. ఈ ఘటన మిర్యాలగూడ పట్టణంలో శనివారం చోటు చేసుకుంది. వివరాలు.. వేములపల్లి మండల కేంద్రానికి చెందిన బచ్చలకూరి శ్రీకాంత్ తన భార్య విజయకు వివాహం అయిన 10 ఏళ్లకు కాన్పు అందడంతో అప్పటినుంచి పట్టణంలోని చర్చిరోడ్డులోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో వైద్య పరీక్షలు చేయించుకుంటున్నారు.
కాగా, శనివారం ఉదయం విజయకు కడుపులో నొప్పిగా ఉండటంతో ఆస్పత్రికి తీసుకురాగా పరీక్షించిన వైద్యురాలు ఇంజక్షన్ ఇచ్చింది. అనంతరం విజయ ఇంటికి వెళ్లింది. కొద్ది సేపటి తర్వాత తిరిగి నొప్పి ఎక్కువ కావడంతో వెంటనే ఆస్పత్రికి తీసుకొచ్చారు. డాక్టర్ పరీక్షించేందుకు చాంబర్‌లోకి తీసుకెళ్లగానే ఒక్కసారిగా నొప్పి ఎక్కువై ప్రసవం అయ్యింది. మగశిశువు జన్మించి చనిపోయాడు. దీంతో తీవ్ర రక్త స్రావం అయిన విజయకు చికిత్స అందించారు.
కాగా వైద్యురాలి నిర్లక్ష్యం కారణంగానే తమకు అన్యాయం జరిగిందని ఆరోపిస్తూ రోగి వైద్యురాలితో వాగ్వాదానికి దిగారు. విషయం తెలుసుకున్న వన్ టౌన్ పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా భద్రత ఏర్పాటు చేశారు. అనంతరం ఇరువర్గాలు పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసుకున్నారు.
Comments
Please login to add a commentAdd a comment