గన్నవరం మండలంలో 58,032 సీసాల గోవా మద్యం స్వాదీనం
గన్నవరం: కృష్ణాజిల్లా గన్నవరం మండలంలోని మెట్లపల్లి శివారుల్లో టీడీపీ నేతలు ఎన్నికల్లో పంపిణీ చేసేందుకు సిద్ధం చేసిన గోవా మద్యం నిల్వలను ఆదివారం పోలీస్, ఎక్సైజ్, ఎస్‌ఈబీ అధికారులు పట్టుకున్నారు. అక్రమంగా మద్యం నిల్వచేసిన టీడీపీ నేతను అదుపులో తీసుకుని విచారిస్తున్నారు.
పోలీసుల సమాచారం ప్రకారం.. మెట్లపల్లి శివారులో గన్నవరం మాజీ సర్పంచి, టీడీపీ నేత గూడపాటి తులసీమోహన్ సోదరుడైన దుర్గాప్రసాద్‌కు చెందిన శ్రీనివాస గార్డెన్స్‌లో భారీగా మద్యం నిల్వచేసినట్లు ఉన్నతాధికారులకు సమాచారం అందింది. వీరి ఆదేశాల మేరకు హనుమాన్‌జంక్షన్ సీఐ నరసింహమూర్తి, ఎక్సైజ్ స్క్వాడ్ ఎస్‌ఐ రామాంజనేయ, సెబ్ అధికారులు సంయుక్తంగా గార్డెన్స్‌లోని గెస్ట్‌హౌస్‌పై దాడిచేశారు.
అక్కడ గోవా రాష్ట్రానికి చెందిన స్టీకర్స్‌తో మొత్తం 1,210 కేసుల్లో 58,032 క్వార్టర్ సీసాల మద్యం నిల్వల్ని గుర్తించి సీజ్ చేశారు. వీటివిలువ సుమారు రూ.75 లక్షలు ఉండవచ్చని అధికారులు అంచనా వేశారు. ఆత్కూరు ఎస్‌ఐ పైడిబాబు కేసు నమోదు చేశారు. అక్రమంగా మద్యం నిల్వచేసిన శ్రీనివాస గార్డెన్స్ యాజమాని, టీడీపీ నేత గూడపాటి దుర్గాప్రసాద్‌ను, వాచ్‌మెన్‌ను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లు పోలీస్, ఎక్సైజ్ అధికారులు తెలిపారు.
టీడీపీ అభ్యర్థి యార్లగడ్డ, నేతల్లో ఆందోళన
ఎన్నికల్లో పంపిణీ చేసేందుకు టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్ధి యార్లగడ్డ వెంకట్రావు ఈ మద్యం కొనుగోలు చేసి ఇక్కడ నిల్వ చేసినట్లుగా అనుమానిస్తున్నారు. శనివారం అర్ధరాత్రి గూడ్స్ వాహనంలో ఇక్కడికి తీసుకొచ్చి న ఈ మద్యాన్ని ఇక్కడినుంచి గ్రామాలకు పంపేందుకు ప్రణాళిక రూపొందించినట్లు తెలిసింది.
మద్యం పట్టుబడ్డడంతో యార్లగడ్డతో పాటు ఆ పార్టీ నేతల్లో ఆందోళన మొదలైంది. అధికారులు దాడిచేసిన విషయం తెలుసుకున్న యార్లగడ్డ వర్గానికి చెందిన టీడీపీ నేతలు పొట్లూరి బసవరావు, జాస్తి శ్రీధర్‌బాబు, దొంతు చిన్నా, కేసరపల్లి ఎంపీటీసీ సభ్యుడు శొంఠి కిషోర్ గంటల వ్యవధిలోనే ఆ గ్రామానికి చేరుకున్నారు.
Comments
Please login to add a commentAdd a comment