
లక్నో: ఉత్తరప్రదేశ్ ప్రైవేట్ ఆస్పత్రిలో దారుణం చోటు చేసుకుంది. నిలువ నీడలేని ఓ వృద్ధురాలు ఆస్పత్రిలో ప్రాంగణంలో తలదాచుకుంది. ఇది గమనించిన సెక్యూరిటీ గార్డ్ ఆ వృద్ధురాలిని విచక్షణారహితంగా కొట్టాడు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో తీవ్ర ఆగ్రహం వ్యక్తం అయ్యింది. దాంతో ఆస్పత్రి యాజమాన్యం.. సదరు సెక్యూరిటీ గార్డును విధుల నుంచి తొలగించడమే కాక అతడి మీద కేసు నమోదు చేసింది. వివరాలు.. 80 ఏళ్ల వృద్ధురాలు ప్రయాగ్‌రాజ్‌లోని స్వరూప్ రాణి నెహ్రూ ఆస్పత్రి ట్రామా సెంటర్ వెలుపల పడుకుని ఉంది. ఇది గమనించిన సెక్యూరిటీ గార్డు సంజయ్ మిశ్రా ఆమెపై దెబ్బల వర్షం కురిపించాడు. సదరు గార్డు ఏ మాత్రం కనికరం లేకుండా వృద్ధురాలిని కొట్టడమే కాక కాలితో తన్నాడు. పాపం ఆ ముసలవ్వ నొప్పికి తాళలేక సాయం కోసం కేకలు వేసింది. ఇద్దరు వ్యక్తులు అక్కడ నిలబడి చోద్యం చూస్తున్నారు తప్ప గార్డును అడ్డుకునే ప్రయత్నం చేయలేదు. (కానిస్టేబుల్ సమయస్ఫూర్తిపై ప్రశంసలు)
ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతోంది. దాంతో ఆస్పత్రి యాజమాన్యం వృద్ధురాలిని అదే ఆస్పత్రిలో చేర్చుకుని వైద్యం అందిస్తున్నారు. అంతేకాక సదరు గార్డ్ సంజయ్ మిశ్రాను విధుల నుంచి తొలగించడమే కాక అతడి మీద కేసు నమోదు చేశారు. సదరు ప్రైవేట్ సెక్యూరిటీ ఏజెన్సీని ఆస్పత్రి యాజమాన్యం బ్లాక్‌లిస్ట్‌లో చేర్చింది. ఈ ఘటనపై లాలూ ప్రసాద్ యాదవ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. సమాజంలో ఇలాంటి అమానవీయ సంఘటనలు జరగడం శోచనీయం అన్నారు. అతడికి కఠిన శిక్ష విధించాలని డిమాండ్ చేశారు.
Comments
Please login to add a commentAdd a comment