భార్యతో కలిసి అత్తమామల ఉసురు తీశాడు.. | Husband And Wife Assasinate In Jaggayyapeta | Sakshi
Sakshi News home page

భార్యతో కలిసి అత్తమామల ఉసురు తీశాడు..

Dec 17 2020 4:15 AM | Updated on Dec 17 2020 4:15 AM

Husband And Wife Assasinate In Jaggayyapeta - Sakshi

నిందితుడు బాబురావు

బండిపాలెం(జగ్గయ్యపేట): కట్నం ఇవ్వలేదని అత్తమామల గొంతుకోశాడో వ్యక్తి. భార్యతో కలిసి నిలువునా వారి ప్రాణాలు బలిగొన్నాడు. కృష్ణా జిల్లా జగ్గయ్యపేట మండలం బండిపాలెంలో జరిగిన ఈ ఘటన సంచలనం సృష్టించింది. కోట ముత్తయ్య (63) సుగుణమ్మ (58) కూలీలు. వీరికి కుమారుడు, కుమార్తె ఉన్నారు. కుమారుడు సుందర్‌రావు ప్రైవేట్‌ ఉద్యోగి. కుమార్తె మనీష, ఇంటి పక్కనే ఉంటున్న బాబురావులు కొంత కాలంగా ప్రేమించుకుంటున్నారు. కట్నకానుకల విషయంలో తేడా రావడంతో పెళ్లి ప్రస్తావన ఆగిపోయింది. అయితే నాలుగు నెలల కిందట బాబురావు, మనీషలు వివాహం చేసుకున్నారు. తమకు ఇష్టం లేకుండా పెళ్లి చేసుకున్నారంటూ బాబురావు కుటుంబ సభ్యులు వారిని ఇంట్లోకి రానివ్వలేదు. దీంతో వారు అద్దె ఇంట్లో ఉంటున్నారు. కొద్ది రోజులుగా కట్నం విషయంలో బాబురావుకు, అత్తమామలకు మధ్య గొడవలు జరుగుతున్నాయి. భార్య కూడా భర్తకు మద్దతుగా నిలిచేది.

ఈ నేపథ్యంలో ముత్తయ్య, సుగుణమ్మలను అంతమొందించాలని బాబురావు, మనీషలు పథకం రచించారు. మంగళవారం రాత్రి మనీష తన తల్లి ఇంటికి పడుకునేందుకు వచ్చింది. రాత్రి 12 గంటల సమయంలో బాబురావు కూడా కత్తితో వచ్చాడు. అప్పటికే గాఢ నిద్రలో ఉన్న అత్తమామల గొంతును భార్య సాయంతో కోశాడు. దీంతో వారు అక్కడికక్కడే ప్రాణాలు విడిచారు. తర్వాత వారిద్దరూ అక్కడి నుంచి పరారయ్యారు. తెల్లవారాక రక్తపు మడుగులో ఉన్న దంపతులను చూసిన చుట్టుపక్కల వారు పోలీసులకు సమాచారం ఇచ్చారు. నందిగామ డీఎస్పీ నాగేశ్వరరెడ్డి, సీఐ చంద్రశేఖర్‌ తదితరులు మృతదేహాలను పరిశీలించారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం జగ్గయ్యపేట ప్రభుత్వాస్పత్రికి తరలించారు. సుందర్‌రావు ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నారు. నిందితులను అదుపులోకి తీసుకున్నారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement