సాక్షి, నిజామాబాద్ : డబ్బులు కన్పించడం లేదని, నువ్వే తీసుకుని దాచిపెట్టావని ఆరోపిస్తూ కట్టుకున్న భార్యపై దాడిచేయడంతో పాటు కూరగాయలు కోసే కత్తితో కడుపులో పొడిచాడో భర్త. అనంతరం గాయంతో ఉన్న భార్యను కూతవేటు దూరంలోనే ఉన్న ప్రభుత్వ ఆస్పత్రికి తీసుకు వెళ్లకుండా సుమారు మూడు గంటల పాటు గదిలోనే పడేసి బయటకు రాకుండా చేశాడు. చివరకు సమాచారం అందుకున్న బాధితురాలి తల్లి అక్కడికి చేరుకుని అల్లుడిని పోలీసులకు పట్టించి కూతురిని పోలీసుల సహాయంతో ఆస్పత్రికి తరలించాల్సి వచ్చింది. శుక్రవారం డిచ్‌పల్లి మండలం ఘన్‌పూర్ గ్రామంలో ఈ ఘటన చోటు చేసుకుంది.
బాధితురాలి కథనం మేరకు.. డిచ్‌పల్లి మండలం నడిపల్లి తండాకు చెందిన రాథోడ్ దివ్య అలియాస్ కవిత నాలుగేళ్ల క్రితం కామారెడ్డి జిల్లా బిచ్కుందకు చెందిన రాథోడ్ రాజును ప్రేమించి పెళ్లి చేసుకుంది. ప్రస్తుతం ఇద్దరు ఘన్‌పూర్‌లో అద్దె ఇంటిలో నివసిస్తున్నారు. రాజు పెయింటర్‌గా పని చేస్తున్నాడు. నాలుగు రోజుల కిత్రం బిచ్కుందలో జరిగిన శుభకార్యానికి ఇద్దరు వెళ్లారు. అక్కడే భార్యాభర్తలు గొడవ పడి గురువారం రాత్రి ఇంటికి చేరుకున్నారు. శుక్రవారం ఉదయం 8 గంటల సమయంలో తన జేబులో డబ్బులు కన్పించడం లేదని, నువ్వే తీశావని రాజు భార్యతో గొడవ పడ్డాడు. ఆమెను కొట్టడంతో పాటు ఆవేశంతో కత్తితో కడుపుతో పొడిచాడు. దీంతో దివ్య బాధతో విలవిలలాడుతూ కేకలు వేసినా పట్టించుకోలేదు.
రక్తం కారుతుండటంతో తానే గాయానికి అడ్డుగా టవల్ కట్టాడు. ఆస్పత్రికి వెళ్లానని రోదించినా వద్దని సుమారు మూడు గంటల పాటు అడ్డుకున్నాడు. అనంతరం రాజు తన తమ్ముడికి జరిగిన సంఘటనను ఫోన్ చేసి చెప్పాడు. వెంటనే అతడు దివ్య తల్లికి ఫోన్ చేసి విషయం తెలుపడంతో ఆమె తన కొడుకు, కోడలిని తీసుకుని ఘన్‌పూర్‌కు చేరుకుంది. అల్లుడు పారిపోకుండా గదికి తాళం వేసి పోలీసులకు సమాచారం ఇచ్చింది. పోలీసులు వచ్చి నిందితుడిని అదుపులోకి తీసుకుని క్షతగాత్రురాలిని డిచ్‌పల్లి క్లస్టర్ ఆస్పత్రికి తరలించారు. ఆస్పత్రిలో ప్రాథమిక చికిత్స అందించిన వైద్య సిబ్బంది మెరుగైన చికిత్స నిమిత్తం జిల్లా కేంద్ర ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. అయితే దివ్యను కట్నం తీసుకు రమ్మని కొట్టి కత్తితో కడుపులో పొడిచినట్లు పోలీసులు కేసు నమోదు చేయడం గమనార్హం.
Comments
Please login to add a commentAdd a comment