అబిడ్స్ (హైదరాబాద్): బేగంబజార్‌కు కోల్సివాడికి చెందిన నీరజ్ పన్వార్ (21) శుక్రవారం రాత్రి 7.30 గంటల సమయంలో తన తాతతో కలిసి ద్విచక్ర వాహనంపై వెళ్తున్నాడు. చేపల మార్కెట్ సమీపంలో మాటేసిన నలుగురు దుండగులు ఒక్కసారిగా అతనిపై దాడి చేశారు. తాత నిశ్చేష్టుడై చూస్తుండగానే కత్తులతో అతి కిరాతకంగా పొడిచారు. క్షణాల్లో అక్కడినుంచి పరారయ్యారు. రక్తం మడుగులో కొట్టుమిట్టాడుతున్న నీరజ్‌ను పోలీసులు ఉస్మానియా ఆస్పత్రికి తరలించగా అప్పటికే మరణించినట్లు వైద్యులు ప్రకటించారు. ప్రేమ వివాహం చేసుకున్న నీరజ్‌పై అతని భార్య కుటుంబ సభ్యులు కక్ష పెంచుకుని హత్య చేశారని నీరజ్ తండ్రి రాజేందర్ పన్వార్ ఆరోపించారు. ఇటీవల సరూర్‌నగర్‌లో జరిగిన పరువు హత్యను మరువక ముందే చోటు చేసుకున్న ఈ ఘటన సంచలనం సృష్టించింది. స్థానికులు, పోలీసుల కథనం ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి..
నీరజ్ తన ఇంటికి సమీపంలో నివసించే వేరే కులానికి చెందిన సంజనను ప్రేమించాడు. వీరి పెళ్లికి సంజన కుటుంబసభ్యులు అంగీకరించలేదు. ఈ నేపథ్యంలో ఏడాదిన్నర క్రితం వివాహం చేసుకున్న వీరు పాతబస్తీ శంషీర్‌గంజ్‌లో ఉంటున్నారు. వారికి మూడు నెలల బాబు కూడా ఉన్నాడు. కాగా శుక్రవారం రాత్రి తాత జగదీష్ పన్వార్‌తో కలిసి కైనెటిక్ హోండాపై వెళ్తున్న నీరజ్‌ను అటకాయించిన దుండగులు కత్తులతో పొడిచి హతమార్చారు. అతని శరీరంపై 15 నుంచి 20 కత్తిపోట్లు ఉన్నట్లు పోలీసులు తెలిపారు. రద్దీగా ఉండే బేగంబజార్ రోడ్డుపై చోటు చేసుకున్న ఈ దారుణ హత్యోదంతంతో స్థానికంగా భయాందోళనలు నెలకొన్నాయి. గోషామహాల్ ఏసీపీ సతీష్‌కుమార్, షాహినాయత్‌గంజ్ ఇన్‌స్పెక్టర్ అజయ్‌కుమార్‌ల నేతృత్వంలో పోలీసులు నీరజ్‌ను ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు.
సంజన కుటుంబీకులే దాడి చేశారు
ప్రేమ వివాహం చేసుకున్నందుకే సంజన కుటుంబీకులు తన కుమారుడిపై దాడి చేసి దారుణంగా హత్య చేశారని నీరజ్ తండ్రి రాజేందర్ పన్వార్ రోదిస్తూ ఆరోపించారు. వారితో తన కుమారుడికి ప్రాణహాని ఉందని గతంలో అఫ్జల్‌గంజ్ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు కూడా చేసినట్లు తెలిపారు. ప్రేమ వివాహం చేసుకోవడంతో ఏడాదిన్నరగా కక్ష పెంచుకున్న వారు తన కొడుకును హత్య చేశారని ఆరోపించారు. తన కుమారుడని హత్య చేసిన దుండగులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. కాగా నీరజ్‌ను హత్య చేసిన వారిని పట్టుకుని కఠినంగా శిక్షిస్తామని ఏసీపీ సతీష్‌కుమార్ తెలిపారు. మొత్తం నలుగురు వ్యక్తులు నీరజ్ పన్వార్‌ను అడ్డగించి కత్తులతో దాడి చేసినట్లు తెలిపారు. క్లూస్ టీం ఘటనా స్థలంలో వివరాలు సేకరించింది.
హైదరాబాద్‌లో మరో పరువు హత్య?.. బేగంబజార్‌లో యువకుడిని ఘోరంగా చంపిన దుండగులు
Published Fri, May 20 2022 9:13 PM | Last Updated on Sat, May 21 2022 9:33 AM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment