సాక్షి, హైదరాబాద్: అంతర్జాతీయ డ్రగ్ పెడ్లర్ టోనీని న్యాయస్థానం అనుమతితో ఐదు రోజుల పాటు తమ కస్టడీలోకి తీసుకుని విచారించిన పంజగుట్ట పోలీసులు కీలకాంశాలను గుర్తించారు. దేశవ్యాప్తంగా డ్రగ్ నెట్‌వర్క్ ఏర్పాటు చేసుకున్న అతగాడు భారీ మాఫియానే నడిపాడని తేల్చారు. గతంలో టోనీ కొన్నాళ్లు హైదరాబాద్‌లో ఉన్నట్టు, ఎక్సైజ్ పోలీసులకు సంబంధించిన రెండు కేసుల్లో వాంటెడ్ అయినట్టు తేల్చారు. ఈ వివరాలు దర్యాప్తు అధికారులు గురువారం నాంపల్లి కోర్టుకు సమర్పించిన రిమాండ్ రిపోర్ట్‌లో పొందుపరిచారు. 2013 నుంచి దేశంలో అక్రమంగా నివసిస్తున్న టోనీ అనేక ప్రాంతాల్లో సంచరించాడు.
తొలుత ముంబై కేంద్రంగా డ్రగ్స్ దందా..
టోనీ ఒక్కొక్కచోట ఒక్కొక్క పేరు, గుర్తింపుతో నివసించాడు. తొలుత ముంబై కేంద్రంగా డ్రగ్స్ దందా చేశాడు. ఇతడి అనుచరులు అక్కడ అరెస్టు కావడంతో తన మకాం బెంగళూరుకు మార్చాడు. ఆ నగరంలోనూ కొన్నాళ్లు డ్రగ్స్ దందా చేసిన ఇతగాడు ఎక్కడా తన ఉనికి బయటపడనీయలేదు. ఆ నగరంలోనూ మాదక ద్రవ్యాల కేసుల్లో ఇతడి అనుచరులే పట్టుబడ్డారు. దీంతో 2019లో హైదరా బాద్‌కు వచ్చిన టోనీ టోలిచౌకిలోని అద్దె ఇంట్లో నివసించాడు. ఇక్కడ ఉన్నప్పుడు ఎస్కే చుక్స్ పేరుతో చెలామణి అయ్యాడు. బెంగళూరు నుంచి డ్రగ్స్ తెప్పిస్తూ తన అనుచరులైన ఐవరీ కోస్ట్ జాతీయులు పాట్రిక్స్, అబ్దుల్యా, కెన్యాకు చెందిన సులేమాన్ ఇబ్రహీంలతో అమ్మించాడు. ఆ ఏడాది గోల్కొండ, నాంపల్లి ఎక్సైజ్ పోలీసులు వేర్వేరు సందర్భాల్లో ఈ ముగ్గురినీ అరెస్టు చేశారు. ఆ కేసుల్లో చుక్స్‌గా టోనీ పేరు నమోదైంది. ఇప్పటికీ ఆ రెండు కేసుల్లోనూ ఇతడు వాంటెడ్‌గానే ఉన్నాడు.
నిఘా పెరగడంతో ముంబైకి..
ఇలా హైదరాబాద్‌లోనూ టోనీపై నిఘా పెరగ డంతో మళ్లీ ముంబైకి మకాం మార్చాడు. గతంలో నివసించిన ప్రాంతానికి దూరంగా అడ్డా ఏర్పాటు చేసుకున్నాడు. మరిన్ని జాగ్రత్తలు తీసుకుంటూ దందా చేస్తూ హైదరాబాద్ పోలీసులకు చిక్కాడు. టోనీ ఐదు రోజుల పోలీసు కస్టడీ ముగియడంతో పంజగుట్ట పోలీసులు అతనితో పాటు తాజాగా అరెస్టయిన ముగ్గురు అనుచరులనూ కోర్టులో హాజరుపరిచి జ్యుడీషియల్ రిమాండ్‌కు తరలిం చారు. ఈ సందర్భంగా న్యాయస్థానానికి సమర్పిం చిన రిమాండ్ రిపోర్ట్‌లో టోనీకి సంబంధించి కీలకాంశాలు పొందుపరిచారు. వీటి ఆధారంగా ఎక్సైజ్ పోలీసులు టోనీనీ పీటీ వారెంట్‌పై ఆ కేసుల్లో అరెస్టు చేయనున్నారు. ఆపై కోర్టు అనుమతితో టోనీని తమ కస్టడీలోకి తీసుకుని విచారించడానికి సన్నాహాలు చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment