సాక్షి, సిటీబ్యూరో: నల్లకుంటకు చెందిన బిల్డర్ వెంకటేశం సినిమా తీయడం కోసం బెంగళూరు హీరోయిన్‌ని బుక్ చేసుకోవాలని ప్రయత్నించారు. ఓ మధ్యవర్తిని, ఆ నటి సహాయకురాలిని నమ్మి రూ.13.5 లక్షలకు మోసపోయాడు. దీన్ని రికవరీ చేయాల్సిన బాధ్యతల్ని బంజారాహిల్స్‌కు చెందిన మేకప్ ఆర్టిస్ట్ అమర్‌నాథ్‌రెడ్డికి అప్పగించాడు. చెన్నైకి చెందిన వారి ద్వారా రూ.10 లక్షలు వసూలు చేశాడు అమర్‌నాథ రెడ్డి. అందులో వారికి రూ.4 లక్షలు ఇవ్వాల్సి ఉండగా.. అమర్‌నాథ్ రెడ్డి చెన్నై వాళ్లనూ మోసం చేశాడు. దాంతో ఈ డబ్బు రికవరీ కోసమే వచ్చిన నిందితులు అమర్‌నాథ్ రెడ్డిని కిడ్నాప్ చేశారు. ఈ కేసును బంజారాహిల్స్ పోలీసులు 10 గంటల్లోనే ఛేదించినట్లు నగర పోలీసు కమిషనర్ అంజనీకుమార్ శుక్రవారం వెల్లడించారు.
శ్రీనగర్‌కాలనీలో నివసించే కె.అమర్‌నాథ్ రెడ్డి సినీ రంగంలో మేకప్ ఆర్టిస్ట్, క్యాస్టింగ్ కోచ్, ప్రొడక్షన్ మేనేజర్‌గా పని చేస్తున్నాడు. ఈయనకు మాదాపూర్‌లోని కావూరిహిల్స్‌లో కార్యాలయం ఉంది. ప్రతిరోజూ ఉదయం వెళ్లే ఆయన రాత్రి తిరిగి వస్తుంటారు. నల్లకుంట ప్రాంతానికి చెందిన ఎస్‌వీ బిల్డర్స్ అండ్ డెవలపర్స్ యజమాని పి.వెంకటేశం ఓ చిత్రాన్ని నిర్మించాలని భావించారు. బెంగళూరుకు చెందిన నటిని ఇందులో హీరోయిన్‌గా బుక్ చేసుకోవడానికి జునైద్ అనే వ్యక్తిని సంప్రదించారు. ఇతగాడు ఆ నటి సహాయకురాలు అనుతో కలిసి వెంకటేశంను మోసం చేయాలని పథకం వేశాడు. గతేడాది అడ్వాన్సుగా రూ.13.5 లక్షలు తీసుకుని వెంకటేశంను బెంగళూరుకు పిలిపించారు. అక్కడ ఇతడిని ఓ హోటల్‌లో ఉంచి వాళ్లిద్దరూ డబ్బుతో ఉడాయించారు.
ఈ సొమ్ము వసూలు చేసి పెట్టాల్సిందిగా వెంకటేశం తన స్నేహితుడైన అమర్‌నాథ్‌రెడ్డిని కోరారు. దీనికి అంగీకరించిన ఈయన చెన్నైకి చెందిన న్యాయవాది కుమారగురుకు విషయం చెప్పారు. ఆయన సహాయంతో బెంగళూరులోని హైరోడ్ పోలీసుస్టేషన్‌లో అను, జునైద్‌లపై ఫిర్యాదు చేశారు. వీరిపై మోసం కేసు నమోదు చేసిన అక్కడి పోలీసులు రూ.10 లక్షలు రికవరీ చేసి కోర్టులో డిపాజిట్ చేశారు. డబ్బు రికవరీ చేయిస్తే రూ.4 లక్షలు చెల్లించాలని అమర్‌నాథ్‌రెడ్డి-కుమార గురు మధ్య ముందే ఒప్పందం కుదిరింది. అయితే కోర్టు నుంచి ఈ డబ్బు తీసుకున్న అమర్‌నాథ్ రెడ్డి కుమార గురుకు ఇవ్వలేదు.
ఈ విషయాన్ని కుమార గురు తన స్నేహితులైన చెన్నై వాసులు ప్రదీప్ నటరాజన్, పాలూరు లోకేష్ కుమార్, ఎస్.జగదీష్, పీకే గణేష్ కుమార్‌కు చెప్పాడు. వాళ్లు కూడా అమర్‌నాథ్‌రెడ్డిని ఫోన్‌లో సంప్రదించడానికి ప్రయత్నించినా స్పందన లేదు. దీంతో హైదరాబాద్ వెళ్లి అమర్‌నాథ్‌రెడ్డిని కిడ్నాప్ చేసి తమకు రావాల్సిన డబ్బు వసూలు చేద్దామని ప్రదీప్ పథకం వేశాడు. గురువారం ఉదయం ఈ ఐదుగురితో పాటు ప్రదీప్ గర్ల్‌ఫ్రెండ్ కీర్తన కూడా కారులో నగరానికి వచ్చింది. వీళ్లంతా వనస్థలిపురంలోని హరణి వనస్థలి పార్క్‌లో ఉన్న గెస్ట్‌హౌస్‌లో బస చేశారు. అక్కడ నుంచి మాదాపూర్‌లోని కావూరీ హిల్స్‌కు వెళ్లిన నిందితులు కీర్తన ద్వారా అమర్‌నాథ్‌రెడ్డిని ట్రాప్ చేశారు.
అర్జంట్ పని ఉందని, కలవాలంటూ సందేశం పంపిన కీర్తన తన లైవ్ లోకేషన్‌ను పంపింది. ఆమెను కలవడానికి అక్కడకు వెళ్లిన అమర్‌నాథ్ రెడ్డిని నిందితులు పట్టుకుని ఆయన కారులోనే వనస్థలిపురంలోని గెస్ట్‌హౌస్‌కు తీసుకువెళ్లారు. అక్కడ ఆయన బట్టలు విప్పి కిడ్నాపర్లు వీడియో చిత్రీకరించారు. బయటకు వెళ్లాక తమపై పోలీసులకు ఫిర్యాదు చేస్తే ఈ క్లిప్పుల్ని సోషల్‌మీడియాలో పెడతామంటూ బెదిరించారు. ఆపై ప్రదీప్ ఫోన్ నుంచి అమర్‌నాథ్ రెడ్డి భార్య కల్పనకు ఫోన్ చేయించి రూ.4 లక్షలు ప్రదీప్ ఖాతాలో డిపాజిట్ చేయాలని చెప్పించారు. తనను ఏడుగురు గుర్తుతెలియని వ్యక్తులు కిడ్నాప్ చేశారని, వారు చెప్పినట్లు చేయకపోతే చంపేస్తారంటూ అమర్‌నాథ్‌రెడ్డి చెప్పడంతో ఆందోళనకు గురైన కల్పన గురువారం మధ్యాహ్నం బంజారాహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేశారు.
ఈ మేరకు కేసు నమోదు చేసుకున్న అధికారులు ప్రత్యేక బృందాలను రంగంలోకి దింపారు. కిడ్నాపర్లను ట్రాప్ చేసి పట్టుకోవాలని నిర్ణయించుకున్న పోలీసులు ఆ మొత్తాన్ని వాళ్లే సిద్ధం చేశారు. డబ్బు ఫొటోలను కల్పన ఫోన్ నుంచి వాట్సాప్ ద్వారా ప్రదీప్‌కు పంపి, తీసుకోవడానికి శ్రీనగర్ కాలనీకి రమ్మని చెప్పారు. అక్కడ కాపు కాసిన పోలీసులు సాయంత్రం 6.30 గంటలకు అమర్‌నాథ్‌రెడ్డి కారులో వచ్చిన ప్రదీప్, కుమార గురు, లోకేష్‌లను గుర్తించారు. ఈ విషయం గుర్తించిన కిడ్నాపర్లలో ఇద్దరు పారిపోగా.. లోకేష్ చిక్కాడు. ఇతడిని విచారించిన అధికారులు దుండగులు వనస్థలిపురంలో బస చేసినట్లు తెలుసుకున్నారు. ఈ లోపు అప్రమత్తమైన నిందితులు అమర్‌నాథ్‌రెడ్డిని తీసుకుని తమ కారులో చెన్నైకు బయలుదేరారు. వెళ్తూ ఈ విషయాన్ని కల్పనకు ఫోన్ ద్వారా చెప్పి తక్షణం రూ.4 లక్షలు చెల్లించకుంటే అమర్‌నాథ్‌రెడ్డిని చంపేస్తామన్నారు.
వ్యూహాత్మకంగా వ్యవహరించిన పోలీసులు నిందితుల కదలికల్ని సెల్‌ఫోన్ సిగ్నల్స్ ద్వారా గుర్తించారు. వీళ్లు నల్లగొండ జిల్లాలోని మాడుగులపల్లి పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఆ అధికారులు తమిళనాడు రిజిస్ట్రేషన్‌తో కారులో వెళ్తున్న కుమార గురు, జగదీష్, గణేష్‌లను రాత్రి 11 గంటలకు పట్టుకున్నారు. అప్పటికే ప్రదీప్, కీర్తన వీరి నుంచి వేరు పడి బస్సులో పరారయ్యారని గుర్తించారు. ఆ కారులో ఉన్న అమర్‌నాథ్‌రెడ్డిని రెస్క్యూ చేశారు. నిందుతుల్ని సిటీకి తరలించిన పోలీసులు అనంతరం వారిని అరెస్టు చేశారు. వీరి నుంచి కారు తదితరాలు స్వాధీనం చేసుకుని పరారీలో ఉన్న వారి కోసం గాలిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment