బంజారాహిల్స్ (హైదరాబాద్): నగరంలోని ఓ ప్రైవేట్ స్కూల్లో దారుణం చోటుచేసుకుంది. డిజిటల్ క్లాస్‌లో అల్లరి చేస్తున్న సహవిద్యార్థిని వారించడమే అతడికి శాపమైంది. ఆ విద్యార్థితోపాటు అతడి స్నేహితుడూ తరగతి గదిలోనే దాడి చేశారు. గాయాలతో అపస్మారక స్థితికి చేరుకున్న బాధితుడు చికిత్స పొందుతూ కన్నుమూశాడు. శ్రీకృష్ణానగర్‌లోని బీ బ్లాక్‌కు చెందిన సయ్యద్ మంజూర్ (15) స్థానికంగా ఉన్న సాయికృప హైస్కూల్లో పదో తరగతి చదువుతున్నాడు. బుధవారం పాఠశాలకు వెళ్లిన ఇతడు మధ్యాహ్నం 12.30 గంటల సమయంలో డిజిటల్ క్లాస్ వింటున్నాడు. ఆ సమయంలో తరగతి గదిలో టీచర్లు లేరు. హైలం కాలనీకి చెందిన సహవిద్యార్థి క్లాస్ వినకుండా కాగితాలతో రాకెట్లు, పడవలు చేసి గాల్లోకి విసురుతున్నాడు.
ఇది గమనించిన మంజూర్ అతడిని వద్దంటూ వారించాడు. నన్నే నిలదీస్తావా? అంటూ అతడు రెచ్చిపోయాడు. మంజూర్ కాలర్ పట్టుకుని కొట్టాడు. అతడి స్నేహితుడు కూడా కలగజేసుకుని మంజూర్‌పై దాడి చేశాడు. ఇద్దరూ పిడిగుద్దులు కురిపించారు. మంచినీటి బాటిల్, స్కేల్‌తో కొట్టారు. ఈ దెబ్బల తాకిడికి మంజూర్ క్లాస్‌రూమ్‌లోనే కుప్పకూలి అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయాడు. దీనిపై సమాచారం అందుకున్న ఉపాధ్యాయులు మంజూర్‌ను కృష్ణానగర్‌లోని ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. అతడి పరిస్థితి గమనించిన వైద్యులు మెరుగైన చికిత్సకు సిఫార్సు చేశారు. అక్కడ నుంచి మరో ఆస్పత్రికి తీసుకువెళ్లగా పరీక్షించిన వైద్యులు గుండె కొట్టుకునే వేగం అంతకంతకూ మందగిస్తోందని గుర్తించారు. దీంతో అపోలో ఆస్పత్రికి తరలించగా, మంజూర్ చికిత్స పొందుతూ కొద్దిసేపటికే కన్నుమూశాడు.
ఫుటేజీ పరిశీలించిన పోలీసులు
మంజూర్ తండ్రి హబీబ్ ఫిర్యాదు మేరకు జూబ్లీహిల్స్ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. దీనికి సంబంధించి ఆధారాలు సేకరించారు. స్కూలు, క్లాసుల్లోని సీసీ కెమెరాల్లో రికార్డయిన ఫుటేజీలను జూబ్లీహిల్స్ డీఐ రమేష్, ఎస్‌ఐ ప్రభాకర్‌రెడ్డి పరిశీలించారు. స్కూల్ ప్రిన్సిపల్ అంజనారావు నుంచి వివరాలు సేకరించారు. డిజిటల్ క్లాస్ జరుగుతున్నప్పుడు అక్కడ ఉపాధ్యాయులు లేకపోవడంపై ఆరా తీశారు. నిర్లక్ష్యం ఉన్నట్లు తేలితే బాధ్యులపైనా చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. మంజూర్ తండ్రి నిరుద్యోగి కాగా.. తల్లి ఇళ్లలో పని చేస్తూ కుటుంబాన్ని పోషిస్తోంది. దాడి చేసిన విద్యార్థి కుటుంబమూ దిగువ మధ్యతరగతి వర్గానికి చెందినదేనని పోలీసులు చెప్తున్నారు.
ప్రైవేట్ స్కూల్లో దారుణం..పిడిగుద్దులతో విద్యార్థిపై దాడి..చివరికి..
Published Thu, Mar 3 2022 2:56 AM | Last Updated on Thu, Mar 3 2022 10:13 AM
Advertisement
Comments
Please login to add a commentAdd a comment