నిందితుడు అజయ్
సాక్షి, హైదరాబాద్: ఆన్‌లైన్ క్లాసుల నేపథ్యంలో తల్లిదండ్రుల పర్యవేక్షణ లేకపోవడం ఎలాంటి అనర్థాలకు దాని తీస్తుందో తెలిపే ఉదంతమిది. నగరానికి చెందిన ఓ బాలిక సోషల్ మీడియా ద్వారా మహారాష్ట్ర సైబర్ నేరగాళ్లకు చిక్కింది. నీ కష్టాలు తీరుస్తానంటూ యువతిగా ఆన్‌లైన్‌లో పరిచయమైన యువకుడు దగా చేశాడు. బాధితురాలి వ్యక్తిగత ఫొటోలు సేకరించి బ్లాక్‌మెయిలింగ్‌కు దిగాడు. ఎట్టకేలకు విషయం సిటీ సైబర్ క్రైమ్ పోలీసుల వద్దకు రావడంతో గురువారం కటకటాల్లోకి చేరాడు. పోలీసుల కథనం ప్రకారం వివరాలు..
మారు పేర్లతో..
►వరంగల్ జిల్లా పరకాలకు చెందిన పాలకుర్తి అజయ్ పదో తరగతి తర్వాత మల్టీమీడియా కోర్సు చేయడానికి నగరానికి వచ్చాడు. దిల్‌సుఖ్‌నగర్‌లో ఉంటూ అక్కడి ఓ ఇనిస్టిట్యూట్‌లో శిక్షణ పొందుతున్నాడు.
► ఇతగాడు యువతీ యువకుల మారుపేర్లతో ఇన్‌స్టాగ్రామ్‌లో ఏడు, ఫేస్‌బుక్‌లో ఆరు నకిలీ ఖాతాలు తెరిచాడు. వీటిని వినియోగించి అనేక మంది యువతులు, బాలికలకు ఫ్రెండ్ రిక్వెస్టులు పంపుతూ యాక్సెప్ట్ చేసిన వారితో చాటింగ్ చేస్తున్నాడు.
► నగరానికి చెందిన ఓ బాలిక ఆన్‌లైన్ క్లాసుల నేపథ్యంలో ఎక్కువగా తన ఫోన్‌తోనే ఉంటోంది. వీటితో పాటు ఆమెకు ఇన్‌స్టాగ్రామ్, ఫేస్‌బుక్‌ల్లోనూ అకౌంట్లు ఉన్నాయి. తనకు వచ్చే ఫ్రెండ్ రిక్వెస్ట్‌లను ఆలోచించకుండా యాక్సెప్ట్ చేస్తోంది.
చదవండి: ప్రేమించి పెళ్ళి చేసుకున్నా.. ఆ సంతోషం ఎక్కువసేపు నిలువలేదు
ఫొటోలను మార్ఫింగ్ చేసి..
► ఆమె ఆన్‌లైన్ కార్యకలాపాలపై తల్లిదండ్రుల పర్యవేక్షణ లేకపోవడంతో వేళకాని వేళల్లోనూ వారితో చాటింగ్ చేస్తోంది. ఇలా పుణేకు చెందిన కొందరి చేతిలో చిక్కింది. వాళ్లు ఈ బాలిక ఫొటోలు సేకరించి వాటిని అశ్లీలంగా మార్ఫింగ్ చేశారు.
► అవి బాలికకు పంపి డబ్బు కోసం బ్లాక్‌మెయిల్ చేస్తున్నారు. అదే సందర్భంలో యువతిగా అజయ్ తెరిచిన ఇన్‌స్టాగ్రామ్ ఖాతా నుంచి ఈ బాలికకు ఫ్రెండ్ రిక్వెస్ట్ వచ్చింది. ఎప్పటి లాగే దీన్ని బాలిక యాక్సెప్ట్ చేసింది.
► అప్పటి నుంచి యువతి మాదిరిగా బాలికతో చాటింగ్ చేసిన అజయ్ నమ్మకం సంపాదించాడు. దీంతో బాలిక తన ‘పుణే బాధలను’ ఈమెగా ఉన్న ఇతడికి వివరించింది. ఆమె ఇబ్బందులను క్యాష్ చేసుకోవాలని అజయ్ పథకం వేశాడు.
సెటిల్ అయిందని నమ్మించి..
► తాను కూడా ఇలానే, అదే వ్యక్తులతో బాధితురాలిగా మారానని, రూ.5 వేలు, తన వ్యక్తిగత ఫొటోలు పంపితే విషయం సెటిల్ అయిందని చెప్పి నమ్మించాడు. దీంతో అంత డబ్బు తన వద్ద లేదంటూ బాలిక వాపోయింది.
► కనీసం రూ.3 వేలు, వ్యక్తిగత వీడియోలు, ఫొటోలు పంపితే పుణే వారి వేధింపులు లేకుండా చేస్తానంటూ నమ్మబలికాడు. దీంతో బాధితురాలు తన వ్యక్తిగత ఫొటోలను ఆమెగా ఉన్న అతడికి షేర్ చేసింది.
► డబ్బును తీసుకుని దిల్‌సుఖ్‌నగర్ మెట్రో స్టేషన్ వద్దకు వచ్చి.. అక్కడి ఓ ప్రాంతంలో పెట్టాలంటూ సూచించాడు. బాధితురాలు అలాగే చేయగా ఆమె వెళ్లే వరకు చాటుగా కాపుకాసి ఆపై మొత్తం తీసుకున్నాడు.
చదవండి: ‘గల్ఫ్ నుంచి వస్తున్నా..’ అని ఫోన్ చేసి.. ముంబాయిలో దిగాడు, కానీ..
► అయినప్పటికీ పుణే నేరగాళ్ల వేధింపులు ఆగకపోవడంతో బాలిక ఆమెగా ఉన్న అజయ్‌ను సంప్రదించింది. వారి వద్ద ఉన్న వాటిని డిలిట్ చేయడానికి మరో రూ.6 వేలు డిమాండ్ చేస్తున్నారంటూ అతగాడు చెప్పాడు.
► అంత మొత్తం తన వద్ద లేకపోవడంతో బాధితురాలు విషయాన్ని కుటుంబీకులకు చెప్పింది. వారి ఫిర్యాదు మేరకు సిటీ సైబర్ క్రైమ్ ఠాణాలో పోక్సో యాక్ట్ కింద కేసు నమోదైంది. ఏసీపీ కేవీఎం ప్రసాద్ పర్యవేక్షణలో దర్యాప్తు జరిగింది.
► సాంకేతికంగా ముందుకు వెళ్లిన అధికారులు నిందితుడిని గుర్తించారు. గురువారం అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. ప్రాథమిక పరిశీలన నేపథ్యంలో అజయ్ మరికొందరు బాలికలు, యువతులను మోసం చేశాడని తేలింది.
Comments
Please login to add a commentAdd a comment