న్యూఢిల్లీ: ఐఐటీ విద్యార్థి అనగానే చదువు పూర్తి అయ్యేసరికి లక్షల్లో ఉద్యోగం లేదా సొంతంగా స్టార్టప్ కంపెనీ ఐడియాతో బయట ప్రపంచంలోకి అడుగుపెట్టాలని అందరు భావిస్తుంటారు. కానీ ఓ ఐఐటీ విద్యార్థి మాత్రం అమ్మాయిలు, టీచర్ల ఫోటోలను మార్ఫింగ్ చేసి సోషల్ మీడియాలో పోస్టు చేస్తూ చివరికి కటకటాల్లోకి వెళ్లాడు. వివరాల్లోకి వెళితే.. ఖరగ్‌పూర్ ఐఐటీలో మహవీర్ బీ.టెక్ చదువుతున్నాడు. గత కొంత కాలంగా అతను నార్త్ ఢిల్లీలోని ఓ స్కూల్‌కు చెందిన 50 మంది విద్యార్థినులను, టీచర్లను వేధింపులకు గురి చేశాడు.
ఈ క్రమంలో బాధితులను సంప్రదించడానికి మహావీర్ నకిలీ కాలర్ ఐడి, వాట్సప్‌లో వర్చువల్ నంబర్ల కోసం యాప్‌లను ఉపయోగించేవాడు. తెలివిగా తన ఐడెంటిటీ దాచేందుకు, అతను వాయిస్ మార్చే యాప్‌ని కూడా ఉపయోగించేవాడు. అమ్మాయిల పేర్లపై నకిలీ ఇన్‌స్టాగ్రామ్ ప్రొఫైల్స్‌ను క్రియేట్ చేసిన అతను .. బాధితుల మార్ఫింగ్ ఫోటోలను షేర్ చేసేవాడు. ఈ అకృత్యాలకు సంబంధించి బుధవారం పాఠశాల యాజమాన్యం నుంచి ఫిర్యాదు అందడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. పోలీసులు రంగప్రవేశం చేసి జరిపిన దర్యాప్తులో.. వేరువేరు ఇంటర్నేషనల్ నెంబర్స్ నుంచి టీచర్లకు, బాలికలకు ఫోన్ కాల్ చేసి వేధించినట్లు తెలిసింది.
ఆన్‌లైన్ క్లాసుల కోసం క్రియేట్ చేసిన వాట్సాప్ గ్రూపుల్లోకి చొరబడి ఆ ఐఐటీ విద్యార్థి వేధింపులకు పాల్పడినట్లు బాధితులు ఆరోపించారు. పోక్సో చట్టం కింద అతనిపై కేసు నమోదు చేశారు. దర్యాప్తులో భాగంగా పోలీసులు.. స్కూల్ విద్యార్థులు, టీచర్లు, తల్లిదండ్రులను కూడా విచారించారు. నిందితుడికి చెందిన పలు వాట్సాప్ వర్చువల్ నెంబర్లు, ఇన్‌స్టా ప్రొఫైల్స్, ఫేక్ కాలర్ ఐడీ యాప్‌లను గుర్తించారు. వాట్సాప్, ఇన్‌స్టా, ఐడీల లాగిన్స్‌ను పరిశీలించగా అతను పాట్నా నుంచి ఈ వ్యవహారం మొత్తాన్ని నడిపినట్లు తేలిందని పోలీసులు వెల్లడించారు.
మొదట ఓ విద్యార్థినితో పరిచయం ఏర్పరుచుకున్న మహవీర్.. ఆ తర్వాత బాలిక ఇన్‌స్టాగ్రామ్ ద్వారా ఆమె ఫ్రెండ్స్‌తో కూడా పరిచయం పెంచుకున్నాడు. ఐఐటీ విద్యార్థి కావడంతో పాటు యాప్ టెక్నాలజీలో మంచి నాలెడ్జ్ ఉండడంతో అతనికి విద్యార్థులను, మహిళలను వేధించడం సులువైంది. ఇందులో కొందరు మైనర్ బాలికలను కూడా ఉన్నట్లు పోలీసులు తెలిపారు.
చదవండి: భార్యను కొట్టి చంపి.. మృత దేహంపై కూరగాయల బస్తాలు వేసి.. సొంతూరికి
Comments
Please login to add a commentAdd a comment