నెల్లూరు(క్రైమ్): ఖమ్మం ఏజెన్సీ ప్రాంతంలో గంజాయి కొనుగోలు చేసి నెల్లూరు, తమిళనాడులో విక్రయాలు సాగిస్తున్న ఓ ముఠా గుట్టును నెల్లూరు ఎస్‌ఈబీ అధికారులు రట్టు చేశారు. ముఠాలోని ఏడుగురు సభ్యులతోపాటు నలుగురు వినియోగదారులను అరెస్ట్ చేసి వారివద్ద నుంచి రూ.15.83 లక్షలు విలువచేసే గంజాయి, కారు, 10 సెల్‌ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. నెల్లూరు జిల్లా ఎస్పీ డాక్టర్ కె.తిరుమలేశ్వరరెడ్డి ఈ కేసు వివరాలను గురువారం వెల్లడించారు. చెన్నై ఆంజనేయనగర్ ఆరో వీధికి చెందిన రాఘవన్ కావలిలో తన అత్త వద్ద ఉంటున్నాడు.
అతను ఖమ్మం జిల్లా భద్రాచలంలోని పేపర్‌మిల్లులో పనిచేస్తున్న సమయంలో గంజాయి సరఫరాదారులైన ఖమ్మం జిల్లా బూర్గంపాడు మండలం శారపాక గ్రామానికి చెందిన యు.బాలమురళీకృష్ణ, కె.సురేష్తో పరిచయం ఏర్పడింది. వారు ఏవోబీలో గంజాయి కేజీ రూ.3 వేలకు కొనుగోలు చేసి రూ.7,500కు రాఘవన్‌కు విక్రయించారు. ఆయన కావలితోపాటు తమిళనాడు రాష్ట్రంలో కేజీ రూ.15 వేలు చొప్పున విక్రయించి సొమ్ము చేసుకోసాగాడు.
ప్రస్తుతం రాఘవన్ దంపతులు కావలి తుఫాన్‌నగర్‌లో నివాసం ఉంటున్నారు. గుట్టుగా సాగుతున్న ఈ వ్యవహారంపై జిల్లా ఎస్పీ తిరుమలేశ్వరరెడ్డికి సమాచారం అందింది. ఆయన ఆదేశాల మేరకు ఎస్‌ఈబీ జిల్లా ఇన్‌చార్జ్ డి.హిమవతి పర్యవేక్షణలో ఇన్‌స్పెక్టర్ హుస్సేన్‌బాషా, నెల్లూరు–1, కావలి ఎస్‌ఈబీ ఇన్‌స్పెక్టర్‌లు కేపీ కిశోర్, శ్రీనివాసరావు తమ సిబ్బందితో కలిసి ప్రత్యేక బృందాలతో నిఘా పెట్టారు. గురువారం తుఫాన్‌నగర్‌లో రాఘవన్ దంపతులను అదుపులోకి తీసుకుని వారి వద్ద నుంచి 21 కేజీల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు.
అనంతరం వారిచ్చిన సమాచారం మేరకు శారపాకకు చెందిన బాలమురళీకృష్ణ, సురేష్, తరుణ్, దుమ్మగూడు మండలం తూరుబాక గ్రామానికి చెందిన సతీష్ను అరెస్ట్‌చేసి వారి వద్ద నుంచి 25 కేజీల గంజాయిని, కారును స్వాదీనం చేసుకున్నారు. అలాగే కావలిలోని బాలకృష్ణారెడ్డినగర్‌లో గంజాయి విక్రయదారురాలైన డి.శారదను అరెస్ట్ చేసి ఆమె వద్ద నుంచి 2 కేజీల గంజాయిని స్వాదీనం చేసుకున్నారు.
నలుగురు వినియోగదారులు
అదే క్రమంలో రాఘవన్ దంపతులు, శారదల వద్ద కావలిలోని పాతూరుకు చెందిన డి.చైతన్య, వెంగళరావ్‌నగర్‌కు చెందిన వై.లక్ష్మీప్రవీణ్‌కుమార్, ఆంధ్రావీధికి చెందిన జి.శ్రీకాంత్, శివాలయం ప్రాంతానికి చెందిన పి.ఎం.శ్రీనివాసులు గంజాయిని కొనుగోలు చేసి సేవిస్తున్నట్లు తెలియడంతో వారిని అరెస్ట్ చేశారు. వారి వద్ద నుంచి 4.2 కేజీల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు.
Comments
Please login to add a commentAdd a comment