సాక్షి, జగిత్యాల: తెలంగాణలో సంచలనంగా మారిన జగిత్యాల దీప్తి హత్య కేసులో మిస్టరీ వీడింది. దీప్తి హత్య కేసును పోలీసులు చేధించారు. ప్రియుడి సహకారంతో చెల్లినే అక్కను చంపినట్లు పోలీసుల విచారణలో తేలింది. ఇదే క్రమంలో సొంత అని కూడా చూడకుండా చందన.. దారుణానికి ఒడిగట్టింది. హత్య ప్లాన్‌లో భాగంగా వోడ్కా, బ్రీజర్ ఆమె తగించినట్టు పోలీసులు తెలిపారు.
దీప్తి హత్య కేసు వివరాలను జగిత్యాల ఎస్పీ భాస్కర్ శనివారం మీడియాకు వెల్లడించారు. "కోరుట్లకు చెందిన బంక చందన హైదరాబాద్‌లోని ఓ ప్రైవేటు కాలేజీలో బీటెక్ చదువుతోంది. ఉమర్ షేక్ సుల్తాన్(25) అనే యువకుడు చందనకు వన్ ఇయర్ సీనియర్. బీటెక్‌లో చందన ఒక ఏడాది డిటెయిన్డ్ అయింది. ఇక ఉమర్ రెండేళ్లు డిటెయిన్డ్ అయ్యాడు. దీంతో ఇద్దరు క్లాస్‌మేట్స్ అయ్యారు. ఈ క్రమంలో ఇరువురి మధ్య ఏర్పడిన పరిచయం ఏర్పడింది. ప్రేమలో పడ్డారు".
పెళ్లి ప్రపోజల్..
ప్రేమ అనంతరం.. తనను పెళ్లి చేసుకోవాలని ఉమర్‌ను చందన కోరింది. ఈ ఏడాది ఆగస్టు 19వ తేదీన ఉమర్‌ను చందన కోరుట్లకు పిలిపించింది. పెళ్లి చేసుకోవాలని అతన్ని కోరింది. అయితే, ఇద్దరు ఇంకా సెటిల్ కాకపోవడంతో తర్వాత పెళ్లికి ప్లాన్ చేద్దామని ఒప్పుకున్నారు. ఇదే విషయాన్ని వాట్సాప్ కాల్ ద్వారా ఉమర్ తల్లి సయ్యద్ అలియా, చెల్లి ఫాతిమా, స్నేహితుడు హాఫీజ్‌తో చందన మాట్లాడినట్టు తెలిపారు.
అక్కకు వోడ్కా తాగించి..
ఆగస్టు 28న కాల్ చేసి "ఓ ఫంక్షన్ నిమిత్తం మా అమ్మ, నాన్న హైదరాబాద్ వెళ్తున్నారు. ఇంట్లో నేను, మా అక్కనే ఉంటామని చందన.. ఉమర్‌కు చెప్పింది. ఇంట్లో మనీ, బంగారం ఉంది. అది తీసుకొని పోయి పెళ్లి చేసుకుంటే.. సెటిలవుతామని" చెప్పింది. ఆగస్టు 28న ఉదయం హైదరాబాద్ నుంచి కారులో బయల్దేరి 11 గంటలకు కోరుట్లకు ఉమర్ చేరుకున్నాడు. ప్లాన్‌లో భాగంగా వోడ్కా, బ్రీజర్ తెప్పించింది చందన. రాత్రి సమయంలో దీప్తి, చందన కలిసి వోడ్కా, బ్రీజర్ తాగారు. రాత్రి 2 గంటల సమయంలో ఉమర్‌కు మేసేజ్ చేయడంతో ఇంటి వెనుకాల కారు ఆపి ఇంట్లోకి వచ్చాడు. అనంతరం ఇంట్లో ఉన్న బంగారం, నగదు తీస్తున్న సమయంలో దీప్తికి మెలకువ వచ్చి లేచింది. గట్టిగా అరిచింది. చందన తన వద్ద స్కార్ఫ్‌తో దీప్తి మూతికి, ముక్కుకు చుట్టింది. ఆమె సోఫా మీద పడిపోయింది. ఉమర్, చందన కలిసి ఆమె చేతులు కట్టేశారు. గట్టిగా అరవకుండా మూతికి ప్లాస్టర్ వేశారు. పది నిమిషాల తర్వాత దీప్తిలో చలనం లేకుండా పోయిందని పేర్కొన్నారు.
డబ్బు, బంగారంతో పరారీ..
అక్క అచేతన స్థితిలో ఉండిపోవడంతో.. ఇంట్లో ఉన్న ఒక లక్షా 20 వేల నగదు, 70 తులాల బంగారం బ్యాగులో వేసుకున్నారు. ఇంటి నుంచి బయటకు వెళ్లేటప్పుడు దీప్తికి ప్లాస్టర్ తీసేసి వెళ్లారు. వోడ్కా తాగి చనిపోయినట్లు అందరు నమ్మేలా సీన్ క్రియేట్ చేశారు. తెల్లవారుజామున 5 గంటల సమయంలో హైదరాబాద్‌కు బయల్దేరారు. ఉమర్ తల్లి, చెల్లి, బంధువుకు జరిగిన విషయం చెప్పి.. నగదు, బంగారంతో.. ముంబై, నాగ్‌పూర్ వెళ్లాలని చందన, ఉమర్ ప్లాన్ చేసుకున్నారు. అక్కడే పెళ్లి చేసుకుని, సెటిల్ అవ్వాలని అనుకున్నారని ఎస్పీ పేర్కొన్నారు. ఈ కేసులో ఏ1 చందన, ఏ2 ఉమర్, ఏ3 సయ్యద్ అలియా, ఏ4 ఫాతిమా, ఏ5 హాఫీజ్‌గా చేర్చామని తెలిపారు. ఈ ఐదుగురిని కోర్టులో హాజరు పరిచి రిమాండ్‌కు తరలించినట్లు ఎస్పీ భాస్కర్ తెలిపారు.
ఇది కూడా చదవండి: సహజీవనం పేరుతో ఒక్కో సీజన్‌లో ఒక్కో భాగస్వామి.. ఆరోగ్యకరం కాదు
Comments
Please login to add a commentAdd a comment