Jaipur Police Asked Star Hotel Robbery Case Accused Details Hyderabad Cops - Sakshi
Sakshi News home page

జాడలేని దొంగ: స్టార్‌ హోటల్లే టార్గెట్‌.. రూ.19 కోట్ల చోరీ

Published Mon, Dec 6 2021 8:14 AM | Last Updated on Mon, Dec 6 2021 3:10 PM

Jaipur Police Asked Star Hotel Robbery Case Accused Details Hyderabad Cops - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: 48 ఏళ్ల వయస్సు... 29 ఏళ్ళ నేర జీవితం... 17 ఏళ్ళుగా స్టార్‌హోటల్సే టార్గెట్‌... 13 రాష్ట్రాల్లోని 19 నగరాల్లో 36 చోరీలు... దాదాపు రూ.19 కోట్ల సొత్తు అపహరణ... వివిధ రాష్ట్రాలకు మోస్ట్‌ వాంటెడ్‌... ఇంతటి ఘరానా నేరచరిత్ర కలిసిన గజదొంగ జయేష్‌ రావ్‌జీ సెజ్‌పాల్‌ కోసం రాజస్థాన్‌లోని జైపూర్‌ పోలీసులు ముమ్మరంగా గాలిస్తున్నారు. ఇతడిని ఆఖరుసారిగా 2018 మార్చ్‌లో హైదరాబాద్‌ పోలీసులు అరెస్టు చేశారు. దీంతో అతడి కదలికలపై సమాచారం ఉండే అందించాల్సిందిగా కోరారు. సెజ్‌పాల్‌ గత నెల్లో జైపూర్, ఉదయ్‌పూర్‌ల్లో రెండు నేరాలు చేశాడు.  
►గుజరాత్‌కు చెందిన జయేష్‌ రావ్‌జీ సెజ్‌పాల్‌ పదో తరగతితో చదువుకు స్వస్తి చెప్పాడు. ఆపై గుజరాత్‌తో పాటు ముంబైలో ఉన్న కొన్ని హోటల్స్‌/ఫుడ్‌ పాయింట్స్‌లో క్యాటరింగ్‌ వర్కర్‌గా పని చేశాడు.  
►ఈ రకంగా వచ్చే ఆదాయంతో బతుకీడ్చటం కష్టంగా మారడంతో 1991లో తొలిసారిగా ముంబైలోని డొంగ్రీ ఠాణా పరిధిలో చోరీ చేశాడు. అప్పట్లో బాగా క్రేజ్‌ ఉన్న వీసీపీని ఎత్తుకుపోయి పోలీసులకు చిక్కి ఆథర్‌ రోడ్‌ జైలుకు వెళ్ళాడు.  
►అక్కడే ఇతడికి రమేష్‌ ఛాగ్‌ అనే మరో నేరగాడి సలహాతో స్టార్‌ హోటళ్ళను టార్గెట్‌గా చేసుకుని నేరాలు చేయాలని పథకం వేశాడు. ఓ నగరాన్ని టార్గెట్‌గా చేసుకునే జయేష్‌ ట్రావెల్స్‌ బస్సుల్లో అక్కడకు చేరుకుంటాడు.  
►బోగస్‌ గుర్తింపుకార్డులు దాఖలు చేయడం ద్వారా మధ్య తరహా లాడ్జిల్లో బస చేస్తాడు. ఆపై ఆటోలో ఏదో ఒక స్టార్‌ హోటల్‌ వద్దకు వెళ్తాడు. కొత్తగా పెళ్ళైన జంట లేదా వివాహ వేడుకలకు హాజరైన జంటల్ని గుర్తిస్తాడు.  
►వీరి వద్దే భారీ మొత్తంలో బంగారం, వజ్రాభరణాలు ఉంటాయనే ఉద్దేశంతో వీరిని ఎంచుకుంటున్నాడు. ఒకటికి రెండుసార్లు వారిని ఫాలో అవుతూ ఏ గదిలో బస చేశారో, ఏఏ సమయాల్లో బయటకు వెళ్ళి వస్తున్నారో గుర్తిస్తాడు.  
►నీట్‌గా తయారయ్యే, పక్కా వాక్చాతుర్యం కలిగి ఉన్న జయేష్‌ ఆ హోటల్‌ సిబ్బందిని మచ్చిక చేసుకునో, బ్రేక్‌ ఫాస్ట్‌ లిస్ట్‌ ద్వారానో ఆ గదిలో బస చేస్తున్న తన ‘టార్గెట్‌’ పేరు, వివరాలు తెలుసుకుంటాడు.  
►ఆపై హోటల్‌ లాబీల్లో ఆ జంటలో ఒకరిని (రూమ్‌ ఎవరి పేరుతో బుక్కై ఉంటే వారిని) పేరుతో పలకరిస్తూ వారితో మాట కలుపుతాడు. ఇలా ఒకటిరెండుసార్లు తన టార్గెట్‌తో మాట్లాడుతూ హోటల్‌ సిబ్బంది కంటపడతాడు.  
►దీంతో వారు జయేష్‌ సదరు జంటకు బంధువో, స్నేహితుడో అయింటాడని భావిస్తారు. వీరికి ఈ భావన వచ్చిందనే నమ్మకం కలిగిన తర్వాత తన టార్గెట్‌ బయటకు వెళ్ళే వరకు ఎదురు చూస్తాడు.  
►ఆపై వారి గది ఉన్న ఫ్లోర్‌కు చేరుకుని రిసెప్షన్‌ను సంప్రదించి యాక్సిస్‌ కార్డు మర్చిపోయానంటూ చెప్పి హోటల్‌ సిబ్బందిని నమ్మిస్తాడు. వారి నుంచి మరో యాక్సిస్‌ కార్డు తీసుకుని టార్గెట్‌ చేసిన వారు బస చేసిన గదిలోకి ప్రవేశిస్తాడు.  
►చేతికి చిక్కిన బంగారం, వజ్రాల ఆభరణాలను తస్కరించి హోటల్‌ నుంచి ఆటోలో బయలుదేరి తాను బస చేసిన లాడ్జికి వెళ్తాడు. అక్కడ నుంచి సొత్తుతో సహా ముంబైకి పారిపోయి చోరీ సొత్తు విక్రయించి సొమ్ము చేసుకుంటాడు.  
►ఈ పంథాలో హైదరాబాద్‌తో పాటు విశాఖపట్నం సహా 18 నగరాల్లో నేరాలు చేశాడు. జయేష్‌ 2014లో తొలిసారిగా సిటీకి వచ్చి జూన్‌ 6న మెర్క్యూరీ హోటల్‌లో పంజా విసిరి రూ.10 లక్షల సొత్తుకు పోయాడు.  
►2016 డిసెంబర్‌ 16న అమీర్‌పేట మ్యారీగోల్డ్‌ హోటల్‌లోని రూ.4 లక్షల బంగారం ఎత్తుకుపోయాడు. 2018 మార్చ్‌ 6న బంజారాహిల్స్‌లోని పార్క్‌ హయత్‌లో రూ.30 లక్షల బంగారం చోరీ చేసి నగర పోలీసులకు చిక్కాడు.  
►బెయిల్‌పై వెళ్లిన జయేష్‌  గత నెల 20న ఉదయ్‌పూర్‌లోని హోటల్‌లో రూ.కోటి బంగారం, ఆఖరి వారంలో జైపూర్‌లోని హోటల్‌ నుంచి రూ.2 కోట్ల బంగారం, నగదు తస్కరించాడు. సీసీ కెమెరాల ఫీడ్‌ ఆధారంగా ఇతడిని గుర్తించిన రాజస్థాన్‌ పోలీసులు ముమ్మరంగా గాలిస్తున్నారు. 
►‘ఆరు రాష్ట్రాలకు వాంటెడ్‌గా ఉండగా మనం చాకచక్యంగా పట్టుకున్నాం. ఈ నేపథ్యంలోనే పరిచయస్తులైన రాజస్థాన్‌ పోలీసులు జయేష్‌ ఆచూకీ కోసం ఆరా తీశారు. మన దగ్గరి వివరాలు చెప్తున్నాం. దీనిపై ఎలాంటి అధికారిక లేఖలు లేవు. మనమిచి్చన సమాచారంతో అతడికి సూరత్‌లో పట్టుకున్నట్లు తెలుస్తోంది’ అని నగర అధికారి ఒకరు ‘సాక్షి’కి తెలిపారు.   
 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement