సాక్షి ప్రతినిధి, విశాఖపట్నం: విశాఖ విమానాశ్రయం వద్ద జనసేన రౌడీమూకలు వీరంగం సృష్టించారు. రాష్ట్ర మంత్రులపై దాడులకు తెగబడ్డారు. కర్రలు, వాటర్ బాటిళ్లు, చెప్పులు విసురుతూ తెగ రెచ్చిపోయారు. మంత్రుల భద్రతా సిబ్బంది వారిని అడ్డుకునేందుకు ప్రయత్నించినప్పటికీ.. వారిపై కూడా విచక్షణారహితంగా దాడిచేశారు.
వారి వాహనాలను చుట్టుముట్టి, కర్రలతో కొడుతూ, రాళ్లు విసురుతూ నానా బీభత్సం సృష్టించారు. మంత్రులు, మహిళలు అని ఏమాత్రం కూడా చూడకుండా జనసేన రౌడీమూకలు రెచ్చిపోయారు. దాడిచేస్తున్న సమయంలో వీరి ధోరణి చూస్తే.. పైనుంచి వచ్చిన ఆదేశాల మేరకే పక్కా ప్రణాళిక ప్రకారం నడుచుకున్నట్లు స్పష్టంగా కనిపించింది. ఇక ఈ కేసు విషయంలో శనివారం రాత్రి జనసేనకు చెందిన పలువురిని అరెస్టుచేసినట్లు సమాచారం.
‘విశాఖ గర్జన’ కార్యక్రమాన్ని ముగించుకుని విజయవాడకు వెళ్లేందుకు విమానాశ్రయానికి విడివిడిగా చేరుకున్న మంత్రులు మేరుగు నాగార్జున, జోగి రమేష్, రోజా, విడదల రజని.. విశాఖ, అనకాపల్లి, అల్లూరి సీతారామరాజు జిల్లాల రీజినల్ కోఆర్డినేటర్, టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి కార్లపై ఈ అల్లరి మూకలు విచక్షణారహితంగా దాడులకు దిగాయి.
ఎయిర్‌పోర్ట్ వద్ద ఉన్న చెత్తకుండీపైనున్న స్టీల్ మూతతో దాడిచేయగా మంత్రి రోజా వ్యక్తిగత సిబ్బందిలోని ఒకరి తలకు బలంగా గాయమైంది. దీంతో 15 నిమిషాల పాటు విమానాశ్రయం వద్ద ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఇంతలో విమానాశ్రయ భద్రతా సిబ్బంది అక్కడకు చేరుకుని మంత్రులను సురక్షితంగా ఎయిర్‌పోర్టులోకి తీసుకెళ్లారు.
వికేంద్రీకరణకు మద్దతుగా విశాఖ గర్జన కార్యక్రమం భారీ వర్షంలోనూ జన సందోహంతో విజయవంతం కావడంతో డైవర్షన్ పాలిటిక్స్‌లో భాగంగానే జనసేన రౌడీమూకలు దాడికి యత్నించినట్లు స్పష్టమవుతోంది. మరోవైపు.. విశాఖ నగర పోలీస్ కమిషనర్ సీహెచ్ శ్రీకాంత్, అదనపు కమిషనర్ (ఎస్‌బీ) ఆనందరెడ్డి విమానాశ్రయానికి చేరుకుని విచారణ చేపట్టారు.
విశాఖపై విషం..
వాస్తవానికి విశాఖపట్నం జిల్లాలోని గాజువాక నియోజకవర్గం నుంచి 2014 సార్వత్రిక ఎన్నికల్లో పవన్ పోటీచేశారు. అయితే, ఆయనకు ఇక్కడి ప్రజలు బుద్ధిచెప్పారు. దీంతో అప్పటినుంచి ఆయన.. అవకాశం ఉన్నప్పుడల్లా విశాఖపై విషం చిమ్ముతూనే ఉన్నారు. మొదటగా విశాఖ ఉక్కు ప్రైవేటీకరణపై కనీసం స్పందించని పవన్.. ‘నన్ను గెలిపించారా? నేను మాట్లాడడానికి’ అని ఎదురు ప్రశ్నించారు.
ఇప్పుడు పరిపాలన రాజధాని కోసం చేపట్టిన విశాఖ గర్జన కార్యక్రమానికి పోటీగా జనవాణి పేరుతో కార్యక్రమాన్ని నిర్వహించేందుకు ప్లాన్ చేసుకున్నారు. పక్కా ప్రణాళిక ప్రకారమే విశాఖపై విషం చిమ్మేందుకు టీడీపీ డైరెక్షన్‌లో జనసేన నేత ముందుకెళ్తున్నారన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
ముందస్తు ప్రణాళికతోనే..
వికేంద్రీకరణకు మద్దతుగా విశాఖ గర్జన కార్యక్రమాన్ని అక్టోబరు 15న నిర్వహిస్తున్నట్లు నాన్ పొలిటికల్ జేఏసీ ప్రకటించింది. ఇందుకు వైఎస్సార్‌సీపీ కూడా మద్దతు పలికింది. అయితే, అప్పటివరకు కనీసం విశాఖపట్నం కార్యక్రమాన్ని అధికారికంగా ప్రకటించని పవన్.. హడావుడిగా జనవాణి కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు తెలిపారు.
అది కూడా అక్టోబరు 16న నిర్వహించే కార్యక్రమానికి 15నే విశాఖకు వస్తున్నట్లు టూర్ షెడ్యూల్ ప్రకటించారు. దీనిపై అప్పట్లోనే వైఎస్సార్‌సీపీ నేతలు అనుమానం వ్యక్తంచేశారు. విశాఖ గర్జన కార్యక్రమం రోజునే ఎందుకు విశాఖ వస్తున్నారని.. కార్యక్రమాన్ని వాయిదా వేసుకోవాలని కోరారు. అయినప్పటికీ మొదటగా 15వ తేదీ మ.3.30 గంటలకు విశాఖ విమానాశ్రయానికి చేరుకుంటారని జనసేన నేతలు ప్రకటించారు.
ఆ తర్వాత టైం మారిపోయింది. సరిగ్గా విశాఖపట్నం నుంచి విజయవాడకు ఉన్న ఒకే ఒక విమాన సర్వీసు సమయంలోనే ఆయన విశాఖలో ల్యాండ్ అయ్యారు. అదే సమయంలో విశాఖ గర్జన ముగించుకుని విమానాశ్రయానికి చేరుకున్న వైవీ సుబ్బారెడ్డి, మేరుగు నాగార్జున, జోగి రమేష్, రోజా, రజని కార్లపై దాడికి యత్నించారు.
20 మందిపై కేసు నమోదు
విమానాశ్రయంలో మంత్రి రోజా అనుచరుడు దిలీప్‌పై దాడిచేసినందుకు జనసేన రౌడీమూకలపై 307, 324, రెడ్‌విత్ 149 సెక్షన్ల కింద పోలీసులు కేసు నమోదు చేశారు. అలాగే, పోలీసులు విధులకు ఆటంకం కలిగించినందుకు పెందుర్తి సీఐ నాగేశ్వరరావు ఫిర్యాదు మేరకు 353 సెక్షన్ కింద కేసు పెట్టారు. ఈ రెండింటిలోనూ మొత్తంగా 20 మంది జనసేన కార్యకర్తలపై కేసులు నమోదు చేశారు.
జనసేన రౌడీమూకలపై మంత్రుల ఆగ్రహం
విశాఖపట్నం విమానాశ్రయంలో జనసేన రౌడీమూకలు వీరంగం సృష్టించడంపై రాష్ట్ర మంత్రులు మేరుగు నాగార్జున, ఆర్కే రోజా, విడదల రజని తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేశారు. విశాఖ నుంచి గన్నవరం విమానాశ్రయానికి చేరుకున్న మంత్రులు మీడియాతో మాట్లాడుతూ.. జనసేన కార్యకర్తల తీరును తీవ్రంగా తప్పుబట్టారు.
రాష్ట్రంలోని మూడు ప్రాంతాలను సమానంగా అభివృద్ధి చేయాలనే ఆకాంక్షతో సీఎం వైఎస్ జగన్ పరిపాలన సాగిస్తున్నారని.. ఇది తట్టుకోలేని ప్రతిపక్షనేత చంద్రబాబుతో పాటు పవన్‌కళ్యాణ్ రాష్ట్రంలో అల్లర్లు సృష్టించేందుకు కుట్రపూరితంగా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. ఉత్తరాంధ్ర ఉద్యమానికి మద్దతుగా వెళ్లిన ఉమ్మడి విశాఖ జిల్లా రీజనల్ కోఆర్డినేటర్, మంత్రుల కార్లపై దాడిచేయడం దారుణమన్నారు.
అఘాయిత్యాలు, అమానుషాలు చేసి ప్రజలను భయపెట్టి గెలవాలనుకోవడం పవన్ అవివేకమన్నారు. తాము కూడా అలాగే ప్రవర్తిస్తే జనసేన మూకలు కనిపించరని వారు తెలిపారు. పవన్‌కు అమరావతి మాత్రమే కావాలనుకుంటే స్పష్టంగా చెప్పాలని సూచించారు. ఆయన బలమేమిటో 2019 ఎన్నికల్లోనే తెలిసిపోయిందని.. ఇప్పటికైనా పవన్‌కళ్యాణ్ వీలుంటే సినిమాలు తీసుకోవాలని.. ప్రాంతాల మధ్య విద్వేషాలు రెచ్చగొడితే సహించేదిలేదని మంత్రులు హెచ్చరించారు.
జనసేన రౌడీమూకలు రాళ్లు, కర్రలతో తమ కార్లపై విరుచుకుపడడంతో ఒక్కసారిగా భయభ్రాంతులకు గురయ్యామని.. ఎంత బతిమలాడినా వినకుండా కార్లపై రాళ్లు, కర్రలు విసిరారని వారు వివరించారు. దాదాపు 20 నిమిషాలపాటు నరకాన్ని ప్రత్యక్షంగా చూశామన్నారు. ఈ దాడికి పవన్ కళ్యాణ్ బాధ్యత వహించాలని వారు డిమాండ్ చేశారు.
చట్టపరమైన చర్యలు తీసుకుంటాం
విశాఖ విమానాశ్రయ వద్ద సంఘటన జరిగిన తీరును పరిశీలించాం. అక్కడ సీసీ కెమెరాల దృశ్యాలనూ చూశాం. దాడి జరిగిన తీరును, అందుకు బాధ్యులపై న్యాయపరంగా ముందుకెళ్తాం. నిర్వాహకులు ర్యాలీకి ఎటువంటి అనుమతి పొందలేదు. అయినప్పటికీ ట్రాఫిక్‌కు అంతరాయం కలిగిస్తూ నిబంధనలకు విరుద్ధంగా రోడ్ల మీద ప్రదర్శన చేశారు. దీనిపై చట్టపరంగా చర్యలు తీసుకుంటాం.
– శ్రీకాంత్, నగర పోలీసు కమిషనర్
దాడులపై ఎవరేమన్నారంటే..
జనసేన రౌడీమూకల, ఆరాచక శక్తుల వికృత చేష్టలు, భౌతిక దాడులను వైఎస్సార్‌సీపీ సహించదు. భవిత్యత్తులో ఇలాంటివి పునరావృతం అయితే చూస్తూ ఊరుకోం.
– వి. విజయసాయిరెడ్డి, వైఎస్సార్‌సీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి
మంత్రుల కార్లపై దాడికి పాల్పడిన జనసేన రౌడీమూకలు, అందుకు ప్రోత్సహించిన వారిపై సమగ్ర విచారణ జరిపి చట్టపరమైన చర్యలు తీసుకుంటాం. దాడికి పాల్పడడం హేయమైన చర్య.
– తానేటి వనిత, హోంమంత్రి
పవన్‌కళ్యాణ్ ఉన్మాదాన్ని ప్రేరేపిస్తూ యువతను రెచ్చగొడుతున్నారు. మొదట్నుంచీ హింసావాదాన్ని రెచ్చగొట్టడం ఆయనకు పరిపాటిగా మారిపోయింది. విద్వేషాలు రెచ్చగొట్టాలనే ఉద్దేశంతోనే పవన్ విశాఖకు వెళ్లారు.
– కొట్టు సత్యనారాయణ, డిప్యూటీ సీఎం
ఎప్పుడూ సుద్దులు చెప్పే పవన్‌కళ్యాణ్ తక్షణం దీనిపై స్పందించాలి. ఒక్క సీటు కూడా లేకపోతేనే జన సైనికులు ఇలా ఉంటే, మరి ఐదారు సీట్లు వస్తే రాష్ట్రాన్ని ఏం చేస్తారో.
– అంబటి రాంబాబు, జల వనరుల శాఖ మంత్రి
జనసేన అల్లరిమూకలను పవన్ అదుపు చేసుకోకపోతే తీవ్రమైన పరిణామాలు ఎదుర్కోవలసి వస్తుంది. మేం తలుచుకుంటే రాష్ట్రంలో నీవు తిరగగలవా? మా నాయకులకు క్షమాపణ చెప్పకపోతే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవలసి వస్తుంది.
– సామినేని ఉదయభాను, ప్రభుత్వ విప్, జగ్గయ్యపేట ఎమ్మెల్యే
Comments
Please login to add a commentAdd a comment