భాస్కర రాజు (ఫైల్)
మొయినాబాద్: రంగారెడ్డి జిల్లా మొయినాబాద్ మండలం అమ్డాపూర్ చౌరస్తాలో ఉన్న జేబీఐటీ ఇంజనీరింగ్ కళాశాలకు చెందిన ఓ విద్యార్థి శనివారం ఆత్మహత్య చేసుకున్నాడు. కరీంనగర్ జిల్లాకు చెందిన గజ్జెల కృష్ణ విజయ భాస్కర్‌రాజు(20) బీటెక్ రెండో సంవత్సరం చదువుతూ కళాశాల క్యాంపస్‌లోని హాస్టల్‌లో ఉంటున్నాడు. శనివారం ఉదయం 9.30 గంటల సమయంలో విద్యార్థులంతా తరగతులకు వెళ్లాక హాస్టల్ గదిలోని ఫ్యాన్‌కు అతడు ఉరేసుకున్నాడు.
హాస్టల్ సిబ్బంది గమనించి పోలీసులకు సమాచారమిచ్చారు. పోలీసులు ఘటనాస్థలానికి వచ్చి మృతదేహాన్ని వెంటనే ఉస్మానియా ఆసుపత్రి మార్చురీకి తరలించారు. తల్లిదండ్రులు, బంధువులెవరూ రాక ముందే మృతదేహాన్ని ఆగమేఘాల మీద తరలించడం పలు అనుమానాలకు తావిస్తోంది. సాయం త్రం 6.30 గంటలకు ఆ విద్యార్థి తల్లిదండ్రులు ఉస్మానియా ఆసుపత్రికి చేరుకున్నారు. కళాశాల యాజమాన్యం వేధించడం వల్లే తమ కుమారుడు ఆత్మహత్య చేసుకుని ఉండొచ్చని వారు అనుమానం వ్యక్తం చేశారు.
విద్యార్థుల ఆందోళన
విద్యార్థి ఆత్మహత్య ఘటనపై జేబీఐటీ కళాశాల ఆవరణలో తోటి విద్యార్థులు ఆందో ళనకు దిగారు. కళాశాల చైర్మన్ వచ్చి బాధిత కుటుంబానికి న్యాయం చేయాలని, విద్యార్థుల సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేశారు. రాజేంద్రనగర్ ఏసీపీ గంగాధర్ విద్యార్థులకు నచ్చజెప్పేందుకు విఫలప్రయత్నం చేశారు. పరిస్థితి ఉద్రిక్తతంగా మారుతోందని భావించి కొంతమంది విద్యార్థులను అదుపులోకి తీసుకుని రాజేంద్రనగర్ పోలీస్‌స్టేషన్‌కు తరలించారు.
విద్యార్థి ఆత్మహత్యకు కళాశాల యాజమాన్యం వేధింపులే కారణమంటూ విద్యార్థులు ఆరోపించారు. ఫీజు కోసం కళాశాల యాజమాన్యం వేధించిందని, అందుకే ఆత్మహత్యకు పాల్పడి ఉంటాడని ఆరోపించారు. మూడురోజుల క్రితం కృష్ణ విజయభాస్కరరాజు ఫుడ్ పాయిజన్‌తో అస్వస్థతకు గురయ్యాడని, వైద్యం చేయించుకున్న తరువాత తల్లిదండ్రులకు ఫోన్ చేసి విషయం చెప్పడంతో శుక్రవారం రాత్రి వార్డెన్, యాజమాన్యం కృష్ణను మందలించారని విద్యార్థులు ఆరోపించారు.
Comments
Please login to add a commentAdd a comment