►జూన్ 17న వరకట్న వేధింపుల కేసులో స్టేషన్ బెయిల్ ఇవ్వడానికి బెజ్జారపు రాజేశ్ అనే వ్యక్తి నుంచి జగిత్యాల టౌన్ ఎస్‌ఐ శివకృష్ణ, అతని వాహన డ్రైవర్ రవి రూ.30 వేలు తీసుకుంటూ ఏసీబీ అధికారులకు పట్టుబడ్డాడు. రూ.50 వేలు డిమాండ్ చేయగా రూ.30 వేలకు బేరం కుదుర్చుకున్నారు. చివరకు లంచంగా తీసుకుంటుండగా పట్టుబడ్డారు.
►జూన్ 27న జగిత్యాల జిల్లా కథలాపూర్ ఎస్‌ఐ పృథ్వీధర్ గౌడ్ ఓ ఇసుక ట్రాక్టర్‌ను వదిలిపెట్టేందుకు రూ.10 వేలు అడుగగా బాధితుడు ఉప్పరపల్లి నాగరాజు ఏసీబీ అధికారులను ఆశ్రయించాడు. రైటర్ రమేశ్ తీసుకుంటుండగా ఏసీబీ వారు పట్టుకొనికేసు నమోదు చేసి అరెస్టు చేశారు.
►జూన్ 25న గంగాధర పోలీస్‌స్టేషన్‌లో ఏఎస్‌ఐగా విధులు నిర్వహిస్తున్న ఏఎస్‌ఐ చంద్రారెడ్డి ఒక కేసు విషయంలో వారికి అనుకూలంగా వ్యవహరించి రాజమల్లు అనే వ్యక్తి నుండి రూ.15 వేలు తీసుకుంటుండగా ఏసీబీ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
సాక్షి ప్రతినిధి, కరీంనగర్: ఇసుక ట్రాక్టర్లు యథేచ్ఛగా నడవాలన్నా.. భూ తగాదాలు, ఎస్సీ, ఎస్టీ కేసులు సెటిల్ కావాలన్నా.. సాధారణంగా సంబంధిత స్టేషన్‌లో ‘ముట్ట జెప్పడం’ ఆనవాయితీ. ఎస్‌ఐ, సీఐ లకు వెళ్లే మామూళ్లను బట్టి కేసుల పురోగతి ఉంటుంది. అయితే.. ఇటీవల ప్రజల్లో వచ్చిన చైతన్యంతో అవినీతికి పాల్పడుతున్న పోలీస్ అధికారులు సైతం అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ)కు పట్టుపడుతున్నారు. గత నెలలో ఉమ్మడి జిల్లాలో ఏకంగా ఐద్దరు ఎస్సైలు,ఒక ఏఎస్సై ఏసీబీకి చిక్కారు. అయితే.. ఏసీబీ వలలో చిక్కుతున్న ఎస్‌ఐ, సీఐలు నేరమంతా తమపైనే వేసుకొని పై అధికారులను కేసుల నుంచి తప్పించి రక్షిస్తున్నారనే వాదనలు వినిపిస్తున్నాయి.
పోలీస్‌స్టేషన్‌లలో జరిగే దందాలో ఒకరిద్దరు డివిజన్ స్థాయి అధికారుల ప్రమేయం అధికంగా ఉంటుందన్న ఆరోపణలున్నాయి. ఎస్‌ఐ, సీఐ స్థాయి అధికా రులు కొందరు డివిజన్ స్థాయి అధికారులకు కేసులు, స్టేషన్లను బట్టి మామూళ్లు పంపిస్తున్నా, అవేవీ రికార్డుల్లో ఉండడం లేదు. జిల్లా స్థాయిలో ఎస్‌పీలు, కమిషనర్లకు ఆయా డివిజన్ అధికారుల దందాల గురించి తెలిసినా, వాళ్లకున్న రాజకీయ అండదండల కారణంగా ఏమీ చేయలేని పరిస్థితి. ఉన్నతస్థాయి అధికారులకు డివిజన్ అధికారుల తీరును నివేదించి చేతులు దులుపుకుంటున్నారు.ఈ నేపథ్యంలో అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న ఓ అధికారి తీరు ఇప్పుడు పోలీసుల్లో చర్చనీయాంశమైంది.
కేసు నుంచి తప్పించేందుకు రూ.1.20 లక్షల ఐఫోన్
ఉమ్మడి జిల్లాలోని ఓ పోలీసు అధికారి ఏడాది క్రితం ఓ కేసులో నిందితున్ని తప్పించేందుకు రూ.1.20 లక్షల విలువైన ఐఫోన్ కొనుగోలు చేయించుకుని చివరికి నిందితున్ని రిమాండ్‌కు తరలించిన ఘటన పోలీస్ వర్గాల్లో వైరలైంది. ఉమ్మడి కరీంనగర్‌లో ఏర్పాటైన కొత్త జిల్లాలోని ఓ గ్రామంలో ఏడాది క్రితం ఓ వ్యక్తి అదే గ్రామానికి చెందిన మహిళ వద్ద మధ్యవర్తి సహాయంతో 30 గుంటల భూమిని కొనుగోలు చేశాడు. రిజిస్ట్రేషన్ సమయంలో కొనుగోలు చేసిన వ్యక్తి వద్ద పూర్తిస్థాయిలో డబ్బులు లేకపోవడంతో ఆ భూమిని బుగ్గారం మండల కేంద్రానికి చెందిన ఓ వ్యక్తికి రిజిస్ట్రేషన్ చేశారు. దీంతో మధ్యవర్తిగా ఉన్న వ్యక్తికి కమీషన్ రాకపోవడంతో వారి మధ్య గొడవ జరిగింది.
►ఈ కేసు పోలీస్‌స్టేషన్‌కు వెళ్లడం, చివరికి ఉన్నతాధికారి వద్దకు విచారణకు వెళ్లడంతో బాధితుడు కేసు మాఫీ కోసం రూ.1.20 లక్షల విలువైన ఐఫోన్ సమర్పించుకోవలసి వచ్చింది. అయినా.. చట్టం పేరుతో బాధితున్ని పోలీసు అధికారి రిమాండ్‌కు తరలించారు. దీంతో సదరు బాధితుడు పోలీసు అధికారిపై ఉన్నతస్థాయిలో ఫిర్యాదు చేశాడు.
►సదరు పోలీసు అధికారి తనకు సన్నిహితుడైన ఓ వ్యక్తి కూతురు వివాహానికి ఆ పరిధిలో పనిచేసే ఎస్‌ఐ 2 క్వింటాళ్ల బియ్యం, 2 గొర్రె పొట్టేళ్లు పంపించాలని ఆదేశించారు. దీంతో అక్కడి ఎస్సై కూడా అధికారి మాట ప్రకారం బియ్యంతో పాటు గొర్రె పొట్టేళ్లను అప్పగించాడు.
►కరీంనగర్ నుంచి కొత్త జిల్లా కేంద్రానికి వెళ్లే జాతీయ రహదారి పక్కన బుగ్గారంకు చెందిన ఓ వ్యక్తి 20 గుంటల భూమిని కొనుగోలు చేశాడు. భూ విక్రయదారునికి, కొనుగోలుదారునికి రోడ్డు విస్తరణపై విభేదాలు రావడంతో పోలీ స్‌స్టేషన్‌ను ఆశ్రయించారు.సమస్య పరిష్కారం కోసం పోలీసు అధికారి రూ.లక్ష తీసుకొని విక్రయదారునికే వత్తాసు పలికినట్లు ఆరోపణ.
►నెల రోజుల క్రితం రూ.20 వేల విలువ గల కాస్మోటిక్స్‌ను ఆన్‌లైన్‌లో ఆర్డర్ చేసి, ఆ డబ్బును తన పరిధిలో పనిచేస్తున్న ఓ ఎస్‌ఐ ద్వారా చెల్లించినట్లు సమాచారం.
►తన కుటుంబ సభ్యులు ఇతర ప్రాంతాలకు వెళ్తే తన కింద పనిచేసే ఎస్‌ఐల ద్వారా అద్దె కారు ఎంగేజ్ చేయిస్తున్నట్లు పోలీసులు చెపుతున్నారు.
►ప్రభుత్వం పోలీస్‌స్టేషన్‌లో ఉన్న వాహనం నిర్వహణకు ఒక్కో పోలీస్‌స్టేషన్‌కు 110 లీటర్లకు బిల్లులు చెల్లిస్తోంది. ఇందులో ప్రతినెలా 50 లీటర్ల డీజిల్ పోలీసు అధికారికే అప్పగిస్తున్నారనే ఆరోపణలున్నాయి.
సీనియర్ మంత్రితో విభేదాలు..
ఉమ్మడి జిల్లాకు చెందిన ఓ సీనియర్ మంత్రి ప్రాతినిథ్యం వహిస్తున్న నియోజకవర్గంలో రెండు అక్రమ కేసులు నమోదు చేయించినట్లు ఆరోపణ. ఈ మేరకు మంత్రి అతనిపై కొంత కాలంగా ఆగ్రహంతో ఉన్నారు. దీంతోపాటు జిల్లా కేంద్రంలోని ఓ భూ సెటిల్‌మెంట్‌లో కూడా అధికారి పాత్ర ఉందని మంత్రి ఆగ్రహంతో ఉన్నారు. సదరు అధికారిని కలిసేందుకు కూడా మంత్రి సుముఖత చూపలేదని సమాచారం. దీంతో అధికారి ఇతర ప్రాంతాలకు బదిలీ చేయించుకునేందుకు రాష్ట్రస్థాయిలో ప్రయత్నాలు చేస్తున్నట్లు సమాచారం.
Comments
Please login to add a commentAdd a comment