చీటీలు, ఉద్యోగాల పేరుతో రూ. కోట్లు వసూళ్లు
మద్దూరులో చిరుద్యోగ దంపతుల బడా మోసం
మండ్య: చీటీలు, అధిక వడ్డీ, ఉద్యోగం ఇప్పిస్తామని ఆశ చూపి ప్రభుత్వ ఉద్యోగులు, మహిళలు, ప్రజల నుంచి కోట్లాది రూపాయల నగదు, బంగారు ఆభరణాలను కాజేసిన కిలాడీ దంపతులను జిల్లాలోని మద్దూరు పోలీసులు అరెస్ట్ చేశారు.
రూ. 5 కోట్లకు పైగా స్వాహా
వివరాలు...మద్దూరు పట్టణంలోని లీలావతి బడావణెకు చెందిన సీఆర్ దివ్యరాణి, ఆమె భర్త చందన్, చందన్ సోదరుడు నూతన్‌లు ఈ కేసులో సూత్రధారులు. మళవళ్లి ప్రభుత్వ ఆస్పత్రి ల్యాబ్ టెక్నీషియన్‌గా ఉన్న దివ్యరాణి, అదే ఆస్పత్రిలో పని చేసే గ్రూప్ డీ ఉద్యోగి చందన్. మద్దూరులోని లీలావతి బడావణెలో అద్దె ఇంట్లో నివాసం ఉన్నారు. మూడో నిందితుడు నూతన్ మైసూరులో కేఎస్‌ఆర్టీసీ మెకానిక్ సెక్షన్‌లో పని చేస్తున్నాడు. వీరు మండ్య వైద్య కళాశాల, మళవళ్లి ఆస్పత్రి వైద్యులు, నర్సులు, డీ గ్రూప్ ఉద్యోగులతో పాటు క్షయ ఆస్పత్రి కార్యాలయ సిబ్బంది, తూడినకెరె హొరావరణ కేంద్రం సిబ్బందితో చీటీలు, అధిక వడ్డీ ఆశ చూపి సుమారు రూ.5 కోట్లకు పైగా వసూలు చేశారు.
అలాగే పలువురు మహిళలకు మాయమాటలు చెప్పి సుమారు రూ.70 లక్షల విలువ చేసే బంగారు నగలను తీసుకుని పరారయ్యారు. బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేయగా గాలింపు చేపట్టడంతో దంపతులు తురువేకెరెలో తలదాచుకున్నారు. చివరకు వారిని పట్టుకున్నారు. మన్‌ముల్ పాల డెయిరీలో, ఆరోగ్య శాఖలో ఉద్యోగాలిప్పిస్తామని అనేకమంది నుంచి లక్షలాది రూపాయలను వసూలు చేశారు. రామనగర, కేఆర్‌నగరలో ప్యారా మెడికల్ కాలేజీ ప్రారంభిస్తామని చెప్పి పెద్దమొత్తాల్లో అప్పులు చేశారు. నిందితులను మద్దూరు కోర్టులో హాజరుపరిచి జైలుకు తరలించారు. విచారణలో వీరి మోసాలన్నీ బయటపడే అవకాశముంది
Comments
Please login to add a commentAdd a comment