సాక్షి, అమరావతి: ఊహించిందే జరుగుతోంది! స్కిల్ డెవలప్‌మెంట్ స్కామ్ కేసు దర్యాప్తును పక్కదారి పట్టించేందుకు కుట్రలకు తెర తీసిన టీడీపీ.. కీలక సాక్షులను ప్రభావితం చేస్తోంది. ఈ స్కామ్‌లో అక్రమ నిధుల తరలింపులో కీలక పాత్రధారిగా ఉన్న లోకేశ్ సన్నిహితుడు కిలారు రాజేశ్ సీఐడీ దర్యాప్తునకు డుమ్మా కొట్టడమే దీనికి నిదర్శనం. తాడేపల్లిలో సీఐడీ ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) కార్యాలయంలో సోమవారం విచారణకు హాజరైన ఆయన రెండో రోజు మంగళవారం మాత్రం ముఖం చాటేశారు. సిట్ అధికారులు తనను ఎన్నిసార్లు పిలిచినా విచారణకు వస్తానంటూ నమ్మబలికిన కిలారు రాజేశ్ రెండో రోజు మాత్రం గైర్హాజరయ్యాడు. తాను ప్రస్తుతం విచారణకు రాలేనని, దసరా తరువాత వస్తానంటూ ఈ మెయిల్ పంపడం గమనార్హం.
తొలుత పరారై..
టీడీపీ హయాంలో జరిగిన కుంభకోణాల్లో నారా లోకేశ్, కిలారు రాజేశ్ ప్రధాన పాత్ర పోషించినట్లు సీఐడీ ఇప్పటికే గుర్తించింది. అదే విషయాన్ని సీఐడీ అదనపు డీజీ సంజయ్ ప్రకటించడంతో ఆందోళనకు గురైన మాజీ సీఎం చంద్రబాబు వెంటనే అజ్ఞాతంలోకి వెళ్లాలని కిలారు రాజేశ్‌ను ఆదేశించారు. దీంతో ఆయన చాలా రోజులు అదృశ్యమయ్యారు. చంద్రబాబు మాజీ పీఎస్ పెండ్యాల శ్రీనివాస్, షెల్ కంపెనీల ప్రతినిధి మనోజ్ పార్థసాని అప్పటికే విదేశాలకు పరారు కావడం గమనార్హం. చంద్రబాబు బెయిల్ పిటిషన్‌ను వ్యతిరేకిస్తూ సీఐడీ తరపు న్యాయవాదులు ఇదే వ్యవహారాన్ని ప్రధానంగా ప్రస్తావించారు. కేసు దర్యాప్తునుచంద్రబాబు ప్రభావితం చేస్తున్నారని, సాక్షులను బెదిరిస్తున్నారని న్యాయస్థానం దృష్టికి తెచ్చారు.
అనివార్యంగా హాజరు..
అనివార్యంగా హాజరు కావాల్సి రావడంతో సోమవారం సిట్ కార్యాలయానికి వచ్చిన కిలారు రాజేష్ విచారణకు ఏమాత్రం సహకరించలేదు. కీలక ఆధారాలను ప్రదర్శిస్తూ సిట్ అధికారులు ప్రశ్నల వర్షం కురిపించడంతో బెంబేలెత్తారు. ప్రధానంగా బ్యాంకు లావాదేవీలు, కాంట్రాక్టులకు సంబంధించిన పత్రాల గురించి సిట్ అధికారులు ప్రశి్నంచినట్లు సమాచారం. ప్రస్తుతం అవి తనవద్ద లేవని, ఇంట్లో ఉన్నాయని, సమయం ఇస్తే వాటిని తెస్తానని చెప్పిన కిలారు రాజేశ్ మర్నాడు పత్తా లేకుండా పోవడం గమనార్హం.
లోకేశ్ వార్నింగ్‌తో మళ్లీ అజ్ఞాతంలోకి
స్కిల్ స్కామ్‌లో నిధుల మళ్లింపుపై సిట్ కీలక ఆధారాలను సేకరించినట్లు గుర్తించిన లోకేశ్, ఆయన న్యాయ నిపుణుల బృందం కిలారు రాజేశ్ వరుసగా రెండో రోజు విచారణకు హాజరైతే మరిన్ని ఆధారాలు వెలుగు చూడటం ఖాయమని ఆందోళన చెందింది. సిట్ అధికారులు అడిగిన పత్రాలను ఇవ్వొద్దని, రెండో రోజు విచారణకు హాజరుకావొద్దని అతడిని లోకేశ్ ఆదేశించినట్లు సమాచారం. కేసు విచారణకు ఎట్టి పరిస్థితుల్లోనూ సహకరించవద్దని, లేదంటే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుందని లోకేష్ హెచ్చరించినట్లు తెలిసింది.
దీంతో దసరా తరువాత మాత్రమే విచారణకు వస్తానంటూ మెయిల్ పంపిన కిలారు మళ్లీ అజ్ఞాతంలోకి వెళ్లిపోయాడు. రాజమహేంద్రవరం సెంట్రల్ జైల్లో రిమాండ్ ఖైదీగా ఉంటూనే సాక్షులను ఈ స్థాయిలో బెదిరిస్తున్న చంద్రబాబు బెయిల్‌పై బయటకు వస్తే ఈ కేసులో కీలక సాక్షులను మరింత ఒత్తిడికి గురి చేసిదర్యాప్తును పూర్తిగా పక్కదారి పట్టించే అవకాశం ఉందని న్యాయ నిపుణులు పేర్కొంటున్నారు. కిలారు రాజేశ్ గైర్హాజరును న్యాయస్థానం పరిగణనలోకి తీసుకోవాల్సిన అవసరం ఉందని స్పష్టం చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment