
వెంకటయ్య (ఫైల్), తులసీ (ఫైల్)
కలువాయి (నెల్లూరు జిల్లా): ప్రేమజంట బలవన్మరణానికి పాల్పడింది. మండలంలో మూడురోజుల క్రితం జరిగిన ఈ ఘటన శుక్రవారం వెలుగు చూసింది. పోలీసులు కథనం మేరకు.. స్థానిక గిరిజన కాలనీకి చెందిన మానికల వెంకటయ్య (19) తల్లిదండ్రులు చనిపోవడంతో తన అన్న చంద్రయ్య, వదిన ముత్యాలమ్మ సంరక్షణలో ఉండేవాడు. అదే కాలనీకి చెందిన నాగముంతల తులసయ్య, పోలమ్మల కుమార్తె నాగముంతల తులసీ (16) కొంతకాలంగా ప్రేమించుకుంటున్నారు.
తాము పెళ్లి చేసుకునేందుకు పెద్దలు అంగీకరించరని వారు భావించారు. మూడురోజుల క్రితం ఇద్దరూ కలిసి ఇంటి నుంచి వెళ్లిపోయారు. అప్పటినుంచి రెండు కుటుంబాలు వారి కోసం గాలిస్తున్నాయి. శుక్రవారం కలువాయి సమీపంలోని అటవీ ప్రాంతంలో ఇద్దరి మృతదేహాలను గొర్రెలకాపరులు చూసి గ్రామస్తులకు సమాచారం ఇచ్చారు. సంఘటనా స్థలంలో గుళికల మందు లభించింది. దీంతో వారు గుళికలు తిని ఆత్మహత్యకు పాల్పడి ఉంటారని భావిస్తున్నారు. ఈ ఘటనతో కలువాయి గిరిజన కాలనీలో విషాదం నెలకొంది.
సమాచారం అందుకున్న పొదలకూరు సీఐ సంగమేశ్వరరావు, కలువాయి ఎస్సై ప్రభాకర్ పోలీస్ సిబ్బందితో సంఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment